AP CM Chandrababu: అన్నీ నేనే చూడాలా
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:45 AM
పరిశ్రమలకు భూకేటాయింపుల్లో ఎదురవుతున్న సమస్యలు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇన్‌చార్జి మంత్రులు చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మంత్రులూ చొరవ తీసుకోవాలి: ముఖ్యమంత్రి
పరిశ్రమలకు భూకేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై స్పందించండి
రుషికొండపై నిర్ణయం ఇంత ఆలస్యమా?.. సబ్ కమిటీపై అసహనం
సూర్యఘర్‌తో సంబంధం లేకుండా చేనేతలకు విద్యుత్ రాయితీలు
ఇళ్ల నిర్మాణాలు చేపట్టని జగనన్న కాలనీలపై సమగ్రంగా అధ్యయనం
ఇళ్లు కట్టుకోవడానికి ఇష్టపడని వారి స్థలాలు ఇతరులకివ్వొచ్చా?: సీఎం
3 శాఖలు కలిసి టూరిజం ప్రాజెక్టులు చేపట్టాలి: డిప్యూటీ సీఎం సూచన
ప్రతి అంశాన్నీ నేనే పర్యవేక్షించాలా? మంత్రులు క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అప్పటికీ కాకుంటే నా దృష్టికి తీసుకురావాలి.
-చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమలకు భూకేటాయింపుల్లో ఎదురవుతున్న సమస్యలు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇన్‌చార్జి మంత్రులు చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి అంశాన్నీ తానే పర్యవేక్షించాలా అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అప్పటికీ కాకుంటే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయడం, స్థానికంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఇన్‌చార్జి మంత్రులే చొరవ తీసుకోవాలన్నారు. గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చించిన అనంతరం ఆయన మంత్రులతో మాట్లాడారు. రుషికొండ ప్యాలెస్‌పై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాన్ని తీసుకోవడంలో జాప్యం చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, రుషికొండ ప్యాలె్‌సను ఏ విధంగా ఉపయోగిస్తే మంచిదో వీలైనంత త్వరగా తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నిర్ణీత సమయం పెట్టుకుని పనిచేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు, సంబంధిత అధికారులకు సూచించారు. పర్యాటక శాఖ, అటవీశాఖ, దేవదాయ శాఖ కలిసి సంయుక్తంగా చేపట్టదగిన పర్యాటక ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయేమో పరిశీలిస్తే బాగుంటుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ఈ ఆలోచన బాగుందని సీఎం అన్నారు. దీనిని పరిశీలించాలని సంబంధిత మంత్రులను, అధికారులను ఆదేశించారు.
చేనేత విద్యుత్ రాయితీలను వెంటనే అమలు చేయండి
సౌర విద్యుదుత్పత్తికి కేంద్రం పెద్దఎత్తున సబ్సిడీలు ఇస్తోందని, వీటిని ఉపయోగించుకుని పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాలను వేగవంతం చేయాలని సీఎం చెప్పారు. పగటి పూట విద్యుత్ వినియోగ భారాన్ని తగ్గించుకునేందుకు ఈ పథకాలు ఉపయోగపడతాయన్నారు. చేనేతలకు విద్యుత్ రాయితీలు ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినా ఇంకా అమలు చేయకపోవడాన్ని కొందరు మంత్రులు ప్రస్తావించారు. ఎందుకు అమలు చేయడం లేదని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ప్రశ్నించారు. పీఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీలకు సబ్సిడీపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తుండడంతో, ఉచిత విద్యుత్ పథకాన్ని ఆపామని వారు చెప్పడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. సూర్యఘర్‌తో సంబంధం లేకుండా చేనేతలకు విద్యుత్ రాయితీలను వెంటనే అందించాలని ఆదేశించారు.
జగనన్న కాలనీలపై అధ్యయనం
జగనన్న కాలనీలు చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయని, ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వాటి విషయంలో ఏం చేయాలన్న దానిపై సమగ్రంగా అధ్యయనం చేసి ఒక నిర్ణయం తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇళ్లు కట్టుకోవడానికి ఇష్టపడని వారి స్థలాలను రద్దు చేసి ఇతరులకు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.