AP Cabinet Approves: రైడెన్‌కు రైట్ రైట్
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:22 AM
గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ విశాఖలో రూ.87,500 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)తో ఒక గిగావాట్ సామర్థ్యంతో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
గూగుల్ అనుబంధ సంస్థ పెట్టుబడికి క్యాబినెట్ ఓకే
రూ.87,500 కోట్లతో విశాఖలో డేటా సెంటర్
తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలో 3 క్యాంప్‌సలు.. 480 ఎకరాలు
భూమి ధరలో 25శాతం రాయితీ
స్టాంపు డ్యూటీ రద్దు.. సబ్సిడీపై విద్యుత్
ఎస్‌జీఎస్టీ 100 శాతం రాయితీ
13న ఢిల్లీకి చంద్రబాబు, లోకేశ్
ప్రధానిని సీఎం కలిసే అవకాశం!
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ విశాఖలో రూ.87,500 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)తో ఒక గిగావాట్ సామర్థ్యంతో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ పెట్టుబడి ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించింది. రైడెన్ విశాఖలోని తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలో 480 ఎకరాల్లో మూడు క్యాంపస్‌లతో కూడిన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో తొలిసారిగా భారీ ఎఫ్‌డీఐతో వస్తున్న ఈ సంస్థకు 25 శాతం రాయితీకి భూములివ్వాలని.. వాటికి పూర్తిగా స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని, 100 శాతం ఎస్‌జీఎస్‌టీ రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించారు. వీటితో పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ పూర్తి మినహాయింపు, పది శాతం క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా క్యాబినెట్ ఆమోదించింది. మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై కొత్త విశ్వాసం కనిపిస్తోందని.. టీసీఎస్, కాగ్నిజెంట్ సహా.. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్, ఐబీఎం వంటి సంస్థలు రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు చేపట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. విశాఖ నగరం భవిష్యత్‌లో ఐటీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటుందన్న ధీమా వ్యక్తంచేశారు. కాగా.. రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి 14న ఢిల్లీలో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. ఇందుకోసం చంద్రబాబు, లోకేశ్ 13న ఢిల్లీ వెళ్లనున్నారు. వీరితోపాటు కేంద్ర ఐటీ-ఎలకా్ట్రనిక్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమక్షంలో డేటా సెంటర్ ఏర్పాటు ఒప్పందంపై గూగుల్, రైడెన్ సంస్థల ఉన్నతాధికారులు సంతకాలు చేసి అధికారిక ప్రకటన చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం ఉంది.