AP CM Chandrababu Naidu: సెంటిమెంట్‌పై సెటిల్‌మెంట్లా
ABN , Publish Date - Dec 07 , 2025 | 04:14 AM
బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీ వ్యవహారాన్ని కూడా సెటిల్ చేయాలని చూశారు.
శ్రీవారి కానుకలు, ముడుపులను కొట్టేసిన దొంగలతో రాజీ ఏమిటి?
ఇంతకంటే మహా పాపం ఉంటుందా?
బాబాయ్ హత్యనే సెటిల్ చేద్దామని చూశారు
వారే ఇప్పుడు పరకామణిపైనా మాట్లాడుతున్నారు
దేవుడి హుండీ సొమ్ము చోరీ చేయడం చిన్న తప్పా?
భక్తుల మనసు గాయపడేలా జగన్ వ్యాఖ్యలు
దేవుడన్నా, భక్తుల మనోభావాలన్నా ఆయనకు లెక్కలేదు
రాజధానిపై కొందరికి కడుపు మండుతోంది
కోకాపేటకు మించిన అభివృద్ధిని అమరావతిలో చూస్తారు
మీడియా ప్రతినిధులతో భేటీలో చంద్రబాబు వ్యాఖ్యలు
భక్తులు ఇచ్చిన కానుకలు, ముడుపులను కొట్టేసిన దొంగలతో సెటిల్‌మెంట్లు ఏమిటి? టీటీడీ పరకామణిలో రూ.72వేలు కొట్టేయడం అనేది చిన్న దొంగతనమని జగన్ అంటున్నారు. అలాంటి వాటిని సమర్థించడం, సెటిల్‌మెంట్లు చేయాలని చూడటం మహా పాపం కాదా? చుక్క పాలు లేకుండానే నెయ్యి తయారు చేసి, దేవుడి ప్రసాదం తయారీకి సరఫరా చేసిన ఘనులు వైసీపీ నేతలు.
- సీఎం చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘‘బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీ వ్యవహారాన్ని కూడా సెటిల్ చేయాలని చూశారు. ఇంతకంటే ఘోరమైన విషయం ఉంటుందా? భక్తుల సెంటిమెంట్ విషయంలో సెటిల్‌మెంట్లు ఏమిటి?’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీవారి పరకామణి చోరీ వ్యవహారం చిన్న దొంగతనం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనసులను గాయపరిచాయన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో మాజీ సీఎం జగన్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్‌కు దేవుడన్నా లెక్కలేదని, ఏడుకొండలస్వామి భక్తుల మనోభావాలన్నా లెక్కలేదని, ఆలయాల పవిత్రత అన్నా లెక్కలేదని మండిపడ్డారు. ‘‘దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు వెనక్కి కట్టాడు కదా.. తప్పేముందని జగన్ అత్యంత అనైతికంగా వాదిస్తున్నారు. దేవుడి సొమ్మును చోరీ చేస్తే అది కూడా తప్పుకాదన్నట్లు సమర్థించేవారిని ఏమనాలి?. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి అంశం భక్తుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉంది. అలాంటి సున్నితమైన అంశాలను కూడా సెటిల్ చేశామన్నట్లు తేలిగ్గా మాట్లాడుతుండటం దారుణం.’’ అని చంద్రబాబు అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు..
‘‘రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. నెల్లూరు, విజయనగరం వంటి జిల్లాలు ప్రశాంతతకు మారుపేరుగా ఉండేవి. అక్కడ ఎలాంటి అధికారిని ఎస్పీగా నియమించినా సరిపోయేది. కానీ గత పాలకుల వల్ల ఈ జిల్లాల్లో కూడా నేరస్థులు తయారయ్యారు. నెల్లూరు లాంటి చోట లేడీ డాన్లను తయారుచేశారంటే .. ఐదేళ్లలో ఎలాంటి పాలన సాగిందో అర్ధం చేసుకోవచ్చు. అన్నింటినీ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. నేరస్థులను ఏరివేస్తాం. రౌడీలను అణచివేస్తాం. కూటమి అధికారంలోకి వచ్చేనాటికి, ఇప్పటికీ పరిస్థితిలో చాలా మర్పు వచ్చింది.’’
కొందరికి కడుపు మండుతోంది
‘‘రాజధాని రైతులు, రాజధాని నిర్మాణ అంశాలపై సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. రాజధాని రైతులతో నేను సమావేశమయ్యాక మంచి ఫలితాలు వస్తున్నాయి. రెండో దశ భూసమీకరణకు కూడా రైతులు సంతోషంగా ముందుకొస్తున్నారు. ఇది మంచి పరిణామం. కానీ, రాజధాని రైతులు, ప్రభుత్వం సంతోషంగానే ఉండటం కొందరికి కడుపు మంట గా ఉంది. తెలంగాణలోని హైటెక్ సిటీ, కోకాపేట వంటి ప్రాంతాలు ఒకప్పుడు కొండలు. ఆ కొండల్లో ఇప్పుడు రూ.కోట్ల వాన కురుస్తోంది. భవిష్యత్తులో అమరావతి అంతకుమించి అభివృద్ధి చెందుతుంది.’’
విద్యార్థులకూ పార్టనర్‌షిప్ సమ్మిట్
‘‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) అనేది ఒక బ్రాండ్‌గా మారింది. విద్యాశాఖలో తీసుకొస్తున్న మార్పులు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో మండల స్థాయి పార్టీ నాయకులు భాగస్వాములు కావాలి. పిల్లలను కూడా ప్రోత్సహించాలి. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు ‘స్కూల్ ఇన్నోవేటర్స్ పార్టనర్‌షిప్ సమ్మిట్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీన్ని రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో నిర్వహించనున్నాం. విదేశాల్లో చదవాలని ఆశపడే విద్యార్థులకు 4 శాతం వడ్డీతో రుణాలు ఇస్తాం.’’