AP CM Chandrababu Naidu: ఇక ప్రాజెక్టులు చకచకా
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:38 AM
రాష్ట్రం లో పెండింగ్‌లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కర్నూలు, కడప, ప్రకాశం, పల్నాడు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులను...
రూ.9074 కోట్ల వ్యయంతో పనులు
పెండింగ్‌లో ఉన్న ప్రధాన ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు రూ.2 వేల కోట్లు
వెలిగొండకు రూ.2059 కోట్లు
1404 కోట్లతో గాలేరు-నగరి విస్తరణ
కర్నూలులోని ప్రాజెక్టులకు 1685 కోట్లు
వరికపూడిసెలకు 1925 కోట్లు
‘శ్రీశైలం’ అభివృద్ధికి 1686 కోట్లు
ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయండి: సీఎం
జల వనరుల శాఖపై చంద్రబాబు సమీక్ష
జల వనరుల శాఖపై చంద్రబాబు సమీక్ష
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో పెండింగ్‌లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కర్నూలు, కడప, ప్రకాశం, పల్నాడు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు జల వనరుల శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం రూ.9074 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. వీటితోపాటు మరో రూ.1686 కోట్లతో శ్రీశైలం ప్రాజెక్టు రక్షణ చర్యలు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు, నీటి నిర్వహణ, ప్రాజెక్టుల పురోగతి, భూగర్భజలాలు తదితర అంశాలపై సమీక్షించారు. హంద్రీ నీవా సుజల స్రవంతి తరహాలోనే గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎ్‌స) విస్తరణ పనులను చేపట్టడం ద్వారా కడపకు మంచినీరు ఇచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. రూ.1404.35 కోట్లతో జీఎన్‌ఎ్‌సఎ్‌స విస్తరణ పనులు చేపట్టడం ద్వారా 47,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని జల వనరుల శాఖ నోట్ సమర్పించింది. అలాగే కడపకు తాగునీరు కూడా సరఫరా చేయవచ్చని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి కాలువ విస్తరణను 108 కిలోమీటర్ల మేర పూర్తి చేసి కడపకు నీళ్లివ్వాలని సీఎం సూచించారు. ఈ కాలువ విస్తరణ పనులు నిలిచిన చోట టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్తగా పిలవాలని అధికారులను ఆదేశించారు. టెండర్లను పిలిచిన వెంటనే పనులు చేపట్టాలన్నారు. కర్నూలు జిల్లాలో రూ.1685.71 కోట్లతో ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా 90,000 ఎకరాలను స్థిరీకరించవచ్చని అధికారులు వివరించగా.. సీఎం ఆమోదం తెలిపారు.
ప్రకాశం, పల్నాడులోనూ...
ప్రకాశం జిల్లాలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును రూ.2059.20 కోట్లతో పూర్తిచేయడం ద్వారా 1,09,500 ఎకరాలకు నీరందించే వీలుందని అధికారులు తెలిపారు. ఇందులో ప్యాకేజీ-2 కోసం రూ.247కోట్లు, ప్యాకేజీ-4 కోసం రూ.184కోట్లు, ప్యాకేజీ-5 కోసం రూ.142 కోట్లు, డైవర్షన్ రోడ్డు కోసం రూ.29 కోట్లు వ్యయం అవుతుందని వివరించారు. ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ కోసం రూ.456 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. భూసేకరణ, సహాయ పునరావాసం కోసం రూ.1002 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో వరికెపూడిసెల మొదటి దశ పనులు చేపట్టాలని జల వనరుల శాఖను సీఎం ఆదేశించారు. ఈ పనులు పూర్తి చేయడం ద్వారా 24,900 ఎకరాలకు సాగు నీరు అందించాలని అన్నారు.
ప్రాజెక్టుల్లో 89 శాతం నీళ్లు
రాష్ట్రంలోని మొత్తం జలాశయాల్లో 1313 టీఎంసీలకు గాను 1031 టీఎంసీల నిల్వలున్నాయని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 38,457 చెరువులను నింపే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
సమర్థంగా నీటి యాజమాన్య నిర్వహణ
సమర్థ యాజమాన్య నిర్వహణతోనే నీటి భద్రత ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భూగర్భ జలాల నమోదు కోసం మూడు నెలల్లో కొత్త సెన్సార్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. గతేడాది ఇదే తేదీతో పోల్చుకుంటే ఈసారి వర్షపాతం తక్కువగా ఉన్నా ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదంతా సమర్థ నీటి యాజమాన్య నిర్వహణ వల్లే సాధ్యమైందని జల వనరుల శాఖను సీఎం అభినందించారు. సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి పాల్గొన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు రక్షణ చర్యలు
శ్రీశైలం జలాశయానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు రూ.1686 కోట్లు వ్యయం అవుతుందని జల వనరుల శాఖ అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా ఎస్కేప్ చానల్ పునరుద్ధరణ పనుల కోసం రూ.1480 కోట్లు వ్యయం అవుతుందని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. డ్యామ్‌పై అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం రూ.25.50 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొన్నారు. యాప్రాన్, సిలెండర్ల పునరుద్ధరణకు రూ.74 కోట్లు, స్పిల్‌వే రక్షణ పనులకు రూ.99.49 కోట్లు వ్యయం అవుతుందని వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు రక్షణ చర్యలు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రెండేళ్లలో ‘ఉత్తరాంధ్ర’
పోలవరం ఎడమ కాలువతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని రెండేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రెండేళ్లలో వరుసగా వెయ్యి కోట్ల రూపాయల చొప్పున నిధులిస్తామని వెల్లడించారు. వంశధార, నాగావళి, చంపావతి అనుసంధానం చేస్తూ ఈ ప్రాంతంలోని అన్ని రిజర్వాయర్లు నింపడం ద్వా రా ఉత్తరాంధ్రలో వాటర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖకు దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్రలో అత్యంత ముఖ్యమైన బీఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టు రెండో దశలోని స్టేజ్-2 ప్రాజెక్టు కోసం రూ.170 కోట్లు వ్యయం చేస్తే కొత్తగా 20,000 ఎకరాల ఆయకట్టు వస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రూ.1368 కోట్లతో ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్న ఇతర ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా 1,24,639 ఎకరాలు ఆయకట్టులోకి వస్తాయని అధికారులు వివరించారు.