AP CM Chandrababu Naidu: మధ్యవర్తిత్వం.. అనాది విధానమే
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:47 AM
విశాఖపట్నంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం సుముఖంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం...
శ్రీకృష్ణుడు ఉత్తమ మధ్యవర్తి.. విశాఖలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు మేం సిద్ధం
వర్చువల్ విచారణ, మొబైల్ అప్‌డేట్స్, ఈ-ఫైలింగ్ వాడాలి
అంతర్జాతీయ సదస్సులో చంద్రబాబు సూచన
మధ్యవర్తిత్వంతో కోర్టులు, ప్రజల మధ్య తగ్గుతున్న అంతరం: జస్టిస్ సూర్యకాంత్
సామరస్య సంస్కృతీ పెరుగుతుంది: జస్టిస్ నరసింహ
వ్యవస్థ పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగం: జస్టిస్ ఠాకూర్
ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. పెద్ద పెద్ద సంస్థలు వస్తున్న నేపథ్యంలో వివాదాల పరిష్కారానికి ఆర్బిట్రేషన్ వంటి ప్రత్యామ్నాయ న్యాయవ్యవస్థలు అందుబాటులోకి రావలసి ఉంది. పెరుగుతున్న వివాదాలు, కేసుల పరిష్కారానికి కొత్త కోర్టులు కూడా రావాలి.
- ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖపట్నం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం సుముఖంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేయడం అనాదిగా వస్తున్న విధానమేనన్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమ మధ్యవర్తిగా పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడి రాడిసన్ బ్లూ హోటల్‌లో ‘ఏషియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్(ఏసీఐఏఎం)’ నిర్వహించిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పీఎస్ నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను త్వరగా పరిష్కరించినప్పుడే భారత ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని సీఎం తెలిపారు.
వివాదాలను త్వరగా పరిష్కరించడానికి టెక్నాలజీతో పాటు ప్రత్యేక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. గ్రామాల్లో పెద్దలే మధ్యవర్తులుగా ఉంటూ వివాదాలు పరిష్కరించేవారని, తన తండ్రి కూడా ఇలాగే గ్రామ పెద్దగా వివాదాలు పరిష్కరించేవారని తెలిపారు. విశాఖలో ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార కేంద్రాన్ని (ఏడీఆర్) అభివృద్ధి చేయాల్సిన ఉందన్నారు. ‘ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ బలమైన మూలస్తంభం. రాజ్యాంగపరమైన హక్కుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తోంది. కొన్ని సమయాల్లో కాసింత ఆలస్యమైనా న్యాయం జరుగుతుందనే విశ్వాసం ప్రజల్లో ఉంది. ఇప్పటికీ చాలామంది వివాదం పరిష్కారానికి కోర్టుకు వెళ్లాలంటే అవమానంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం లభిస్తుంది. సులభతర న్యాయం (ఈజ్ ఆఫ్ జస్టిస్)లో వర్చువల్ విచారణ, ఈ-ఫైలింగ్, మొబైల్ అప్‌డేట్స్ వంటివి విస్తృతంగా ఉపయోగించాలి’ అని సూచించారు.
వారధిలా ఏసీఐఏఎం: జస్టిస్ సూర్యకాంత్
ఏసీఐఏఎం వంటి సంస్థలు ప్రొఫెషనల్‌గా న్యాయం అందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయని జస్టిస్ సూర్యకాంత్ ప్రశంసించారు. ఇలాంటి సంస్థాగతమైన మధ్యవర్తిత్వంతో సకాలంలో పరిష్కారం చూపడం వల్ల కోర్టులకు, ప్రజలకు మధ్య అంతరం తగ్గుతోందని, ఇవి వారధిలా పనిచేస్తున్నాయని అన్నారు. ఏపీలో మధ్యవర్తిత్వం అత్యవసరంగా అభివృద్ధి చేయాల్సి ఉందని జస్టిస్ పీఎస్ నరసింహ చెప్పారు. బలమైన సంస్థాగత చట్టాలు కోర్టులపై ఒత్తిళ్లను తగ్గిస్తాయని, సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకునే సంస్కృతీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రానికి మరో 800 న్యాయాధికారులు అవసరం: సీజే
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు 650 మంది న్యాయాధికారులు ఉన్నారని.. కేసులు త్వరితంగా పరిష్కరించాలంటే మరో 800 మంది అవసరమని హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. ‘పెద్దసంఖ్యలో కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మధ్యవర్తిత్వ ప్రక్రియ చాలా అవసరం. మీడియేటర్లకు శిక్షణ, నైపుణ్యం కూడా అవసరం. ఆర్బిట్రేషన్ రంగంలోకి విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు వస్తున్నారు. వీరిలో నిజాయితీ కొరవడినవారూ ఉన్నారు. ఈ వ్యవస్థ పర్యవేక్షణకు ప్రత్యేకమైన యంత్రాంగం ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సదస్సు నిర్వాహక సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ సూర్య రాజు, భోపాల్ ఎన్‌ఎల్‌ఐయూ వీసీ ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.