Share News

మహిళల జోలికెళితే ఉపేక్షించను: సీఎం

ABN , Publish Date - Nov 30 , 2025 | 04:18 AM

మహిళల విషయంలో టీడీపీ శ్రేణులు, నాయకులు, మంత్రుల వద్ద పనిచేసే సిబ్బంది గౌరవప్రదంగా మెలగాలని, మహిళలకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తే...

మహిళల జోలికెళితే ఉపేక్షించను: సీఎం

పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించొద్దు

మంత్రి సంధ్యారాణి పీఏ వ్యవహారంపై సీరియస్‌

అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మహిళల విషయంలో టీడీపీ శ్రేణులు, నాయకులు, మంత్రుల వద్ద పనిచేసే సిబ్బంది గౌరవప్రదంగా మెలగాలని, మహిళలకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతోపాటు అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పీఏ ఓ మహిళ విషయంలో వ్యవహరించిన తీరు చర్చకు వచ్చింది. ఈ అంశంపై చంద్రబాబు స్పందిస్తూ.. మహిళల విషయంలో తప్పు చేసిన వారి విషయంలో తక్షణం చర్యలు ఉండాల్సిందేనని, ఇందులో మరో మాటకు తావు లేదని స్పష్టం చేశారు. ఆడబిడ్డలను గౌరవించడంలో తొలి నుంచీ టీడీపీ ముందు వరుసలో ఉందని, అలాంటిది పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదన్నారు. క్రమశిక్షణ విషయంలో పార్టీ లైన్‌ దాటే వారి విషయంలో చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ విషయాన్ని త్వరలో తాను మాట్లాడి కొలిక్కి తీసుకొస్తానని తెలిపారు. పార్టీ కన్నా ఎవ్వరూ గొప్పవారు కాదని, అలాంటి ఊహాల్లో ఉండేవారు నిరభ్యంతరంగా పార్టీని వదిలి బయటకు వెళ్లిపోవచ్చన్నారు. మండల పార్టీ అధ్యక్షుల నియామకాల్లో పార్టీ క్యాడర్‌ అభిప్రాయానికి పెద్ద పీట వేయాలన్నారు. పోలవరం, శింగనమల, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో రెండు మండలాల చొప్పున నేతలు సూచించిన పేర్లకు.. పార్టీ క్యాడర్‌ సూచించే పేర్లకు పొసగకపోవడంతో అక్కడ ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా పార్టీ క్యాడర్‌ అభిప్రాయాలను సేకరించి కమిటీల నియామకం చేపట్టాలని చెప్పామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానం అమలవుతుందన్నారు. పార్లమెంటు అధ్యక్షుల విషయంలోనూ అదే విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Nov 30 , 2025 | 04:19 AM