AP Govt: ఆశాలకు తీపికబురు
ABN , Publish Date - Aug 13 , 2025 | 06:52 AM
కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్లకు తీపికబురు చెప్పింది. ఆశాలు దీర్ఘకాలంగా చేస్తున్న కొన్ని డిమాండ్లను అంగీకరించింది. పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచడమే కాకుండా..
గ్రాట్యుటీ చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం
అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్లకు తీపికబురు చెప్పింది. ఆశాలు దీర్ఘకాలంగా చేస్తున్న కొన్ని డిమాండ్లను అంగీకరించింది. పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచడమే కాకుండా.. వారికి గ్రాట్యుటీ ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపింది. వారికి ఆరు నెలలపాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరుకు ఓకే చెప్పింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆశాలు పనిచేసిన కాలానికి సంవత్సరానికి రూ.5 వేలు చొప్పున పదవీ విరమణ చేసే నాటికి గరిష్టంగా రూ.1.50 లక్షలు గ్రాట్యుటీగా చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రాట్యుటీ చెల్లించడానికి మొత్తం రూ.645 కోట్లు ఖర్చవుతుంది. అలాగే ఆశాలకు గ్రాట్యుటీ చెల్లించే రాష్ట్రంగానూ ఏపీ నిలవనుంది. ఇది ఆర్థిక భారంతో కూడిన అంశమైప్పటికీ తమ ప్రధాన డిమాండ్లను ఆమోదించిన సీఎం చంద్రబాబుకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.