Share News

AP CM Chandrababu Naidu: రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే తొక్కిపడేయండి

ABN , Publish Date - Sep 14 , 2025 | 03:50 AM

శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని, రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే తొక్కేయండి అంటూ జిల్లాల ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు...

AP CM Chandrababu Naidu: రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే తొక్కిపడేయండి

  • శాంతి భద్రతలపై రాజీ పడొద్దు

  • సైకోలపై ఉక్కుపాదం మోపండి

  • టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట

  • ఎస్పీలతో భేటీలో సీఎం వెల్లడి

  • సీసీ కెమెరా లేకపోతే పాస్టర్‌ ప్రవీణ్‌ మరణాన్ని ప్రభుత్వంపైకి నెట్టేవారు

అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని, రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే తొక్కేయండి అంటూ జిల్లాల ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో 14 జిల్లాలకు ఎస్పీలుగా ఎంపిక చేసిన వారితో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షంగా మాట్లాడిన ముఖ్యమంత్రి... ఇతర జిల్లాల ఎస్పీలు, విజయవాడ, విశాఖపట్నం పోలీసు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘‘నేరాల తీరుతెన్నులు మారుతున్నాయి. రోజు రోజుకూ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని అదుపు చేయాలంటే టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వాలి. సీసీటీవీ పుటేజీ లేకపోతే పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై ప్రభుత్వాన్ని నిందించేవారు. నిరసనల పేరుతో కుట్రలు చేస్తే సహించొద్దు. సోషల్‌ మీడియాలో మహిళలపై అనుచిత పోస్టులు పెట్టే సైకోలపై ఉక్కుపాదం మోపండి’’ అంటూ ఎస్పీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మారుతున్న నేరాలకు అనుగుణంగా పోలీసులు నైపుణ్యాన్ని పెంచుకోవాలని, అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు.


రియాక్ట్‌... రీచ్‌..రెస్పాండ్‌... రిజల్ట్‌...

దుర్ఘటనలు జరిగిన వెంటనే స్పందించి క్రైమ్‌ స్పాట్‌కు చేరుకుని సాక్ష్యాలు సేకరించాలని ఎస్పీలకు సీఎం నిర్దేవించారు. రియాక్ట్‌... రీచ్‌..రెస్పాండ్‌... రిజల్ట్‌... పద్ధతిలో పనిచేయాలంటూ ఉత్సాహపరిచారు. ‘‘సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలపై తక్షణమై స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వ్యక్తిగత సమస్యలతో వచ్చే ప్రజలను మానవీయ కోణంలో చూసి వీలైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పెద్దపీట వేయాలి.. అయితే అసాంఘిక శక్తుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య, సింగయ్య మృతి లాంటి కీలకమైన కేసులు పోలీసులందరూ అధ్యయనం చేయాలి. తప్పుడు ప్రచారాలు, సాక్ష్యాల తారుమారు వంటి అంశాలు ఎలా ఉత్పన్నం అవుతాయనేది గ్రహించాలి.

నిరసనల పేరుతో కుట్రలను సహించొద్దు

రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతిపక్షాలకు చెందిన నేతలకు నిరసనలు చేసుకునే హక్కు ఉంటుందని, అయితే చట్టాన్ని అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోవద్దు.. అని సీఎం చంద్రబాబు జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో 2029లో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోదీ నాలుగోసారి ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు. విజన్‌ 2047 లక్ష్యంతో దేశాన్ని ప్రపంచంలో.. రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌ వన్‌ చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్నాయన్నారు. ఇటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకమని తెలిపారు. ‘‘ఇవన్నీ కసరత్తు చేసే మీకు జిల్లా ఎస్పీలుగా అవకాశం ఇచ్చాం.. మంచి ప్రతిభను ప్రదర్శించండి. శాంతి భద్రతలకు తూట్లు పొడిచేలా ఎవరు వ్యవహరించినా కఠినంగా వ్యవహరించండి’’ అని నిర్దేశించారు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన తాను ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజంపై ఎంత కఠినంగా వ్యవహరించిందీ ఆయన వివరించారు. ఈ సమావేశంలో డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 06:47 AM