AP CM Chandrababu Naidu: మా రాష్ట్రానికి రండి
ABN , Publish Date - Oct 24 , 2025 | 02:58 AM
విశాఖపట్నంలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వస్తున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టామని, ఈ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
గ్రీన్ ఎనర్జీలో ఎన్నెన్నో అవకాశాలు.. భారీగా పెట్టుబడులు పెట్టండి
యూఏఈ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
బ్యాటరీ స్టోరేజీ, సూపర్ కెపాసిటర్స్ తయారీలో పెట్టుబడులకు అపెక్స్ ఆసక్తి
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై అగ్తియా సానుకూలత
యూఏఈలో రెండో రోజూ చంద్రబాబు పర్యటన
అబూధాబీలో పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు
లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతోనూ భేటీ
భారత కాన్సుల్ జనరల్ విందుకు హాజరు
టెక్ కంపెనీ ప్రతినిధులతో నెట్‌వర్క్ లంచ్
అబూధాబీలోని ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నెట్‌వర్క్ లంచ్ చేశారు. ఈ ముఖాముఖిలో జీ42 సీఈవో మనుకుమార్ జైన్, ఏడీఐసీ గ్లోబల్ హెడ్ లలిత్ అగర్వాల్, ఐహెచ్‌సీ సీఈవో అజయ్ భాటియా, డబ్ల్యూఐవో బ్యాంక్ సీఈవో జయేష్ పాటిల్, ట్రక్కర్ సీఈవో గౌరవ్ బిశ్వాస్, ఇన్సెప్షన్ సీఈవో ఆశిష్ కోషి తదితరులు పాల్గొన్నారు. ఏపీని భారతదేశానికి టెక్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దాలన్న తమ లక్ష్యాన్ని చంద్రబాబు వారికి వివరించారు. యూఏఈలోని టెక్నాలజీ ఆధారిత కంపెనీలతో సంయుక్త వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేసి రాష్ట్రంలో భవిష్యత్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలన్న తన ఆకాంక్షను కూడా తెలియజేశారు.
అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వస్తున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టామని, ఈ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం ఆయన యూఏఈకి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రంగంలో పెట్టుబడి పెట్టాలని ప్రముఖ సంస్థ అపెక్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ చైర్మన్ ఖలీఫా కౌరీని కోరారు. బ్యాటరీ స్టోరేజీ రంగంలో పెట్టుబడులపైనా చర్చించారు. హైకెపాసిటీ బ్యాటరీ స్టోరేజీ ద్వారా గ్రిడ్ డిమాండ్‌ను నిర్వహించేందుకు ఆస్కారం ఉందని అపెక్స్ ప్రతినిధులు ఆయనకు తెలిపారు. సూపర్ కెపాసిటర్స్ తయారీలోనూ అపెక్స్‌కు మంచి పేరుండడంతో ఏపీలో అందులోనూ పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు.
చంద్రబాబు ఆహ్వానాన్ని తప్పక పరిశీలిస్తామని, పెట్టుబడులు పెడతామని అపెక్స్ హామీ ఇచ్చింది. అపెక్స్ సూపర్ కెపాసిటర్ ఉత్పత్తులను రాష్ట్రానికి పంపాలని సీఎం కోరగా.. తప్పనిసరిగా పంపుతామని, సముద్రమార్గంలో వాటిని పంపుతామని చైర్మన్ ఖలీఫా తెలిపారు. ఆతిథ్య రంగంలోనూ ఈ సంస్థ ఉండడంతో అందులోనూ పెట్టుబడులకు చంద్రబాబు ఆహ్వానించారు. అనంతరం పునరుత్పాదక ఇంధన రంగంలో పేరొందిన మస్దార్ సంస్థ సీఈవో మొహమ్మద్ జమీల్ అల్ రమాహీతో ఆయన భేటీ అయ్యారు. ఏపీ-మస్దార్ మధ్య భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. సౌర, పవన, గ్రీన్‌హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దిగ్గజ సంస్థ అగ్తియా గ్రూప్ సీఈవో సల్మీన్ అల్మేరీతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. హార్టీకల్చర్, ఆక్వా కల్చర్‌లో ఏపీలో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని.. రాష్ట్రంలో కోకో ఉత్పత్తి జరుగుతోందని.. చాక్లెట్ పరిశ్రమ ఏర్పాటుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని పరిశీలించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అవసరమైన అపారమైన వనరులు ఏపీలో ఉన్నాయని, ఒకసారి పర్యటించాలని సీఎం విజ్ఞప్తి చేయగా.. అగ్తియా సీఈవో సానుకూలంగా స్పందించారు. లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతో జరిగిన సమావేశంలో.. ఏపీలో మాల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెడుతున్న పెట్టుబడులపై చర్చించారు. యూఏఈకి చెందిన సంస్థలతో ఏపీలో పెట్టుబడులు పెట్టించేందుకు సహకరించాలని యూసఫ్ అలీని సీఎం కోరారు.
పెట్రో కెమికల్ రంగంలో..
దక్షిణాసియాలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న ఏపీ.. ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలమని చంద్రబాబు స్పష్టం చేశారు. అబూధాబీలోని అల్ మైరాహ్ ఐలాండ్‌లోని ఏడీజీఏ స్క్వేర్‌లో అబూధాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి అహ్మద్ బిన్ తలిత్‌తో ఆయన సమావేశమయ్యారు. కృష్ణపట్నం, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ పోర్టుల సమీపంలో పెట్రో కెమికల్, ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు అనువుగా ఉన్నట్లు తెలిపారు. సదరు కంపెనీ-ఏపీ మధ్య సాంకేతిక సహకారంపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. అనంతరం అబూధాబీ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీతో, జీ42 సీఈవో మన్సూర్ అల్ మన్సూరీతోనూ సీఎం సమావేశమయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని వారికి తెలిపారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, హెల్త్ టెక్ రంగాల్లో నూతన ఆవిష్కరణలపై పనిచేస్తున్న జీ 42 సంస్థను.. ఏఐ డేటాసెంటర్లు, ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆహ్వానించారు. స్మార్ట్ గవర్నెన్స్ టెక్నాలజీని రాష్ట్రంలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
రెండో రోజు 9 సమావేశాలు..
రెండో రోజు పర్యటనలో చంద్రబాబు అబూధాబీలో ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో మొత్తం 9 సమావేశాలు నిర్వహించారు. అనంతరం యాస్ ఐలాండ్‌లోని పర్యాటక ప్రాజెక్టులను సీఎం బృందం సందర్శించింది. చంద్రబాబు గౌరవార్థం భారత కాన్సుల్ జనరల్ తన నివాసంలో గురువారం రాత్రి ఏపీ బృందానికి విందు ఇచ్చారు.