Eluru District: మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:38 AM
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల ఐఎస్ జగన్నాథపురంలోని...
లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి శ్రీకారం
ప్రదక్షిణ మండపం, రోడ్డు నిర్మాణానికి గతేడాది హామీ
ఏలూరు జిల్లాలో పవన్ కల్యాణ్ సుడిగాలి పర్యటన
ఏలూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల ఐఎస్ జగన్నాథపురంలోని స్వయంభూ లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ప్రదక్షిణ మండపం, కొండపైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రతిఏటా ఇక్కడి నారసింహుడికి నిర్వహించే ప్రత్యేక పూజల్లో పవన్ పాల్గొంటూ వస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది నవంబరు 1 దీపం పథకం-2 ప్రారంభోత్సవానికి ఏలూరు జిల్లాకు విచ్చేసిన ఆయన లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణంతో పాటు గ్రామం నుంచి కొండపైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మించేలా చేస్తానని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా కొద్దినెలల క్రితమే ఈ దేవాలయానికి 30 ఎకరాల స్థలం మంజూరు చేయిస్తూ క్యాబినెట్‌లో చర్చించి జీవో తీసుకురావడానికి కృషి చేశారు. ప్రదక్షిణ మండపం, గుడి చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి దేవదాయశాఖ నిఽధులు రూ.3.50 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నిధులు రూ.3.70 కోట్లతో ఐఎస్ జగన్నాథపురం నుంచి ఆలయానికి రోడ్డు నిర్మాణానికి మొత్తం రూ.7.20 కోట్లు మంజూరు చేయించారు. తాజాగా సోమవారం లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం... 30 ఎకరాల భూమి తాలూకా పత్రాలను దేవదాయశాఖ కమిషనర్ సి.రామచంద్రమోహన్, ఆలయ ధర్మకర్త ఎస్‌వీ నివృత్తిరావులకు అందజేశారు. ఆలయ ప్రాంగణంలోనే ప్రదక్షిణ మండపానికి, రోడ్డు అభివృద్ధి పనుల శిలాఫలకం ఆవిష్కరించారు. ధ్వజస్థంభం వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుందరగిరిపై యాగశాలను ఆయన దర్శించుకున్నారు.
పవన్ సుడిగాలి పర్యటన.. ప్రజల నుంచి వినతులు
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లా పర్యటన 75 నిమిషాల్లోనే ముగిసింది. తొలుత రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డుమార్గాన కొయ్యలగూడెం మండలం రాజవరానికి చేరుకున్న పవన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆయన గ్రామంలో కొద్దిసేపు పాదయాత్రగా వెళ్లారు. గ్రామ పరిధిలో ఆరిపాటిల దిబ్బ-లక్కవరం రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఐఎస్ జగన్నాథపురంలో 20.91 లక్షలతో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలించారు. తర్వాత లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, బడేటి చంటి, చిర్రి బాలరాజు, విజయవాడ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయడు, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ తదితరులు ఉన్నారు.