AP CM Chandrababu: జగన్‌ది క్రిమినల్ మాస్టర్ మైండ్
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:50 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరహాలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కల్తీ మద్యం దందాను నడిపారని పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వివేకా హత్య తరహాలో ఇప్పుడు ‘కల్తీ’ వ్యవహారం
రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం
నేరాలు చేసి టీడీపీపై నెట్టేస్తున్నారు: ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరహాలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కల్తీ మద్యం దందాను నడిపారని పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్రిమినల్ మాస్టర్ మైండ్ ఎలా ఉంటుందన్నదానికి జగనే ఉదాహరణ అని చంద్రబాబు అన్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం చంద్రబాబు తన అధికారిక నివాసంలో పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య తరహాలో మళ్లీ నేరాలు, ఘోరాలు చేసి ఏపీలో అలజడి సృష్టించేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలని, వైసీపీ వాళ్ల క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మూర్ఖుడు, క్రూరుడు లాంటి పదాలు.. జగన్, ఆయన అనుచరులకే వర్తిస్తాయని అన్నారు. జగన్ నేర కార్యకలాపాలు అనంతమని, రాష్ట్రంలో ఆయన పార్టీ అంతా క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డాగా మారిందని విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి, వాటిని తెలుగుదేశం మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. కల్తీ మద్యం దర్యాప్తులో లోతుగా వెళ్తున్న కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయని, వాళ్ల నేరాన్ని తెలుగుదేశం మీదకు నెట్టేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.