AP Govt: అనధికార నిర్మాణాల క్రమబద్ధీకరణ
ABN , Publish Date - Sep 20 , 2025 | 06:39 AM
అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరించడంతోపాటు నాలా ఫీజును రద్దు చేస్తూ రూపొందించిన బిల్లులకు మంత్రి మండలి పచ్చజెండా ఊపింది.
ఆగస్టు 31 వరకు కట్టిన భవనాలకు వర్తింపు
బిల్లుకు క్యాబినెట్ ఓకే.. ‘వైఎస్సార్ తాడిగడప’ పేరు మార్పు
‘నాలా’ రద్దు సహా 13 అంశాలకు ఆమోదముద్ర
చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరించడంతోపాటు ‘నాలా’ ఫీజును రద్దు చేస్తూ రూపొందించిన బిల్లులకు మంత్రి మండలి పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం క్యాబినెట్ భేటీ అయింది. సభలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు మంత్రులు ఆమోదం తెలిపారు. 13 అజెండా అంశాలపై జరిగిన ఈ భేటీ కేవలం 25 నిమిషాల్లో ముగిసింది. అనధికార భవనాల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు కట్టిన అనధికార భవనాలకు ఈ స్కీం వర్తిస్తుంది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో వివిధ చట్టాలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘వైఎస్సార్ తాడిగడప’ మున్సిపాలిటీని.. తాడిగడప మున్సిపాలిటీగా మార్చే ముసాయిదా బిల్లుకు ఆమోదంతెలిపారు. ఏపీ జీఎస్టీ బిల్లు-2025లో సవరణల ముసాయిదా బిల్లుకు పచ్చజెండా ఊపారు.
ఇవీ సవరణలు: 1) ఆక్వారైతులకు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్. 2) ముగ్గురు అధికారులకే అనుమతి అధికారం. 3) ఆక్వా లైసెన్సులకు నిర్ణీత తేదీ నుంచి 4నెలలలోపు నమోదుకు అవకాశం. 4) ఇప్పటికే లీజు ఉన్న వాటికి ఆటోమేటిక్‌గా నమోదు చేసే చాన్స్. 5) చట్టంలోని ’నియంత్రణలోకి’ అనే పదాన్ని ’నియంత్రించు’గా మార్పు. 6) సముద్ర ఆహారం నిర్వచనం మార్పు. 7) యాంటీబయోటిక్స్ అవశేషాలు లేని ఆక్వా ఉత్పత్తులతో ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడం. 8) ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా విలువను నిర్ణయం. 9) ఆక్వా యూనిట్లకు ఆడిట్ నిబంధన తొలగింపు. 10) అప్సడాలో ముగ్గురు ఆక్వా బిజినెస్ ఆపరేటర్లు ఉండలా మార్పు. 11) మత్స్య శాస్త్రాన్ని పశువైద్య విశ్వవిద్యాలయ నియంత్రణ నుంచి మత్స్యవర్సిటీ నియంత్రణలోకి తెస్తారు.
‘ఆక్వా’ సవరణ బిల్లు కూడా..
ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవల్‌పమెంట్ అథారిటీ చట్టం-2020లో కొన్ని సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ప్రభుత్వం తెచ్చిన చట్టం సానుకూలంగా లేదని రైతులు, ఎగుమతిదారులు, వాటాదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టాన్ని సవరించి బిల్లు రూపొందించారు. దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.