Polavaram project: పోలవరం-బనకచర్ల పథకం వెంబడి..విద్యుదుత్పత్తి కష్టమే!!
ABN , Publish Date - Apr 14 , 2025 | 02:48 AM
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వెంబడి పంప్డ్ స్టోరేజీ, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా 3,430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందా అన్న అంశంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. బొల్లాపల్లి, సిద్ధాపురం, గుత్తికొండ ప్రాంతాల్లో Hydel & Solar ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ప్రాజెక్టు నిర్వహణ అవసరాలకు సరిపడే విద్యుత్ ఉత్పత్తి సాధ్యమని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.

సీఎం ఆదేశాలతో అధికారుల సమీక్ష
సాధ్యాసాధ్యాలపై మేధోమధనం
బొల్లాపల్లి రిజర్వాయరుపై పంప్డ్ స్టోరేజీ ఏర్పాటు కుదరదు
గట్ల వెంబడి సోలార్ ప్లాంట్లతోనూ లాభం లేదు
2 వేల మెగావాట్ల లక్ష్యంలో
18 శాతమే ఉత్పత్తయ్యే చాన్సు!
దీంతో ప్రత్యామ్నాయాలపై సమాలోచన
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వెంబడి పంప్డ్ స్టోరేజీ, సౌర విద్యుత్కేంద్రాల ఏర్పాటు, వాటి ద్వారా 3,430 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధ్యమేనా అని జల వనరుల శాఖ, ఏపీ జెన్కో ఉమ్మడిగా మేధోమధనం జరుపుతున్నాయి. బనకచర్ల స్కీంలో కీలకమైన బొల్లాపల్లి రిజర్వాయరు లోతు తక్కువగా ఉండడం వల్ల నీటి ప్రవాహం ఆశించిన స్థాయిలో ఉండదని.. అందువల్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని ప్రాథమిక స్థాయి సమీక్షల్లో అభిప్రాయం వ్యక్తమైంది. రూ.80,112 కోట్ల భారీ అంచనా పథకంతో తలపెట్టిన ఈ పథకం నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసినా.. భూసేకరణ, సహాయ పునరావాసం కోసం రాష్ట్రప్రభుత్వం కూడా భారీగానే వ్యయం చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. నిర్వహణ భారం కాకుండా.. స్వీయ ఆదాయ ఆర్జన పథకంగా ఈ ప్రాజెక్టును మలచాలంటే.. దాని వెంబడి జల, సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుచేసి అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవాలన్నది ఆయన అభిమతం. బొల్లాపల్లి రిజర్వాయరు వద్ద 230 మెగావాట్ల విద్యుదుత్పత్తిని సాధించవచ్చని జలవనరుల శాఖకు ప్రాథమిక అంచనాలు అందాయి. అదేవిధంగా సిద్ధాపురం వద్ద మరో 200 మెగావాట్లు ఉత్పత్తి చేయవచ్చని.. గుత్తికొండ వద్ద 400, 600 మెగావాట్ల సామర్థ్యంతో రెండు ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని నివేదికలు వచ్చాయి. అదేవిధంగా కొన్ని ఎంపిక చేసిన చోట్ల సోలార్ ప్లాంట్లు పెడితే 2,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధించవచ్చని రిపోర్టులు అందాయి.
మొత్తంగా 3,430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుందనేది వీటన్నిటి సారాంశం. ప్రాజెక్టు నిర్వహణకు 3,377 మెగావాట్లు అవసరమని.. ఇది పోను ఇంకా 53 మెగావాట్ల కరెంటు మిగులుతుందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ రిపోర్టులను సీఎం ముందు ఉంచినప్పుడు.. సమగ్ర అధ్యయనం చేయాలని ఆయన ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ను ఆదేశించారు. ఇందుకోసం జెన్కో జల విద్యుత్ విభాగం సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.
నివేదికలపై చర్చ
శుక్ర, శనివారాల్లో రెండ్రోజులపాటు సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, జెన్కో హైడల్ డైరెక్టర్ సుజయ్‌కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయా నివేదికలపై చర్చించారు. పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టేందుకు వీలైన పరిస్థితులు ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమైంది. బొల్లాపల్లి రిజర్వాయరు 60 మీటర్ల లోతులోనే ఉండడం.. అందులో నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున తోడేస్తుంటే నీరు 40 మీటర్ల వరకే ఉంటుందని.. దానిపై ఆధారపడి పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను పెట్టలేమని.. ఒకవేళ పెట్టినా ఆర్థికంగా నష్టమే తప్ప లాభం ఉండదని కొందరు నిపుణులు పేర్కొన్నట్లు తెలిసింది. బొల్లాపల్లికి బదులుగా.. సమీపంలోని కొండ ప్రదేశాల్లో పంప్డ్ స్టోరేజీ ప్లాంటు పెడితే మెరుగైన ఫలితం దక్కుతుందని వారు సూచించినట్లు సమాచారం. ఇక అనుసంధాన కాలువ గట్ల వెంబడి సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో విద్యుదుత్పత్తికి అవకాశాలు అంతగా లేవన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. పోలవరం-బనకచర్ల మధ్య నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో లక్షిత 2 వేల మెగావాట్లకు గాను 18 శాతానికిలోపే సౌర విద్యుదుత్పత్తి సాధ్యమని అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో.. ప్రత్యామ్నాయ విధానాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలన్న నిర్ణయానికి జల వనరుల శాఖ, ఏపీ జెన్కో వచ్చినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News