Share News

CM Chandrababu: ఈ వయసులోనే జీవితానికి బాట

ABN , Publish Date - Dec 21 , 2025 | 04:07 AM

వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంచేందుకే పాఠశాలల్లో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

CM Chandrababu: ఈ వయసులోనే జీవితానికి బాట

  • ఏం సాధించాలన్నా ఇప్పుడే ప్రారంభించాలి

  • విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాదీ హామీ

  • శుభ్రత, ఆత్మవిశ్వాసం పెంచేందుకే ‘ముస్తాబు’

  • పిల్లలందరికీ త్వరలో వైద్య పరీక్షలు

  • ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కశింకోట (అనకాపల్లి జిల్లా), డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంచేందుకే పాఠశాలల్లో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శనివారం అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ... వ్యక్తిగత శుభ్రతతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా విద్యార్థుల్లో పెంపొందించడం ముస్తాబు లక్ష్యమన్నారు. చక్కగా తలదువ్వుకోవడం, భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు. డబ్బులను ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే ముస్తాబు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు రావాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులపైనే ఆశలు పెట్టుకుందన్నారు. అందరికీ ‘తల్లికి వందనం’ కింద ఆర్థిక సాయం అందించామని, విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, భోజనం అన్నీ ఉచితంగానే ఇస్తున్నామని తెలిపారు. ‘‘జీవితంలో ఏం సాధించాలన్నా చిన్న వయస్సు నుంచే కృషి చేయాలి. విద్యార్థులంతా రాష్ర్టానికి చెందిన ఆస్తి. మీరంతా నాలెడ్జ్‌ ఎకానమీలో భాగం. త్వరలోనే విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం.’’ అని సీఎం వివరించారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ తన శాఖలో వినూత్నమైన సంస్కరణలు తీసుకువస్తున్నారని తెలిపారు. వివిధ శాఖల మంత్రులు కూడా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకే కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బంగారంగా మార్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.


ప్రిన్సిపాల్‌ను అవుతా సర్‌..

ముస్తాబు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. ఇంటర్మీడియట్‌ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రీవల్లి లక్ష్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పగా...ఆ ఉద్యోగాన్నే ఎందుకు ఎంచుకున్నావని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘‘స్కూలులో ప్రిన్సిపాల్‌ ఎంతో క్రమశిక్షణ నేర్పారు. అందువల్ల నేను కూడా ప్రిన్సిపాల్‌ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.’’ అని శ్రీవల్లి బదులిచ్చింది.

Updated Date - Dec 21 , 2025 | 04:07 AM