Minister Sandhyarani: 5 జీ ఫోన్లతో అంగన్‌వాడీ సేవలు విస్తృతం
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:02 AM
రాష్ట్రంలో అంగన్‌వాడీ సేవలను మరింత పారదర్శకంగా విస్తృతం చేసేందుకు 5జీ మొబైల్స్‌ను అందుబాటులోకి తెచ్చామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు...
ఆశాలకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలకు అర్హత..!
వారి జీతాల పెంపుపై దృష్టి: మంత్రి సంధ్యారాణి
విజయవాడ సిటీ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అంగన్‌వాడీ సేవలను మరింత పారదర్శకంగా విస్తృతం చేసేందుకు 5జీ మొబైల్స్‌ను అందుబాటులోకి తెచ్చామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వేగంగా సేవలు అందించేందుకు ఈ మొబైల్స్ దోహదపడతాయని ఆమె చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్‌లు, బ్లాక్ కో ఆర్డినేటర్‌లకు 5జీ మొబైల్స్ అందించే కార్యక్రమాన్ని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె బుధవారం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలోని 55,204 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1.25 లక్షల మంది ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన 4జీ ఫోన్‌లు సరిగ్గా పని చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం రూ.75 కోట్లతో 5జీ మొబైల్స్‌ను సమకూర్చింది. పార్వతిపురం మన్యం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘పిల్లలను అందంగా ముస్తాబు చేద్దాం’ అనే కార్యక్రమం మంచి ఫలితాలను సాధించింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి చర్యలు తీసుకుంటాం. అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్‌లకు ప్రభుత్వ పథకాల అర్హత కల్పించేందుకు కృషి చేస్తున్నాం. దీనిపై త్వరలో సానుకూల ప్రకటన రావచ్చు. యాప్‌లు తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో కార్యకర్తలకు కొత్త యూనిఫాంలు అందిస్తాం. జీతాల పెంపుపై దృష్టి పెట్టాం. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో మౌలిక వసతులు కల్పించేందుకు రూ.లక్ష చొప్పున మంజూరు చేస్తాం’ అని మంత్రి తెలిపారు. అనంతరం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి, సంచాలకులు ఎం.వేణుగోపాలరెడ్డి, జేడీ కె.ప్రవీణ, ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగంతో కలసి మంత్రి సంధ్యారాణి ‘బాల్య వివాహ రహిత ఏపీ’ అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు.