AP Government: 1,200 రూపాయిలు క్వింటా ఉల్లి
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:25 AM
ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ధర పతనమై దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను మేమున్నామంటూ ఆదుకుంది. క్వింటా ఉల్లిని రూ.1,200లకు కొనుగోలు చేసేలా చంద్రబాబు..
ప్రభుత్వ కొనుగోళ్లతో అన్నదాతల్లో ఆనందం
మూడు రోజుల్లో 4,817 క్వింటాళ్ల కొనుగోలు
మార్కెట్‌కు పోటెత్తుతున్న పంట
వైసీపీ హయాంలో రేటు లేక పారబోసిన రైతులు
కర్నూలు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ధర పతనమై దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను మేమున్నామంటూ ఆదుకుంది. క్వింటా ఉల్లిని రూ.1,200లకు కొనుగోలు చేసేలా చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆది, సోమ, మంగళవారాల్లో 4,817 క్వింటాళ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మార్కెట్‌కు వచ్చిన 99 శాతం ఉల్లిని కొని.. రైతు బజార్లకు తరలిస్తోంది. దీనిపై రాయలసీమ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి దిగుబడులతో పెద్ద ఎత్తున రైతులు కర్నూలు మార్కెట్‌కు వస్తున్నారు. 2018లోనూ ధరలు పతనమైతే.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కనీస మద్దతు ధరను క్వింటా రూ.700గా నిర్ణయించింది. వ్యాపారులు కొనుగోలు చేసిన ధరపై మిగిలిన మొత్తాన్ని బోన్‌సగా ఇచ్చారు. ఉదాహరణకు క్వింటా రూ.300లకు వ్యాపారి కొంటే ప్రభుత్వం రూ.400 బోనస్ ఇచ్చింది.
వైసీపీ మద్దతు ధర.. ప్రకటనలకే పరిమితం
2019లో వైసీపీ ప్రభుత్వం ఉల్లి గిట్టుబాటు ధరను రూ.770 ప్రకటించినా అది ప్రకటనలకే పరిమితం అయ్యింది. 2022 సెప్టెంబరులో ఉల్లి క్వింటా రూ.350 నుంచి రూ.500లకు మించి రాలేదు. అప్పటి వైసీపీ ప్రభుత్వం పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయలేదు.. బోనస్ కూడా ఇవ్వలేదు. దీంతో రైతులు పంటను రోడ్లపై పారబోయాల్సి వచ్చింది. గతేడాది ధరలు ఆశాజనంగా ఉండడంతో ఈ ఏడాది ఉల్లి సాగు రెట్టింపు అయ్యింది. పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాల వల్ల దిగుబడులు తగ్గిపోయాయి. అదే క్రమంలో మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున ఉల్లి మార్కెట్‌లోకి వచ్చింది. దీంతో కర్నూలు మార్కెట్‌లో ఉల్లి ధరలు పతనమయ్యాయి. క్వింటా రూ.450 నుంచి రూ.1,150కు అమ్ముడవుతోంది. దీంతో క్వింటా రూ.1,200లకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది..
మూడు రోజుల్లో 4,817 క్వింటాళ్లు కొనుగోలు
ప్రభుత్వం నిర్ణయించిన క్వింటా ధర రూ.1,200 ప్రకారం కర్నూలు మార్కెట్‌లో రెండు రోజుల్లో ఏపీ మార్క్‌ఫెడ్ 4,817 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. తొలిరోజు ఆదివారం 212 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. సోమవారం 1,607 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్‌కు రాగా.. అందులో 82 క్వింటాళ్లు మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. మిగిలిన 1,525 క్వింటాళ్లను ఏపీ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. మంగళవారం రైతులు 3,261 క్వింటాళ్లు తీసుకొస్తే, 3,080 క్వింటాళ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
ప్రభుత్వమే ఆదుకుంది
ఎకరన్నర పొలంలో ఉల్లి సాగు చేశా. అధిక వర్షాలకు పంట దెబ్బతిని దిగుబడి తగ్గింది. ధర కూడా బాగా పడిపోయింది. క్వింటా రూ.500కూ అడిగేవారు లేరు. 56.50 క్వింటాళ్లు కర్నూలు మార్కెట్‌కు తెచ్చా. వ్యాపారులు రూ.517కు మించి కొనుగోలు చేయలేమన్నారు. ప్రభుత్వం రూ.1,200లకు కొనడంతో రూ.67,800లు చేతికి వచ్చింది. బయటకంటే రూ.39,550 అదనంగా వచ్చింది. సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు.
- చంద్రప్ప, పార్లపల్లె గ్రామం,
ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా.
రైతులు నష్టపోకుండా చర్యలు
కర్నూలు అగ్రికల్చర్: ఉల్లి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయసునీత చెప్పారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోలు ప్రక్రియను మంగళవారం ఆమె పరిశీలించారు. రైతులతో మాట్లాడి పెట్టుబడి, పంట దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటిదాకా క్వింటాకు రూ.500, రూ.600 మాత్రమే దక్కిందని, సీఎం చంద్రబాబు తమ నష్టాలను తెలుసుకొని క్వింటాకు రూ.1,200 ఇవ్వడం సంతోషంగా ఉందని రైతులు చెప్పారు. మార్కెటింగ్ కమిషనర్ మాట్లాడుతూ మూడు రోజుల్లో 4,817 క్వింటాళ్లు కొనుగోలు చేశామన్నారు. జేడీ రామాంజనేయులు, డీడీ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
- కమిషనర్ విజయసునీత