Share News

Road Safety Measures: ఈ ఏడాది 6,433 మంది బలి

ABN , Publish Date - Nov 27 , 2025 | 05:20 AM

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని రవాణా, పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి రోడ్డు ప్రమాదాన్ని థర్డ్‌ పార్టీతో ఆడిట్‌ చేయించాలని, డ్రైవర్‌ నిర్లక్ష్యం, రోడ్డు బాగాలేకపోవడం, ఇంజనీరింగ్‌ లోపం....

Road Safety Measures: ఈ ఏడాది 6,433 మంది బలి

  • ఇప్పటివరకు 15,462 రోడ్డు ప్రమాదాలు

  • ఇకపై ప్రతి రోడ్డు ప్రమాదంపై ఆడిట్‌ చేయాలి

  • కారణాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలి

  • వేగ నియంత్రణకు స్పీడ్‌ గవర్నర్లు తప్పనిసరి

  • హెచ్చరికలను ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్‌

  • ప్రతి అర కి.మీ.కు సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఆర్టీజీఎ్‌సతో అనుసంధానించాలి

  • యుద్ధ ప్రాతిపదికన రోడ్లపై గుంతలు పూడ్చాలి

  • రహదారి ప్రమాదాలు, ఆర్‌అండ్‌బీపై సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని రవాణా, పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి రోడ్డు ప్రమాదాన్ని థర్డ్‌ పార్టీతో ఆడిట్‌ చేయించాలని, డ్రైవర్‌ నిర్లక్ష్యం, రోడ్డు బాగాలేకపోవడం, ఇంజనీరింగ్‌ లోపం, వాహనం ఫిట్నెస్‌ లేకపోవడం లాంటి ప్రతి ప్రమాద కారణాన్ని తెలుసుకుని చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్‌తో సచివాలయంలో సీఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, రవాణా శాఖ కమిషనర్‌ మనీష్‌ కుమార్‌ సిన్హా రోడ్డు ప్రమాదాలకు కారణాలు వివరించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 15,462 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 6,433 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయని చెప్పారు. కార్లు, బైకుల స్వీయ ప్రమాదాలు 53 శాతం మేర ఉన్నాయని వెల్లడించారు. నెల్లూరు, తిరుపతి, పల్నాడు, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలతో పాటు మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతోందని వివరించారు. మొత్తం ప్రమాదాల్లో జాతీయ రహదారులపై 42 శాతం, రాష్ట్ర రహదారులపై 21 శాతం జరుగుతున్నాయని, అతివేగం వల్ల 79 శాతం ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఇటీవల కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించి అనధికారికంగా మార్పులు చేయించిన 134 ఆలిండియా సర్వీసు బస్సుల్ని సీజ్‌ చేసినట్లు అధికారులు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ‘‘రోడ్డు ప్రమాదాలు, మరణాలు బాగా తగ్గించాలి. దాని కోసం కఠిన చర్యలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన అతివేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్‌ గవర్నర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. రవాణేతర వాహనాలపైనా అమలు చేసే అవకాశాన్ని పరిశీలించాలి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి అర కిలోమీటరుకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. వీటిని ఆర్టీజీఎ్‌సతో అనుసంధానం చేసి వాహన ట్రాకింగ్‌ కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయాలి.


రోడ్లలో లోపాలు సరిదిద్దాలి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 680 బ్లాక్‌ స్పాట్‌లలో రోడ్‌ ఇంజనీరింగ్‌ లోపాలను సరిదిద్దాలి. అత్యవసరంగా ఆ పనులు పూర్తి చేయాలి. ప్రమాద హెచ్చరికల బోర్డులు అవసరమైన చోట ఏర్పాటు చేయాలి. అయినా ఉల్లంఘించే వాహనాన్ని సీజ్‌ చేయాలి. రోడ్డు ప్రమాదాల్లో దేశంలో ఏపీ ఎనిమిదో స్థానంలో ఉండటం ఆవేదన కలిగించే అంశం. రహదారి భద్రతపై విస్తృత ప్రచారం అవసరం. సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులతో ట్రాఫిక్‌ అవగాహన సందేశాలు ఇప్పించాలి. ప్రతి మూడు నెలలకు ఓసారి రాష్ట్ర, జిల్లా స్థాయిలో రోడ్‌ సేఫ్టీ సమావేశాలు నిర్వహించాలి. ఏటా నవంబరు మూడో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి.

స్లీపర్‌ బస్సుల్లో ఉల్లంఘనలపై ఉక్కుపాదం

ప్రైవేటు వాహనాల్లో అనధికారిక మార్పులు చేర్పులు చేస్తే కఠినంగా వ్యవహరించండి. ముఖ్యంగా స్లీపర్‌ బస్సుల్లో ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపాలి. బస్‌ బిల్డింగ్‌ కోడ్‌కు విరుద్ధంగా ట్రావెలర్స్‌ వ్యవహరిస్తే చర్యలు తీసుకోండి. డ్రైవింగ్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిని ముందుగా హెచ్చరించి ఐదో సారి లైసెన్స్‌ రద్దు చేయండి. డ్రైవర్ల శిక్షణా కేంద్రాలు(ఆదోని, దర్శి) త్వరగా పూర్తి చేయాలి. అంబులెన్స్‌ సేవలు ఏకీకృతం చేయాలి. ప్రమాద బాధితుల్ని ఆసుపత్రులకు త్వరగా తరలించే వారికి ప్రోత్సాహకాలు అందజేయాలి. రోడ్‌ సేఫ్టీ యాక్షన్‌ ప్లాన్‌ అమలులో భాగంగా పోలీసు, రవాణా, ఇంజనీరింగ్‌, వైద్య ఆరోగ్యం, ఎక్సైజ్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలి’’ అని సీఎం సూచించారు. ఈ సమీక్షలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డితో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


రోడ్లన్నీ వేగంగా బాగవ్వాలి: సీఎం

గుంతలు లేని రహదారులే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, ఈ దిశగా ఆర్‌అండ్‌బీ కార్యాచరణ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ రోడ్‌ లింక్‌ వ్యవస్థ అమల్లోకి రాకముందే రోడ్లపై గుంతలు యుద్ధప్రాతిపదికన పూడ్చాలని ఆదేశించారు. రోడ్ల ధ్వంసంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన నేపథ్యంలో ఆర్‌అండ్‌బీతో సీఎం బుధవారం ప్రత్యేకంగా సమీక్షించారు. రహదారుల నిర్మాణం, నిర్వహణ, గుంతలు పూడ్చడం, నాణ్యత పర్యవేక్షణకు ఆర్‌అండ్‌బీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రహదారి పనుల్లో నాణ్యతకు పెద్దపీటవేయాలని, తప్పులు చేసే కాంట్రాక్టర్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంజనీర్లు జవాబుదారీతనంగా పనిచేయాలన్నారు. రహదారుల నిర్వహణకు డ్రోన్‌లు, డిజిటల్‌ సర్వే, అవసరమైతే శాటిలైట్‌ సేవలు ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చూసుకోవాలన్నారు. కొత్త ప్రాజెక్టులు, ఇప్పటికే అమల్లో ఉన్నవాటికి భూసేకరణ సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. త్వరలో వచ్చే ఏపీ లింక్‌ వ్యవస్థను ఆర్ధికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లాజిస్టిక్‌ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తే పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయని, అప్పుడు రహదారుల నెట్‌వర్క్‌ మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కాగా, ఆర్‌అండ్‌బీలో వర్క్‌లు చేస్తున్న కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ కృష్ణబాబు సీఎంను కోరారు. పెండింగ్‌ బిల్లులను నెలనెలా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిసింది. ప్రస్తుతం కాంట్రాక్టర్ల బిల్లులు సీఎ్‌ఫఎమ్‌ఎ్‌సలో రూ. 299 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఇంకా అప్‌లోడ్‌ చేయాల్సిన బిల్లులు రూ. 481 కోట్లు ఉన్నాయని సీఎంకు నివేదించారు.

Updated Date - Nov 27 , 2025 | 05:20 AM