Share News

Endowment Department: సీఎం చెప్పారా, అయితే ఏంటి

ABN , Publish Date - Jul 12 , 2025 | 05:11 AM

రాష్ట్రంలోని దేవదాయ శాఖలో భారీగా పేరుకుపోయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో దేవదాయశాఖ పాలన పూర్తిగా దెబ్బతింటోంది.

Endowment Department: సీఎం చెప్పారా, అయితే ఏంటి

  • దేవదాయశాఖ పోస్టుల భర్తీపై నిర్లక్ష్యం

  • వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశం

  • మార్చిలో ఆర్థిక శాఖ అనుమతి కోసం ఫైల్‌

  • 4 నెలలుగా ఆర్థిక శాఖలోనే ఫైల్‌ పెండింగ్‌

  • అయినా పట్టించుకోని ఎండోమెంట్‌ అధికారులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని దేవదాయ శాఖలో భారీగా పేరుకుపోయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో దేవదాయశాఖ పాలన పూర్తిగా దెబ్బతింటోంది. ప్రతి విభాగంలోనూ ఇన్‌చార్జిలే చక్రం తిప్పుతున్నారు. ఫలితంగా ఆలయాల ఆస్తులు, భూముల పరిరక్షణ ఇబ్బందిగా మారింది. దేవదాయశాఖలో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న సమస్యను ఆదిలోనే గుర్తించిన సీఎం చంద్రబాబు.. డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, గ్రేడ్‌-1, గ్రేడ్‌-3 ఈవో పోస్టులు సహా మొత్తం 300 పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేవదాయ శాఖపై చేపట్టిన తొలి సమీక్షలోనే ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆదేశిస్తే ఫైల్స్‌ ఆగమేఘాల మీద పరుగులు పెట్టాలి. పనులు క్షణాల్లో పూర్తి కావాలి. కానీ, దేవదాయ శాఖలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. సీఎం ఆదేశించిన ఆరు నెలల తర్వాత ఖాళీలను గుర్తించారు. ముఖ్యమంత్రి గత ఏడాది ఆగస్టు 24న జరిగిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. దేవదాయ శాఖ అధికారులు ఈ ఏడాది మార్చి 8న ఫైల్‌ సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపించారు. పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థిక శాఖకు చేరిన ఫైల్‌ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. ఆర్థిక శాఖ అధికారులు సదరు ఫైల్‌ను అత్యంత భద్రంగా పక్కన పెట్టారు. ఇది సీఎం ఆదేశాల మేరకు వచ్చిన ఫైల్‌ అన్న విషయాన్ని దేవదాయ, ఆర్థిక శాఖల అధికారులు మరిచిపోయారు. సీఎం ఆదేశాల మేరకు ఫైలును పంపేశామని భావించిన దేవదాయ శాఖ అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఇక, ఆర్థిక శాఖ వర్గాలు కూడా దీనిని పట్టించుకోలేదు. ఇలా రెండు శాఖల మధ్య సమన్వయం లోపం వల్ల ఖాళీల భర్తీ ప్రక్రియ దాదాపు పది నెలలుగా నిలిచిపోయింది. కాగా, పోస్టుల భర్తీ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించి మరో 20 రోజుల్లో ఏడాది పూర్తవుతుంది.

ఆర్థిక భారం లేదు!

దేవదాయ శాఖలో పోస్టులు భర్తీ చేయడం వల్ల లేదా కొత్త ఉద్యోగాలు కల్పించడం వల్ల ఆర్థిక శాఖపై ఎలాంటి భారం ఉండదని తెలుస్తోంది. శాఖలో ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్సులు మొత్తం ఆలయాల నుంచి వచ్చే ఆదాయం ద్వారానే ఇస్తారు. ఈ నేపథ్యంలో పోస్టులు భర్తీ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.కోట్లలో భారం పడుతుందన్న బెంగ లేదు.

Updated Date - Jul 12 , 2025 | 09:18 AM