Central Government: బీఎస్‌ఎన్‌ఎల్ పర్యవేక్షణలో ఫైబర్‌నెట్
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:59 AM
ఏపీఫైబర్‌నెట్ లిమిటెడ్ నిర్వహణ వ్యవహారం కొలిక్కివచ్చింది. బీఎస్ఎన్‌ఎల్ పర్యవేక్షణలోనే ఏపీ ఫైబర్‌నెట్‌ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రైవేటీకరణ లేనట్లే!
అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఏపీఫైబర్‌నెట్ లిమిటెడ్ నిర్వహణ వ్యవహారం కొలిక్కివచ్చింది. బీఎస్ఎన్‌ఎల్ పర్యవేక్షణలోనే ఏపీ ఫైబర్‌నెట్‌ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రైవేటీకరించే అవకాశం లేదనే విషయం స్పష్టమైంది. యాజమాన్య నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్న యోచనను ఏపీఫైబర్ నెట్ విరమించుకుంది. ఏపీఫైబర్ ఇకపై ఏపీ భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఏపీబీఐఎల్)గా చలామణి అవుతుంది. గతంలో ఫైబర్‌నెట్ కార్యకలాపాలన్నింటినీ ప్రైవేటు సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్‌లను కోరుతూ టెండర్లను కూడా పిలిచారు. అయితే, ఇటీవల రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశంలో భారత్ నెట్-2 కింద రాష్ట్రాలన్నింటిలోనూ ఫైబర్‌నెట్ సేవలను బీఎ్‌సఎన్‌ఎల్ మాత్రమే అందిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. పదేళ్ల పాటు ఫైబర్ సేవల యాజమాన్య నిర్వహణ కోసం ఒక్కో రాష్ట్రానికి దాదాపు రూ. 200 కోట్ల మేర నిధులు మంజూరు చేయాలన్న యోచనలో ఉంది. ఈ సేవల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఐదుగురు చొప్పున డైరెక్టర్లను నియమిస్తూ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మొవ్వ తిరుమల కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఎమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ఏబీపీ) కింద రాష్ట్రంలో రూ.2,428 కోట్లతో ఫైబర్‌నెట్ సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫైబర్‌నెట్ ద్వారా తొలిదశలో 26,000 కి.మీ. మేర లైన్లను వేశారు. రెండోదశలో మరో 50,000 కి.మీ.లైన్లను బీఎస్ఎన్‌ఎల్ ఆధ్వర్యంలో వేస్తారు.