Share News

AP CM Interactions with Tribals: అడవి బిడ్డలతో బాబు మమేకం

ABN , Publish Date - Aug 10 , 2025 | 04:17 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగి గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో మమేకమయ్యారు.

AP CM Interactions with Tribals: అడవి బిడ్డలతో బాబు మమేకం

  • రాఖీ కట్టిన ఆదివాసీ మహిళ

  • కాఫీ తోటల్లో రైతులతో మాటామంతీ

ఇంటర్నెట్ డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగి గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో మమేకమయ్యారు. తొలుత గ్రామ రచ్చబండ వద్ద గిరిజన దైవం శంకుదేవుడిని దర్శించుకుని, కొబ్బరికాయ కొట్టారు. అనంతరం గిరిజన పండగలు, సంప్రదాయాలు, ఆచారాలపై అక్కడ ఏర్పాటుచేసిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. గిరిజనులు నిర్వహించే విత్తనాలు పండగ, కొర్రకొత్త పండగ, సంకాంత్రి పండగలు, వారి ఆచారాల గురించి అడిగి తెలుసుకున్నారు. పలు పండగల గురించి చంద్రబాబుకు జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌, తెలుగు మహిళ నేత వంజంగి కాంతమ్మ వివరించారు. అక్కడకు సమీపంలో ఉన్న గుమ్మడి పాదును పరిశీలించి, అనంతరం అంగన్‌వాడీ చిన్నారులను పలకరించారు. అనంతరం గిరిజన మహిళ వంతాల కొండమ్మ ఇంటికి వెళ్లారు. కొండమ్మ ఆయనకు రాఖీ కట్టి, తాను తయారుచేసిన వంటకాలను సీఎంకు అందించారు. ఈ సందర్భంగా వారి దైనందిన జీవితం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎంతమంది పిల్లలు?, తల్లికి వందనం డబ్బులు అందాయా?..అని అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు పిల్లలకు ఇద్దరు మాత్రమే పాఠశాలకు వెళుతున్నారని, వారిద్దరికీ సంబంధించి తల్లికి వందనం డబ్బులు ఖాతాలో పడ్డాయని కొండమ్మ తెలిపింది. పెద్దబ్బాయి డ్రాపవుట్‌ అయ్యాడని స్కూల్‌కు వెళ్లడడం లేదని తెలపగా...ఆ బాలుడుతో చంద్రబాబు మాట్లాడి పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని సూచించారు. ‘నీవు స్కూల్‌కు వెళితే, మీ ఇంట్లో ముగ్గురికి తల్లికి వందనం డబ్బులు అందుతాయి’ అని పేర్కొన్నారు. అనంతరం కాఫీ తోటల్లో గిరిజన రైతు పూజారి సత్యారావు, కృష్ణవేణి దంపతులతో ముఖ్యమంత్రి మాటామంతీ నిర్వహించారు. కాఫీ తోటల ద్వారా ఏడాదికి ఎంత ఆదాయం వస్తుంది?... ఈ ఏడాది ఎంత వచ్చింది?... ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందించాలి?...అని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.


ఈ ఏడాది రూ.60 వేలు ఆదాయాన్ని సంపాదించామని రైతు సత్యారావు తెలిపారు.కాఫీ, మిరియాలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని ఆయన సీఎంను కోరారు. ఈ సందర్భంగా అక్కడే అరకు కాఫీని సీఎం రుచి చూశారు. కాఫీ తోటల్లో మిరియాలు సేకరణ చేసే పద్ధతిని చంద్రబాబు పరిశీలించారు. నూతన కాఫీ ప్రాజెక్టులో భాగంగా గిరిజన రైతులకు అల్యూమినియంతో తయారుచేసిన నిచ్చెనలు ఇస్తామని ముఖ్యమంత్రి వారికి తెలిపారు.

  • అడ్డుకుంది మీ నాయకుడు కాదా?

  • వైసీపీ నేతల తీరుపై సీఎం ఫైర్‌

‘‘మీరు నన్ను ప్రశ్నించడం కాదు...నేనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీ నాయకుడు జగన్‌ గిరిజన అభివృద్ధికి ఏమి చేశారు.? మీ హక్కులను ఏమి కాపాడాడో చెప్పండి’’...అంటూ వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు సవాల్‌ విసిరారు. ఏజెన్సీలో తన పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించినవారు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ దిశ, దశ మార్చడానికే తాను పాడేరు పర్యటనకు వచ్చానన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులు చేసిన చోటే కూటమి అభ్యర్థులను గిరిజనులు మొన్నటి ఎన్నికల్లో గెలిపించలేదని, ఇలా ఎందుకు చేశారని తానే తిరిగి ప్రశ్నిస్తున్నానని, సమాధానం చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.

Updated Date - Aug 10 , 2025 | 04:18 AM