Share News

AP CM Chandrababu: 17, 18 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:37 AM

జిల్లా కలెక్టర్ల సదస్సును ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

AP CM Chandrababu: 17, 18 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

  • జీఎస్‌డీపీ లక్ష్యాలు, సూపర్‌ సిక్స్‌పై చంద్రబాబు దిశా నిర్దేశం

అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్ల సదస్సును ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో సీసీఎల్‌ఏ స్వాగతోపన్యాసం చేస్తారు. అనంతరం, రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రులు, ఉపముఖ్యమంత్రి పవన్‌, సీఎం చంద్రబాబు మాట్లాడతారు. జీఎస్‌డీపీ లక్ష్యాలు, సూపర్‌ సిక్స్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఒక్కొక్క శాఖ కార్యదర్శి ఇచ్చే ప్రజంటేషన్‌ 5 స్లైడ్స్‌కి మించకూడదని సూచించారు. తర్వాత సీఎం చంద్రబాబు, మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు వాటిపై చర్చిస్తారు. ఒక రంగానికి గంటన్నర కేటాయిస్తే దానిలో 45 నిమిషాలు నోడల్‌ కార్యదర్శి, శాఖల వారీ కార్యదర్శులు ఇచ్చే ప్రజంటేషన్లకు, మిగిలిన 45 నిముషాలను చర్చకు కేటాయిస్తారు. ప్రతి నోడల్‌ సెక్రటరీ తమ పరిధిలోని విభాగాలు, జిల్లాల జీఎ్‌సడీపీ లక్ష్యాల్లో సాధించిన ప్రగతి, ఎదురైన సవాళ్ల గురించి, ఆయా విభాగాల పరిధిలో ఉన్న సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు వివరాలు వెల్లడిస్తారు. జిల్లా కలెక్టర్లు తాము అమలు చేసిన ఉత్తమ విధానాలు, వాటి ఫలితాల గురించి తెలియజేస్తారు. మొదట రాష్ట్ర జీఎ్‌సడీపీపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూ్‌షకుమార్‌ ప్రజంటేషన్‌ ఇస్తారు. ఆ తర్వాత రంగాల వారీగా ఆయా సెక్రటరీలు ప్రజంటేషన్‌ ఇస్తారు. సంక్షేమ పథకాలు, సాధికారతపై సాంఘికసంక్షేమ శాఖ సెక్రటరీ ప్రజంటేషన్‌ ఇస్తారు. 18న స్వచ్ఛభారత్‌, సర్క్యులర్‌ ఎకానమీ, ఐటీ, రెవెన్యూ, ఆదాయార్జన శాఖలు, గనులు, అటవీ, రోడ్లు భవనాలు, పురపాలకశాఖపై ప్రజంటేషన్లు, వాటిపై చర్చలు జరుగుతాయి. అదేరోజు రాష్ట్రంలో శాంతిభద్రతలపై డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా వివరిస్తారు. దీనిపై చర్చ అనంతరం పాజిటివ్‌ పబ్లిక్‌ పర్‌సెప్షన్‌పై ఐటీ శాఖ సెక్రటరీ కాటమనేని భాస్కర్‌ ప్రజంటేషన్‌ ఇస్తారు.

Updated Date - Dec 13 , 2025 | 05:39 AM