AP DSC Convener: 98.4 శాతం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:07 AM
డీఎస్సీ తొలి విడత సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. కాల్ లెటర్లు అందిన అభ్యర్థులకు గురు, శుక్రవారాల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. మొత్తం 15,308 మందికి కాల్ లెటర్లు పంపగా..
15,308 మందికి కాల్ లెటర్లు: డీఎస్సీ కన్వీనర్
అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ తొలి విడత సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. కాల్ లెటర్లు అందిన అభ్యర్థులకు గురు, శుక్రవారాల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. మొత్తం 15,308 మందికి కాల్ లెటర్లు పంపగా.. వారిలో 15,068 (98.4 శాతం) మందికి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణ అనంతరం అభ్యర్థులు ఇచ్చిన పోస్టు ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకుని ఎంపిక జాబితాలు ప్రకటిస్తామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో హెల్ప్‌డె్‌స్కలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు అర్హత సాధించి ఉంటే, వారి ప్రాధాన్యత ఆధారంగా కాల్ లెటర్లు జారీ అయ్యాయన్నారు. డీఎస్సీలో జీవో 77 ప్రకారం హారిజంటల్ రిజర్వేషన్ అమలుచేశామన్నారు. మొదటి దశలో ఓపెన్ కోటా, రెండో దశలో వెర్టికల్ రిజర్వేషన్లు, మూడో దశలో హారిజంటల్ రిజర్వేషన్, ఆ తర్వాత క్రీడా కోటా 3 శాతం పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఎస్సీలను మూడు వర్గాలుగా గుర్తించి రిజర్వేషన్ అమలు చేశామన్నారు. కాగా.. ఇంకా కాల్ లెటర్లు అందని అర్హులకు సోమవారం వాటిని విడుదల చేయాలని నిర్ణయించారు.