Share News

Stri Shakti Scheme: ఫ్రీ బస్.. సూపర్‌ సక్సెస్‌

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:52 AM

రాష్ట్రంలో ఫ్రీ బస్‌ సూపర్‌హిట్‌ కొట్టింది. ప్రయాణ ఖర్చులు...ఆటోలకు పెట్టే డబ్బులు.. రోజంతా కష్టపడితే వచ్చే డబ్బుల్లో రాకపోకలకు పెట్టాల్సిన వ్యయాలను బేరీజు వేసుకున్న ఆడపడుచుల కళ్ల నిండా కాంతులు!

Stri Shakti Scheme: ఫ్రీ బస్.. సూపర్‌ సక్సెస్‌

  • ఆడపడుచుల ప్రయాణ సంబరం

  • అన్నిరూట్లలో భలే స్పందన

  • నిండుగా కనిపించిన బస్సులు

  • పూర్తి ఆక్యుపెన్సీతో రైట్‌.. రైట్‌

  • జీరో టికెట్‌తో మహిళల్లో రిలీఫ్‌

  • తగ్గిన ఖర్చుల్ని లెక్కేసుకుంటూ ఉత్సాహంగా గమ్యస్థానాలకు..

  • అన్నిచోట్లా మహిళలదే పైచేయి

  • రాజమహేంద్రిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

  • తొలి 30 గంటల్లో

  • రూ.5 కోట్ల విలువైన జీరో టికెట్లు జారీ

  • 12 లక్షల మంది మహిళలు,బాలికల ప్రయాణం

  • ‘స్త్రీ శక్తి’ని సమీక్షించిన సీఎం

  • ఘాట్‌ రోడ్లలోనూ అనుమతించాలని ఆదేశం

అంబాజీపేట టు విజయవాడ.. ఆ కుటుంబానికి రూ.1,160 లబ్ధి

బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట నుంచి విజయవాడకు 170 కిలోమీటర్లు. ఒక కుటుంబంలోని ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు ఫ్రీ బస్సులో ఇంత దూరం ప్రయాణించి విజయవాడ చేరుకున్నారు. ఈ ఒక్క ప్రయాణంలోనే తమకు రూ.1,160 లబ్ధి చేకూరిందని ఆ కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

- అంబాజీపేట, ఆంధ్రజ్యోతి

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో ఫ్రీ బస్‌ సూపర్‌హిట్‌ కొట్టింది. ప్రయాణ ఖర్చులు...ఆటోలకు పెట్టే డబ్బులు.. రోజంతా కష్టపడితే వచ్చే డబ్బుల్లో రాకపోకలకు పెట్టాల్సిన వ్యయాలను బేరీజు వేసుకున్న ఆడపడుచుల కళ్ల నిండా కాంతులు! వదనాల్లో సంతృప్తి! అన్ని రూట్లలోనూ రైట్‌.. రైట్‌.. అంటూ మహిళలే సందడి చేశారు. బస్సుల్లో సాధారణంగా ‘టికెట్‌ ప్లీజ్‌’ అంటూ విజ్ఞప్తిచేసే కండక్టర్లు ‘టికెట్‌ ఫ్రీ’ అంటూ ప్రతి మహిళకూ జీరో ఫేర్‌ టికెట్‌ జారీ చేయడం కనిపించింది. ప్రభుత్వం అనుమతించిన గుర్తింపు కార్డులను మరిచి బస్సు ఎక్కిన మహిళలకు ఫ్రీ బస్‌ పట్ల అవగాహనను సిబ్బంది కల్పించారు.


ఇలాంటివారు ఐదుశాతం కంటే తక్కువ ఉంటారని అంచనా! వారికి కేటాయించిన ఐదు రకాల బస్సుల్లో శనివారం సాయంత్రం నాటికి దాదాపు 12 లక్షలమంది మహిళలు ప్రయాణించారు. జిల్లాల్లో కొత్త జోష్‌ను ‘స్ర్తీ శక్తి’ పథకం నింపింది. విశాఖ జిల్లాలో శనివారం బస్సుల్లో సగానికి పైగా మహిళలే ప్రయాణించారు. అన్నమయ్య జిల్లాలో 5 ఆర్టీసీ డిపోలలో 422 బస్సుల్లో స్ర్తీశక్తి పథకం కింద మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న బాపట్ల జిల్లాలో శనివారం ఒక్కరోజే 4,200 జీరో టికెట్లు జారీ చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. మొత్తం 212 ఆర్టీసీ సర్వీసుల్లో ఈ పథకం అమలు జరుగుతోందని పేర్కొన్నారు. శనివారం ప్రకాశం రీజియన్‌లో 90శాతం మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు.

‘స్త్రీ శక్తి’ సత్తా...

విశాఖలో ఫ్రీ బస్సుల్లో కొద్దిమందిని పలకరించగా తాము వీధిలో చిన్న దుకాణం నిర్వహిస్తుంటామని, సరుకులు కొనడానికి ఇంతకు ముందు ఆటోలో హోల్‌సేల్‌ మార్కెట్‌కు వెళ్లేవారమని, ఇప్పుడు బస్సులో ఉచితంగా వెళుతున్నామని చెప్పారు. బ్యూటీపార్లర్‌ నడుపుతున్న ఒకామె మాట్లాడుతూ, తనకు అవసరమైన సరుకులు స్థానికంగా కొంటున్నానని, ఇప్పుడు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో విజయనగరం వంటి ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటామని, గిట్టుబాటు అవుతుందని వివరించారు. స్త్రీశక్తి పథకం వల్ల ఖర్చులు తగ్గడంతో పాటు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని దాదాపుగా అందరు మహిళలు అభిప్రాయపడ్డారు.


శభాష్‌ చంద్రన్న

గుంటూరు నుంచి పిడుగురాళ్ళకు పుట్టింటికి వెళుతున్నామని, తమ లాంటి చిన్న కుటుంబాలకు ఫ్రీ బస్‌తో ఆర్ధికంగా ఎంతోమేలు కలుగుతుందని శైలజాబాయి అనే మహిళ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను చంద్రన్న నిలుపుకున్నారని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ కోసం పల్లె పల్లె తిరిగి బట్టలు అమ్ముకుంటానని, రోజూ బస్సుల్లో ప్రయాణం భారంగా ఉండేదని అన్నమయ్య జిల్లా పుల్లంపేటకు చెందిన సిద్దమ్మ గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్థిక భారం తగ్గిందని, ఇలాంటి ప్రభుత్వం ఎప్పటికీ అధికారంలో ఉండాలన్నారు.

ఒక్కరోజులోనే ఎంత తేడా...

అనంతపురం రీజియన్‌లో 470 బస్సులు ఉన్నాయి. నిన్నటివరకు బస్సుల్లో మహిళలు 40 శాతం, పురుషులు 60 శాతం మంది ప్రయాణించేవారు. శనివారం ఈ నిష్పత్తిలో అనూహ్యమైన మార్పు కనిపించింది. మహిళలు, పురుషుల ఆక్యుపెన్సీ సమానమైంది. ఈ నిష్పత్తి కూడా మారి.. రాబోయే రోజుల్లో పురుషుల కంటే మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా రీజియన్‌లో 374 బస్సులను ఫ్రీబస్‌ పథకం కోసం కేటాయించారు. గతంలో ఈ రీజియన్‌ పరిధిలో 484 బస్సులు ప్రతిరోజు 2 లక్షల కి.మీ. నడవగా, రోజు వారీగా 1.5 లక్షల మంది ప్రయాణించేవారు. అందులో 40శాతం మంది మహిళలు ఉండగా, 60శాతం మంది పురుషులు ఉండేవారు. అయితే స్త్రీశక్తి పథకం ప్రారంభంతో ఆర్టీసీ అధికారులు ఉచిత ప్రయాణానికి 316 బస్సులు కేటాయించారు. వీటిలో శనివారం అత్యధికంగా 90శాతం మంది మహిళలు ఉచితంగా ప్రయాణించడం ఇదే తొలిసారి. ప్రత్యేకించి పెళ్ళిళ్ల సీజన్‌, వరుస సెలవులు కావడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లుగా ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.


లెక్కలేసుకుని ఊరట..

కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన బోరా దేవి ఫ్రీబస్సులో ప్రయాణించి పిఠాపురంలోకి బంధువుల ఇంటికి వెళ్లారు. గతంలో ఒక ప్రయాణం చేయాలంటే ఎంతో ఆలోచించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ బాధ తప్పిందని దేవి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రులు, ఇతర అవసరాల నిమిత్తం వెళ్లాలంటే ఒక్కొక్కరికి కనీసం నెలకు వేయి రూపాయల వరకూ వ్యయం అయ్యేదని, ఇప్పుడు అది మిగిలినట్టేనని సంతోషంగా తెలిపారు. పైడితల్లి అనే మహిళ నిత్యం కూరగాయలను విజయనగరానికి తెచ్చి విక్రయిస్తారు. ఆమెతో పాటు కూరగాయల లగేజీ టికెట్లు ఒక వైపు రూ.120 కాగా.. రెండు వైపులా రూ.240గా అవుతుండేది. రోజూ కూరగాయలు విక్రయించగా రూ.500 వరకూ ఆదాయం సమకూరేది. ఇందులో సగం డబ్బులు రవాణాకే అయిపోతాయి. కానీ, ఉచిత ప్రయాణ పథకంతో ఇప్పుడు తనకు నెలకు రూ.3,600 ఆదా అవుతుందని పైడితల్లి సంతోషం వ్యక్తం చేశారు.

టెస్ట్‌ చేద్దామని..

నూతక్కి పద్మది బాపట్ల జిల్లా నరసయ్యపాలెం. వ్యవసాయ పనులు చేసుకుని జీవించే కుటుంబం ఆమెది. ఫ్రీబ్‌సను టెస్ట్‌ చేయాలని శనివారం ఉదయం ఆమె రోడ్డెక్కారు. రాజమండ్రిలో ఉండే చెల్లెలు దగ్గరకు బయలుదేరారు. ఉదయం ఎనిమిది గంటలకు నరసయ్యపాలెంలో పల్లెవెలుగు ఎక్కారు. బాపట్ల, గుంటూరు, విజయవాడల్లో బస్సులు మారి ఏలూరుకు వచ్చారు. అక్కడ రాజమండ్రి బస్సెక్కి చెల్లెలు ఇంటికి చేరుకున్నారు.

టికెట్‌ ఫ్రీ..

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి రాజమండ్రి వచ్చిన ప్రయాణికుల్లో సగం కంటే ఎక్కువ మంది ఉచిత ప్రయాణం చేశారని ఒక కండక్టర్‌ తెలిపారు. ఓ పది మంది వద్ద ఏవిధమైన గుర్తింపుకార్డులు లేకపోవడం వల్ల టికెట్లు తీసుకున్నారని, వారికి ఉచిత ప్రయాణం గురించి అవగాహన కల్పించామని మరో కండక్టర్‌ తెలిపారు.


కండక్టర్‌ అవతారం ఎత్తిన గోరంట్ల

ఫ్రీబస్‌ పథకానికి మరింత జోష్‌ను పెంచుతూ.. రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కండక్టర్‌ అవతారం ఎత్తారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్‌లో నిలిచిన ఉచిత బస్సు ఎక్కి స్వయంగా ఆయనే మహిళలకు టికెట్లు అందించారు. అనంతరం ఆ నియోజకవర్గ తెలుగు మహిళలతో కలిసి సీఎం చంద్రబాబుడు చిత్రపటానికి పాలాభిపేకం చేశారు. కాగా, టీడీపీ వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్‌ కిరణ్‌ కొద్దిసేపు బస్సు స్టీరింగ్‌ పట్టారు.

Untitled-2 copy.jpg


నెలకు పదైదు నూర్లు మిగులుతాయి

‘‘మా ఊరి నుంచి రోజూ చిర్రాకు కట్టలు కట్టుకుని కోటకు వచ్చి అమ్మితేనే మాకు ఇల్లు జరిగేది. కడివేడు నుంచి కోటకు వచ్చి పోవల్లంటే యాభై రూపాయలు అవుతుంది బస్సుకు. అదే ఆటోలో పోయి రావల్లంటే డెబ్బై రూపాయలవుతుంది. ఇపుడు చంద్రబాబు మా ఆడోళ్లకు బస్సు ఫ్రీ చేసినాడు. కాబట్టి నెలకు బస్సు చార్జీలకయ్యే పదైదు నూర్లు మిగులుతాయి.’’

- ఇందిరమ్మ, కడివేడు, చిల్లకూరు మండలం,

ఉమ్మడి చిత్తూరు జిల్లా

Untitled-2 copy.jpg


  • ఘాట్‌ రోడ్లలోనూ అనుమతి

  • ‘స్త్రీ శక్తి’ సమీక్షలో సీఎం ఆదేశాలు

స్త్రీ శక్తి పథకం అమలును సీఎం చంద్రబాబు శనివారం సమీక్షించారు. ఫ్రీబస్సుకు మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తోందని ఆర్టిసీ ఉన్నతాధికారులను ఆరా తీశారు. ‘కండక్టర్‌ ఎక్కడికి వెళ్లాలి అని అడగ్గానే.. మాకు ఫ్రీ కదా.? అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. టికెట్‌కు డబ్బులు ఇవ్వక్కర్లేదు.. ప్రభుత్వమే ఇస్తుంది.. మీరు గమ్యం చెప్పండి అని అడిగి జీరో ఫేర్‌ టికెట్‌ కండక్టర్‌ చేతిలో పెట్టగానే సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని ముఖ్యమంత్రికి వారు వివరించారు. ఘాట్‌ రోడ్లలో ఉచిత ప్రయాణాన్ని అనుమతించాలంటూ వస్తున్న వినతులపై స్పందించిన చంద్రబాబు... అక్కడా ఉచితం అమలు చేయండి అని అధికారులను ఆదేశించారు. 30గం.ల ఉచిత ప్రయాణంలో రూ.ఐదు కోట్ల విలువైన జీరో టికెట్లు జారీ చేశామని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో సీఎం సంతోషం వ్యక్తం చేశారు. స్త్రీ శక్తి అమలులో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. సెలవురోజులు కావడంతో ఆదివారం వరకూ రద్దీ తక్కువగానే ఉంటుందని, సోమవారం నుంచి పెరిగే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ఉన్నా అనుమతించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకం పట్ల మహిళలు హర్షంవ్యక్తం చేస్తుండటంపై ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు.


విన్నపాలు వినవలె..

రూట్ల సంఖ్య పెంచాలి.

బస్సు వేళల్లో సమయపాలన పాటించాలి

ఫ్రీ బస్సులకు ప్రత్యేక రంగు ఉండాలి

అటెన్షన్‌..

ఘాట్‌ రూట్లలో మొదట నిరాకరించినా, తర్వాత ప్రభుత్వం అనుమతించింది.

డిజిటల్‌ కార్డులు చూపించినా అనుమతిస్తున్నారు

Updated Date - Aug 17 , 2025 | 04:56 AM