AP Government: హెక్టారుకు రూ.50 వేల సాయం
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:15 AM
ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ధర పతనమై.. నష్టపోతున్న ఉల్లి రైతులకు సాయం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
కష్టాల్లో ఉన్న ఉల్లి రైతుకు కూటమి ప్రభుత్వం అండ
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి
ఇప్పటికే లక్షా 39 వేల క్వింటాళ్ల కొనుగోలు
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ధర పతనమై.. నష్టపోతున్న ఉల్లి రైతులకు సాయం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి పండించిన ప్రతి రైతుకూ హెక్టారుకు రూ.50వేల చొప్పున నగదు సాయం అందించాలని నిర్ణయించారు. దీంతో 24,218 మందికి లబ్ధి చేకూరనుంది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.100 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ విషయాన్ని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం రాత్రి సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాకు వెల్లడించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 45,278 ఎకరాల్లో ఉల్లి సాగైంది. ధర పతనంతో క్వింటా రూ.600మించి పలకలేదు. దీంతో క్వింటా రూ.1,200 చొప్పున సుమారు లక్షా 39 వేల క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్ జోక్యం ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. కర్నూలు మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన ఉల్లిని దాదాపు సేకరించింది. కొంత రైతుబజార్లకు, మరికొంత వ్యాపారులకు తరలించి విక్రయించింది. అయితే ఇంకా రైతుల వద్ద కొంత ఉల్లి ఉంది. గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయినందున ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ఉల్లి సాగు చేసిన రైతులందరికీ హెక్టారుకు రూ.50వేల చొప్పున ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. ఇంకా మిగిలి ఉన్న ఉల్లిని మంచి ధర పలికినప్పుడే అమ్ముకోవాలని, ధర లభించే వరకు రైతులు ఓపిక పట్టాలని మంత్రి సూచించారు.