Business Reformer of Year Award: బాబు.. బిజినెస్ రిఫార్మర్
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:32 AM
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలతో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది.
ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేసిన ‘ఎకనామిక్ టైమ్స్’
కలెక్టర్ల సదస్సులో లేచి నిలబడి మంత్రులు, అధికారుల హర్షధ్వానాలు
చంద్రబాబు శైలి స్ఫూర్తినిస్తోంది
నవతరం భవిష్యత్ కోసం ఆయన విధానాలు, సంస్కరణలతో సత్ఫలితాలు: ఉప ముఖ్యమంత్రి
రాష్ట్ర ప్రజలు, వ్యాపారవేత్తల కఠోర పరిశ్రమకు దక్కిన గౌరవమిది
రాష్ట్రాభివృద్ధికి పవన్ కల్యాణ్, కేంద్రం సహకారం మరువలేనిది: సీఎం
అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలతో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అనే అవార్డుకు ఆయన్ను ఎంపిక చేసినట్లు ప్రముఖ దినపత్రిక ‘ది ఎకనామిక్ టైమ్స్’ గురువారం ప్రకటించింది. ఈ విషయాన్ని సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్ల సదస్సులో వెల్లడించగానే... మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో (స్టాండింగ్ ఒవేషన్) హర్షం వెలిబుచ్చారు. సీఎంకు ఈ అవార్డు ప్రకటించడం చాలా గర్వంగా ఉందని, ఆయనకు రాష్ట్ర ప్రజలందరి తరఫునా అభినందనలు తెలియజేస్తున్నామని అచ్చెన్న అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సీఎంకు అభినందనలు తెలిపారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. ‘చంద్రబాబు శైలి స్ఫూర్తినిస్తుంది. రాష్ట్రాభివృద్ధి కోసం, నవతరం భవిష్యత్ కోసం ఆయన అమలు చేస్తున్న పాలనా విధానాలు, పారిశ్రామికవృద్ధికి చేపడుతున్న సంస్కరణలు కచ్చితంగా సత్ఫలితాలిస్తాయి’ అని తెలిపారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న వాళ్లకే ఈ అవార్డు ఇచ్చేవారని, తొలిసారిగా ఓ సీఎంకు ప్రకటించారని చెప్పారు.
ఈ అవార్డు మీ అందరి కృషి ఫలితం: సీఎం
ఈ అవార్డు రావడం వెనుక మీ అందరి కృషీ ఉందని చంద్రబాబు మంత్రులు, అధికారులతో అన్నారు. ‘ఇది నా వ్యక్తిగత కృషికి దక్కిన ఫలితం మాత్రమే కాదు. రాష్ట్ర ప్రజలు, వ్యాపారవేత్తల కఠోర పరిశ్రమకు దక్కిన గౌరవం’ అని చెప్పారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఈ అవార్డు ఊతమిస్తుందన్నారు. కాగా, ‘ఎక్స్’ వేదికగా ఎకనామిక్ టైమ్స్‌కు, అవార్డు కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.
గవర్నర్ అభినందనలు
‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికైన సీఎం చంద్రబాబుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందనలు తెలిపారు. ఆయన అంకితభావం, కృషికి ఈ అవార్డు నిజమైన గుర్తింపు అని అన్నారు.
మార్చిలో అవార్డు ప్రదానం..
వచ్చే ఏడాది మార్చిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును చంద్రబాబు అందుకోనున్నారు. అవార్డు జ్యూరీలో భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కొటక్ మహీంద్రా బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా ఉన్నారు.