CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా రాష్ట్రం
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:43 AM
రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో శుక్రవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించే....
తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేస్తాం
ఇది గేమ్ చేంజర్ కాబోతోంది
2030 నాటికి దేశ ఉత్పత్తి లక్ష్యంలో 20 శాతం రాష్ట్రం నుంచే ఉండాలి..ఇక్కడున్న వనరులు ఎక్కడా లేవు
‘అమరావతి గ్రీన్ హైడ్రోజన్’ డిక్లరేషన్ ప్రకటించండి
గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్-2025లో సీఎం సూచనలు
గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి రూ.51 వేల కోట్ల ఒప్పందాలు
ఇంధన ఖర్చు తగ్గాలి. ప్రజలకు ప్రయోజనం చేకూరాలి. గ్రీన్ హైడ్రోజన్‌తో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఇవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి 5 ఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనిలో 1.5 ఎంటీపీఏ(సుమారు 20 శాతం) మన రాష్ట్రంలోనే ఉత్పత్తి జరిగేలా చూడాలి. ‘నెట్ జీరో’ కార్బన్ లక్ష్యాల సాధనకు గ్రీన్ హైడ్రోజన్ సరైన పరిష్కారం. సమీప భవిష్యత్ అంతా గ్రీన్ హైడ్రోజన్‌దే. ఇంధన రంగంలో ఇదొక ‘గేమ్ చేంజర్’. ఏపీలోనూ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం.
- సీఎం చంద్రబాబు
గుంటూరు/అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ’గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో శుక్రవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించే ‘గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్-2025’ను సీఎం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాల నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. హరిత ఉదజని(గ్రీన్ హైడ్రోజన్) రంగంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలంటే ప్రస్తుతం కేజీకి రూ.400 ఖర్చు అవుతోందని, దీనిని రూ.100లోపు ఖర్చుకు తీసుకొచ్చినప్పుడే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్‌ను తక్కువ వ్యయంతోనే ఉత్పత్తి చేేసలా కొత్త సాంకేతికను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ మేరకు యూనివర్సిటీలు, పరిశోధకులు ముందుకు రావాలని సూచించారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరిగిందన్నారు. పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని దీని ఉత్పత్తి పెద్దఎత్తున జరగాలని సీఎం చెప్పారు. 2070 నాటికి కార్బన్ రహిత ఇంధనాలు వాడాలన్నది జాతీయ లక్ష్యమని పేర్కొన్నారు.
తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, నిల్వ చేయడంపై దృష్టి సారించాలన్నారు. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్, పరిశోధన, ఉత్పత్తికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్రం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
విద్యుత్ సంస్కరణలు..
నేను ఎమ్మెల్యే అయ్యేనాటికి విద్యుత్‌లో సమస్యలు వచ్చాయి. లోవోల్టేజీతో పంపుసెట్లు పాడైపోయేవి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆందోళనలు చేసేవారు. ఆ సమయంలో సంస్కరణలకు వెళ్లడమే మంచిదనిపించింది. అప్పటికే ఒడిసా విద్యుత్ సంస్కరణలు అమలు చేసి రాజకీయ ఒత్తిళ్లతో వెనక్కు తగ్గింది. 1999-2000 మధ్య విద్యుత్ రంగంలో దేశంలోనే ప్రప్రథమంగా సంస్కరణలు తీసుకొచ్చా. దీంతో జవాబుదారీతనం, పారదర్శకత వచ్చింది. దీనిఐ ప్రతిపక్షాలు తప్పుగా ప్రచారం చేయడంతో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. సౌర విద్యుత్ ఉత్పాదన కూడా మొదట్లో ఎంతో ఖర్చుతో కూడుకుంది. యూనిట్‌కి రూ.14 వరకు ఖర్చయ్యేది. సోలార్ ప్యానెల్స్ ఇతర పరికరాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ప్రధానమంత్రి మోదీ ముందుకొచ్చి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో నేడు సౌర విద్యుత్ ఇళ్ల శ్లాబులపైనే ఉత్పత్తి అవుతోంది. యూనిట్ ఖర్చు రూ.2.20కి తగ్గింది. అలానే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు తగ్గించడంపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి.
భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్‌దే!
ఇంధన రంగంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా పరిశోధనలు చేసి పరిష్కారం అన్వేషించాలి. సంప్రదాయ ఇంధన వనరుల కారణంగా తీవ్ర కాలుష్యం బారిన పడుతున్నాం. ‘నెట్ జీరో’ కార్బన్ లక్ష్యాల సాధనకు గ్రీన్ హైడ్రోజన్ లాంటి ఇంధనమే సరైన పరిష్కారం. సమీప భవిష్యత్ అంతా గ్రీన్ హైడ్రోజన్‌దే. ఇంధన రంగంలో ఇదొక ‘గేమ్ చేంజర్’గా మారుతుంది. అయితే, తక్కువ ఖర్చుతో సామాన్యులకు అందుబాటులోకి తేవాలి. ఏపీలోనూ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం. విశాఖలో ఎన్టీపీసీ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. అలాగే, కాకినాడలో ‘గ్రీన్ అమ్మోనియా’ ఉత్పత్తి కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది. 160 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీనివల్ల 7.50 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. 3 గిగావాట్ల సామర్థ్యంతో ఎలక్ర్టోలైజర్ల ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తితో పాటు ఏపీలో సౌర, పవన, పంప్డ్ విద్యుత్ ఉత్పత్తికి అపారమైన వనరులు ఉన్నాయి. అమరావతిలో ఏఐ కేంద్రంగా క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ర్టాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం. రెండు రోజుల సదస్సులో ‘అమరావతి గ్రీన్ హైడ్రోజన్’ డిక్లరేషన్‌ను ప్రకటించాలి. ఏడాది తర్వాత డిక్లరేషన్ అమలుపై సమీక్షిస్తా.
ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు
రాష్ట్రంలో ఎకో సిస్టమ్‌ని ప్రారంభిస్తున్నాం. 400 కేటీపీఏ హైడ్రోజన్ డిమాండ్ ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. పరిశ్రమల ఏర్పాటుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాయితీలు ఇస్తున్నాం. ఇక్కడి కంటే వేరే రాష్ట్రంలో తక్కువగా ఇస్తుంటే ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తే సరి చేసుకుంటాం.
రూ.20 వేల కోట్ల బడ్జెట్: పెమ్మసాని
గ్రీన్ హైడ్రోజన్‌కు గత పదేళ్లలో ప్రాధాన్యం ఏర్పడిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుత విద్యుత్ అవసరాల కోసం 40శాతం మేర.. ఇతర దేశాలపై ఆధారపడుతున్నామన్నారు. గ్రీన్ హైడ్రోజన్‌కు కేంద్రం 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. 2023, జనవరి 4న ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’కు కేంద్ర కేబినెట్ అనుమతిచ్చిందని తెలిపారు.
అబ్బుర పరిచిన ఆవిష్కరణలు
భవిష్యత్‌లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఏర్పాటే లక్ష్యంగా యువత వినూత్నంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ‘గ్రీన్ హైడ్రోజ్‌న్ సమ్మిట్-2025’ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువత కొన్ని గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. గ్రీన్ హైడ్రోజన్‌ను తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేయాలి? దీనికి అవసరమైన మౌలిక వసతులు, వనరులు, సాంకేతిక పరికరాలు ఏమిటి? అనే అంశాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు ఆసక్తిగా తిలకించారు. ఆయా ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకుని, వారిని సీఎం చంద్రబాబు అభినందించారు.
రాష్ట్రానికి రండి!
గ్రీన్ హైడ్రోజన్ ఇంధన ఉత్పత్తి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో భాగంగా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, హైడ్రోజన్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్హోత్ర, సీఎ్‌సఐఆర్, ఎన్‌సీఎల్ డైరెక్టర్ ఆపిశ్ లెలె తదితరులతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రత్యేక ప్రోత్పాహాలు ఇస్తున్నామని చెప్పారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఏపీ ప్రో-చాన్సలర్ డాక్టర్ పి. సత్యనారాయణన్, ఈడీ ప్రొఫెసర్ డి. నారాయణరావు, నెడ్‌క్యాప్ ఎండీ ఎం. కమలాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రూ.51 వేల కోట్ల ఒప్పందాలు
ఏపీలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేసేందుకు రెండు సంస్థలు సీఎం సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రభుత్వం తరఫున అధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. యూకేకు చెందిన యమ్నా సంస్థ రూ.16 వేల కోట్ల పెట్టుబడితో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ఏడాదికి 10లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా 5,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రూ.35వేల కోట్ల పెట్టుబడితో కేఎ్‌సఏహెచ్ ఇన్‌ఫ్రా మచిలీపట్నంలో 150 టన్నుల సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్, 600 టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంటు ద్వారా 5 వేల మంది ఉద్యోగాలు దక్కనున్నాయి.