Share News

Fire Services Act: భవనాల భద్రత కట్టుదిట్టం

ABN , Publish Date - Dec 02 , 2025 | 04:50 AM

అగ్ని ప్రమాదాలను నివారించడం, భవనాల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఫైర్‌ సర్వీసెస్‌ చట్టంలో కీలక సవరణలు చేసింది.

Fire Services Act: భవనాల భద్రత కట్టుదిట్టం

  • ఆంధ్రప్రదేశ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ చట్టంలో భారీ మార్పులు

  • మంత్రివర్గం ఆమోదం.. గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం

అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): అగ్ని ప్రమాదాలను నివారించడం, భవనాల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఫైర్‌ సర్వీసెస్‌ చట్టంలో కీలక సవరణలు చేసింది. రాష్ట్రంలో నగరాభివృద్ధి, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం వేగంగా పెరుగుతున్న క్రమంలో హై రైజ్‌ నిర్మాణాలకు అనుగుణంగా ఫైర్‌ చట్టాన్ని సవరించింది. అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీలు ఆన్‌లైన్‌ ద్వారా వేగంగా జారీచేయడం, ప్రస్తుతం 60 రోజుల వరకూ ఉన్న గడువును 21 రోజులకు కుదించడం, అనుమతులను సులభతరం చేయడం.. వంటివి సవరణ చట్టంలో ప్రధానమైనవి. రాష్ట్రంలోని భవనాల ఫైర్‌ సేఫ్టీ ఆడిట్ల కోసం అర్హత కలిగిన తృతీయ ఏజెన్సీలను ఎంప్యానెల్‌ చేసి సాంకేతిక పరిశీలన నాణ్యతను పెంచనుంది. వాణిజ్య, నివాస, విద్యా, పారిశ్రామిక సంస్థలకు చెందిన అన్ని రకాల భవనాలను ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఎన్‌వోసీ పరిధిలోకి తీసుకొచ్చి నిరంతర పర్యవేక్షణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్‌వోసీ విధానాన్ని కొత్త చట్టంలో మూడు దశలుగా విభజించింది. నిర్మాణానికి ముందు ప్రొవిజనల్‌ ఎన్‌వోసీ, నిర్మాణం పూర్తయ్యాక ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్‌, ఆ తర్వాత నిర్దిష్ట వ్యవధిలో రెన్యువల్‌ ఉండేలా చట్టంలో మార్పులు చేసింది. ఈ మూడు దశల వల్ల భవనం జీవితకాల భద్రతకు తోడ్పాటు అందించడంతో పాటు వర్షాకాలాల్లో భవనాలు కూలిపోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టవచ్చని అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ తెలిపారు. తాజా సవరణలో.. అగ్నిమాపక నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించడంతోపాటు ప్రస్తుత ఫైర్‌ యాక్ట్‌, ఏపీ బిల్డింగ్‌ కోడ్‌ రూల్స్‌ మధ్య ఉన్న అస్పష్టతలను ప్రభుత్వం తొలగించింది. హోంశాఖ ద్వారా ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలపై ఇటీవల మంత్రివర్గం ఆమోదించడంతో తాజాగా న్యాయ శాఖ గెజిట్‌ విడుదల చేసింది.

Updated Date - Dec 02 , 2025 | 04:55 AM