AP CM Chandrababu Naidu: రోజుకు 5 గంటలు పార్టీకే
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:41 AM
క నుంచి పార్టీకి ప్రతి రోజూ ఐదు గంటల సమయం కేటాయిస్తానని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.
పదవుల కోసం సిఫారసులతో పనిలేదు: బాబు
కష్టించి పనిచేసేవారికి వాటంతట అవే వస్తాయి
ప్రతి ఒక్కరి సమాచారం నా దగ్గరుంది
కార్యకర్తలకు ఆగ్రహం వస్తే పార్టీకి ఇబ్బంది
వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి
గోపాలపురం నియోజకవర్గ భేటీలో నేతలకు టీడీపీ అధినేత ఆదేశం
గోపాలపురం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఇక నుంచి పార్టీకి ప్రతి రోజూ ఐదు గంటల సమయం కేటాయిస్తానని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. ప్రతి కార్యకర్త బాగోగులు చూసుకునే బాధ్యత తనపై ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బుధవారం గోపాలపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పార్టీకి కార్యకర్తలే బలం. కార్యకర్తలను నాయకులుగా తయారుచేసే విశ్వవిద్యాలయం టీడీపీ. అందువల్ల పదవుల కోసం ఏ ఒక్క కార్యకర్త పాకులాడాల్సిన అవసరం లేదు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పదవులు వాటంతట అవే వస్తాయి. నాయకుల చుట్టూ తిరిగి రికమెండేషన్లు చేయించాల్సిన అవసరమే లేదు. అందరి వ్యక్తిగత డేటా నా వద్ద ఉంది’ అని తెలిపారు. విశ్రమించని కార్యకర్తలు ఉన్నంతవరకు టీడీపీకి తిరుగులేదన్నారు. వారికి ఆగ్రహం వస్తే పార్టీ ఇబ్బందులకు గురవుతుందని, అందుకే ప్రతి నాయకుడూ వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఆదేశించారు. కష్టకాలంలో ఎదురైన ప్రతి ఇబ్బందినీ అధిగమించి పడిలేచిన కెరటంలా టీడీపీ విజయదుందుభి మోగించిందని తెలిపారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సెల్ఫీలు దిగారు.
నేడు మన్యం జిల్లాకు లోకేశ్
రేపు రానున్న చంద్రబాబు
భామినిలో ‘మెగా పీటీఎం’కు హాజరు
పార్వతీపురం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, విద్యా మంత్రి లోకేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. లోకేశ్ గురువారం రాత్రి పాలకొండ నియోజకవర్గం భామినిలో టీడీపీ కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ముందుగా వస్తున్నారు. చంద్రబాబు శుక్రవారం రానున్నారు. ఇద్దరూ కలిసి అదే రోజు భామినిలోని ఏపీ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్‌లో జరిగే మెగా పేరెంట్స్ సమావేశం(పీటీఎం)లో పాల్గొంటారు.