Share News

AP CM Chandrababu: రండి.. చూడండి

ABN , Publish Date - Oct 01 , 2025 | 04:28 AM

మా రాష్ట్రానికి రండి. మా విధానాలు పరిశీలించండి. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు.

AP CM Chandrababu: రండి.. చూడండి

  • ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి: సీఎం

  • ఏపీలో అపార అవకాశాలు.. మాకు సుదీర్ఘ తీరప్రాంతం

  • పరిశ్రమలకు అనుకూల విధానాలు

  • నైపుణ్యం కలిగిన యువశక్తి.. ‘స్పీడ్‌’గా అనుమతులు

  • విశాఖ భాగస్వామ్య సదస్సుకు తరలిరండి

  • ఢిల్లీ సీఐఐ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు

  • సంస్కరణల శిల్పి చంద్రబాబు: కేంద్ర మంత్రి పీయూష్‌

రాష్ట్రానికి పెద్దఎత్తున మాన్యుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా రాష్ట్రాన్ని సందర్శించిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నాను. పెట్టుబడులను ఆకర్షించడంలో మాకు ట్రాక్‌ రికార్డు ఉంది. లాజిస్టిక్స్‌, డీప్‌ టెక్నాలజీ, స్పేస్‌ సిటీ, ఎలకా్ట్రనిక్స్‌, డ్రోన్లు, ఏరో స్పేస్‌ హబ్‌లు మా ప్రాధాన్య రంగాలు.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘‘మా రాష్ట్రానికి రండి. మా విధానాలు పరిశీలించండి. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమ రాష్ట్రమని అన్నారు. సుదీర్ఘ తీరప్రాంతం, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలతో కూడిన పెట్టుబడి-స్నేహపూర్వక వాతావరణం, సాంకేతిక నైపుణ్యం కలిగిన యువశక్తి వంటివి రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ స్థానంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానం ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతులిస్తామని తెలిపారు. వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను, ప్రత్యేక ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని పిలుపిచ్చారు. మంగళవారం ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన 30వ భాగస్వామ్య సదస్సులో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. నవంబరు 14, 15వ తేదీల్లో సీఐఐతో కలిసి విశాఖలో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను, వివిధ దేశాల రాయబారులను సీఎం సాదరంగా ఆహ్వానించారు. ‘సంపద సృష్టికి పెట్టుబడులు రావాలి. సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలించగలం. ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌-2047 రూపొందిస్తే.. మేం స్వర్ణాంధ్ర విజన్‌-2047కు రూపకల్పన చేశాం. రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా విజన్‌ లక్ష్యం.


దీని కోసం 10 సూత్రాలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్నాం. రాష్ట్రంలో పరిశ్రమలకు అనువుగా ఉండేలా లాజిస్టిక్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం. రేవులు, విమానాశ్రయాలు, రహదారుల నిర్మాణం చేపడుతున్నాం. స్పేస్‌, ఎలకా్ట్రనిక్స్‌, డ్రోన్స్‌, ఏరో స్పేస్‌ సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. విద్య, వైద్య రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. సమీకృత అభివృద్ధి అనేది ఇప్పటి నినాదం. పీ4 ద్వారా అది సాధ్యమే’ అని స్పష్టంచేశారు.


15 శాతం వృద్థిరేటు లక్ష్యంగా..

‘2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్‌ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాతి రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్‌ పరికరాలను కూడా ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటాం’ అని చంద్రబాబు తెలిపారు. 15 శాతం వృద్థిరేటు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ పని చేస్తోందన్నారు. ‘పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో 500 గిగావాట్లను దేశంలో ఉత్పత్తి చేయాలని నిర్దేశిస్తే.. అందులో ఏపీలోనే 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకున్నాం. సులభతర వాణిజ్య విధానం అమలులో మా రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులు చేపట్టాం. భారత కర్బన ఉద్గారాల రహిత ప్రయాణంలో మా రాష్ట్రం కీలక భాగస్వామిగా ఉంటుంది’ అని వివరించారు.

సహజ పర్యాటక ప్రాంతాలు వనరులు

తీర ప్రాంతంలో ప్రపంచ ప్రమాణాలతో పోర్టులు, పారిశ్రామిక, లాజిస్టిక్స్‌ కారిడార్ల నిర్మాణం చేస్తున్నామని సీఎం చెప్పారు. అడ్వాన్స్డ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రోత్సహిస్తామన్నారు. రైతులకు లబ్ధి కలిగేలా బిగ్‌ టెక్‌ కంపెనీలకు ఏపీ కీలక స్థానంగా మారుతోందని చెప్పారు. సహజ పర్యాటక ప్రాంతాలు తమ రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద వనరుగా పేర్కొన్నారు.


చంద్రబాబు.. అభివృద్ధికి చిరునామా

అధునాతన సాంకేతికతను నమ్ముతారు: గోయల్‌

అంతకుముందు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. చంద్రబాబును ప్రజల జీవితాలను మార్చిన సంస్కరణల శిల్పిగా అభివర్ణించారు. దేశంలో అభివృద్ధికి ఆయన చిరునామా అని కొనియాడారు. ఏపీలో ఏడో సారి సీఐఐ సదస్సును నిర్వహించనుండడమే రాష్ట్రాభివృద్ధి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. ఆయన అధునాతన సాంకేతికతను నమ్ముతారన్నారు. విశాఖ, ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కేంద్రాల్లో ప్లగ్‌-అండ్‌-ప్లే సౌకర్యాలను అభివృద్థి చేస్తున్నారని చెప్పారు.

పెట్టుబడులతో రండి..

లొట్టే, కియ ప్రతినిధులతో మంత్రులు నారాయణ భేటీ

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ప్రముఖ బహుళ జాతి కంపెనీ లొట్టే, కియ కార్ల పరిశ్రమ ప్రతినిధులతో మంగళవారం మంత్రులు నారాయణ, బీసీ జనార్దనరెడ్డి సమావేశమయ్యారు. ‘రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం నెలకొంది. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానం అమలవుతోంది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంది. అభివృద్ధి దిశగా నడుస్తోంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను ఈ ఏడాది నవంబరు 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా సీఐఐ ఆధ్వర్యంలో 30వ భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తున్నాం. ఆ సదస్సునకు పెట్టుబడి ప్రతిపాదనలతో రండి’ అని ఆయా సంస్థల ప్రతినిధులను మంత్రులు కోరారు.

Updated Date - Oct 01 , 2025 | 06:02 AM