Share News

London Visit: లండన్‌ చేరుకున్న సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 03 , 2025 | 05:14 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్‌ చేరుకున్నారు. వారికి లండన్‌లోని తెలుగు కుటుంబాలు ఘనస్వాగతం పలికాయి.

London Visit: లండన్‌ చేరుకున్న సీఎం చంద్రబాబు

  • నేడు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ

  • విశాఖ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం

  • రేపు భువనేశ్వరి అవార్డుల స్వీకరణకు హాజరు

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్‌ చేరుకున్నారు. వారికి లండన్‌లోని తెలుగు కుటుంబాలు ఘనస్వాగతం పలికాయి. వారిని ఆప్యాయంగా పలుకరించిన చంద్రబాబు అందరితో ఫొటోలు దిగారు. 4న ప్రతిష్ఠాత్మక సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌(ఐవోడీ) నుంచి భువనేశ్వరి రెండు అవార్డులు అందుకోనున్నారు. డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌ 2025 అవార్డును ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ హోదాలో, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విభాగంలో గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును హెరిటేజ్‌ ఫుడ్స్‌ వీసీ, ఎండీ హోదాలో స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు లండన్‌ వచ్చారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా సీఎం సోమవారం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానించనున్నారు. అక్టోపస్‌ ఎనర్జీ గ్రూప్‌ డైరెక్టర్‌ క్రిస్‌ ఫ్రిట్జ్‌ గెరాల్డ్‌, హిందూజాకు చెందిన వివిధ సంస్థల చైర్మన్లు అశోక్‌ హిందూజా, ప్రకాశ్‌ హిందూజా, షోమ్‌ హిందూజాతో భేటీ కానున్నారు. రోల్స్‌ రాయిస్‌ గ్రూప్‌ చీఫ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌ నిక్కి-గ్రాడీ స్మిత్‌, శ్రామ్‌ అండ్‌ మ్రామ్‌ సంస్థ చైర్మన్‌ శైలేశ్‌ హీరానందాని, శ్యామ్‌కో హోల్డింగ్స్‌ చైర్మన్‌ సంత్‌పకుమార్‌ తదితరులతో సమావేశమవుతారు. సీఐఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. లండన్‌లో భారత్‌ హైకమిషనర్‌ దొరైస్వామితోనూ సీఎం సమావేశం కానున్నారు.

Updated Date - Nov 03 , 2025 | 05:17 AM