Share News

AP CM Chandrababu Naidu: రాష్ట్రంలో ప్రాంతీయ జోన్లు

ABN , Publish Date - Nov 30 , 2025 | 04:13 AM

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.

AP CM Chandrababu Naidu: రాష్ట్రంలో ప్రాంతీయ జోన్లు

  • మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు

  • రాజధాని రైతులు జేఏసీగా ఏర్పడాలి

  • సమస్యలపై చర్చలకు అదే మార్గం

  • క్యాపిటల్‌ గెయిన్స్‌ మినహాయింపుపై నిర్మలతో చర్చించా.. ప్రధానికీ చెబుతా

  • రాజధాని రైతుల పట్ల గౌరవంగా మెలగాలి

  • సీఆర్డీయే అధికారులకు స్పష్టం చేస్తాం

  • రైతుల విషయంలో అవినీతిని సహించను

  • 2029లో గెలుపే లక్ష్యంగా క్యాడర్‌కు శిక్షణ

  • టీడీపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులు,

  • పార్టీ నాయకులతో సీఎం చంద్రబాబు భేటీ

అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కావడం సరికాదని అభిప్రాయపడ్డారు. అందువల్లే ప్రాంతీయ జోన్లను తెస్తున్నామని వివరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం మధ్యాహ్నం చంద్రబాబు వచ్చారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం విలేకరులతో జరిపిన చిట్‌చాట్‌లో, పార్టీ నాయకులతో నిర్వహించిన భేటీలో పలు అంశాలపై చంద్రబాబు స్పందించారు. రాజధాని రైతులు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఒకే గొడుగు కిందకు రావాలని, అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్‌ పేరిట జేఏసీగా ఏర్పడితే వారి సమస్యలపై సంప్రదింపులకు మార్గం తేలిక అవుతుందని సీఎం తెలిపారు. రాజధాని రైతులు కోరిన క్యాపిటల్‌ గెయిన్స్‌ మినహాయింపు అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లామని, ప్రధాని మోదీతో కూడా మాట్లాడి సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తామన్నారు. పనులపై కార్యాలయాలకు వచ్చే రాజధాని రైతులను సిబ్బంది డబ్బులు అడిగితే కఠిన చర్యలు ఉంటాయని, భూత్యాగం చేసిన రైతులతో గౌరవంగా మెలగాలని అధికారులందరినీ ఆదేశిస్తానని చెప్పారు.


సీఆర్డీయే అధికారులు, సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో అవినీతి నిర్మూలన అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ రైతులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తుందన్నారు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లేఔట్ల అనుమతుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. కాగా, చంద్రబాబు ప్రస్తావించిన ప్రాంతీయ జోన్ల విధానం గతంలో ఉండేది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలుసీమ ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం వీటిని ఏర్పాటు చేశారు. అయితే విధులు.. నిధుల కేటాయింపు సరిగా లేకపోవడంతో అవి నిర్వీర్యమయ్యాయి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తిరిగి ప్రాంతీయ జోన్లను పునరుద్ధరించే ఆలోచన చేస్తోంది.


క్యాడర్‌కు శిక్షణ తరగతులు

డిసెంబరు 1 నుంచి పార్టీ క్యాడర్‌కు కేంద్ర కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో శిక్షణ తరగతులు నిర్వహించే విధానంపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా శిక్షణ తరగతులు ఉండాలని, అదే సమయంలో పార్టీ క్యాడర్‌ను ఎంపవర్‌ చేసేలా వారు తమ కాళ్లపై తాము ఆర్థికంగా నిలబడేలా వీటిని నిర్వహించాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీ నుంచి విమర్శలు వచ్చినప్పుడో లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడో పార్టీ స్పందించడం కాకుండా అసలు సమస్య రాకుండా ముందస్తుగా వ్యూహారచన జరగాలని, ఈ దిశగా పార్టీ బ్యాక్‌ ఆఫీసు సిబ్బంది కసరత్తు చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను ముందుగానే పసిగట్టే విధంగా పార్టీ యంత్రాంగం సమాయత్తం కావాలని కోరారు. తాను, లోకేశ్‌ పార్టీపై దృష్టి సారించి, నిరంతరాయంగా సమీక్షలు చేయడం మొదలుపెట్టిన తర్వాత....అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించడంలో.. గ్రీవెన్సులు నిర్వహించడంలో ఐదు శాతం పురోగతి కన్పించిందని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో 58 శాతం ఉన్నది ప్రస్తుతం 63 శాతానికి వచ్చిందని, మున్ముందు ఇది వంద శాతానికి చేరాలని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రణాళికలు రూపొందించుకోవాలి..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కడా వెనకడుగు వేయడం లేదని, అదే సమయంలో ప్రజల ఆశలు .. అవసరాలు నెరవేర్చేందుకు పార్టీ ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. అరటి, పత్తి విషయంలో గిట్టుబాటు ధరలు లేవంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ, అనవసర విమర్శలు చేస్తున్నాయని, ఇలాంటి అంశాలపై సరైన వ్యూహంతో విమర్శలను తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే సాగునీటి వనరుల లభ్యత పెరిగి, సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. అప్పటి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించాలని కోరారు.


ఆరోగ్యశాఖకు అంతర్జాతీయ గుర్తింపు

అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మాతృత్వ ఆరోగ్య సంరక్షణ విధానం అమల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ముఖ్యంగా గర్భిణుల సాధారణ ప్రసవాల పద్ధతులపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా చేపట్టిన మిడ్‌వైఫరీ శిక్షణ కార్యక్రమాన్ని అత్యుత్తమ విధానం కింద నెదర్లాండ్స్‌ కేంద్రంగా పనిచేసే ‘ఇంటర్నేషన్‌ కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ మిడ్‌ వైవ్స్‌’ ఎంపిక చేసింది. ఏపీలో అవలంబిస్తున్న పద్ధతులను వచ్చే ఏడాది జూన్‌ 14 నుంచి 18 మధ్య లిస్బన్‌ నగరంలో జరిగే కార్యక్రమంలో వివరించాలని ఏపీ ఆరోగ్యశాఖ అధికారులను ఆ సంస్థ కోరింది. ఈ మేరకు శుక్రవారం ఆహ్వాపత్రాన్ని ఆ దేశం అందించినట్లు ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ తెలిపారు. ఈ గుర్తింపుపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అధికారులకు అభినందనలు తెలిపారు.

Updated Date - Nov 30 , 2025 | 06:30 AM