AP Cabinet Approves Amaravati: అమరావతి కోసం ఎస్పీవీ
ABN , Publish Date - Oct 04 , 2025 | 04:50 AM
రాజధాని అమరావతిలో పనుల వేగవంతంకోసం, ప్రత్యేక ప్రాజెక్టుల అమలుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్‌ను...
రాజధానిలో భూసేకరణ నోటిఫికేషన్ నుంచి 343.36 ఎకరాల భూమి మినహాయింపు
అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో పనుల వేగవంతంకోసం, ప్రత్యేక ప్రాజెక్టుల అమలుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్‌ను (ఎస్పీవీ) ఏర్పాటుచేస్తూ రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ చట్టం కింద దీనిని ఏర్పాటుచేస్తారు. అలాగే, గతంలో భూసేకరణ నోటిఫికేషన్ నుంచి 343.36ఎకరాల భూమిని ఉపసంహరించుకునేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు క్యాబినెట్ అనుమతిని ఇచ్చింది. నీటి సంఘాల సభ్యుల ఎంపికకు, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు సంబంధించి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించింది. దీనికోసం రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇద్దరుకన్నా ఎక్కువమంది పిల్లలున్నా, ఈ పదవుల్లో కొనసాగటానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఇలాంటి కీలక నిర్ణయాలెన్నింటినో తీసుకున్నారు. ఆ వివరాలను సమాచార, గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారఽథి మీడియాకు వెల్లడించారు. మంత్రిమండలిలో వ్యక్తిగత ఎజెండాలేవీ లేవని, ప్రజా సమస్యలపైనా చర్చించామని పార్థసారఽథి తెలిపారు. ‘‘రాజధాని ప్రాంతంలో రెండో దశ భూసేకరణ అంశంపై క్యాబినెట్‌లో చర్చ జరగలేదు. స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, పెన్షన్ల పెంపు, దీపం-2 పథకం లబ్ధితోపాటు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు. అర్హులైన ప్రతి పేదకూ ఇల్లు, ఇంటి స్థలం ఇస్తాం’’ అని మంత్రి తెలిపారు.
ప్రధాన నిర్ణయాలు..
ఏపీటూరిజం పాలసీలో కారవాన్ టూరిజాన్ని చేర్చడానికి మంత్రివర్గం ఆమోదం. అలాగే, హోమ్ స్టే/ బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ విధానాన్ని ప్రోత్సహించడానికి ఫ్రేమ్ వర్క్‌ను ఈ పాలసీలో భాగం చేసేందుకు సమ్మతి.
ఏపీ అసైన్డ్ ల్యాండ్స్(బదిలీల నిషేధం) బిల్లు 2025ను సవరిస్తూ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
ప్రకాశం బ్యారేజ్, దివిసీమ భద్రత, నిర్మాణ పటిష్టతకు రూ.4.49 కోట్లతో వరద మరమ్మతు పనులకు ఆమోదం.
హంద్రి-నీవా సుజలస్రవంతి ప్రాజెక్టు రెండోదశ కింద రాకెట్ల గ్రామం వద్ద అమిద్యాల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికీ, ప్యాకేజీ 52ఏ కింద మిగతా పనులను రూ.72.30కోట్లతో చేపట్టడానికీ అంగీకారం.
కడప జిల్లాలో మైలవరం ఆనకట్టకు రూ.3,19 కోట్లతో ప్లేట్లు, ఇతర అమరిక పనులు చేపట్టాలని నిర్ణయం.
తిరుపతి, తిరుమల తాగునీరు అవసరాల కోసం రూ.126.06 కోట్ల వ్యయానికి ఆమోదం.
అనంతపురం జిల్లా ఉరవకొండ, వజ్రకరూర్, విడపనకల్ మండలాలకు తాగునీరు, 10,500ఎకరాలకు సాగునీరు అందించే కొట్టాలపల్లి ఎత్తిపోతల ద్వారా హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి 100క్యూసెక్కుల నీరు ఎత్తి పోయడానికి రూ.55.60కోట్లతో పనులకు ఆమోదం.
అనంతపురం జిల్లా మిడ్ పెన్నార్ ప్రాజెక్టుకు రూ.5.20 కోట్లతో రబ్బర్ సీల్స్ మార్పిడి పనులకు ఆమోదం.
రాష్ట్ర జల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అమృత్ 2.0 అమలుకు రూ.10,319కోట్లమేర పాలనా అనుమతి.
తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి 16.19ఎకరాలు, గుంటూరు జిల్లా వెటర్నరీ ఆఫీసర్స్ హౌసింగ్ సొసైటీకి 10ఎకరాలు కేటాయింపు.
ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా రూ.వెయ్యికోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణంపొంది, దానిని పౌర సరఫరాల సంస్థకు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసి.. ధాన్య కొనుగో లు బకాయిలను చెల్లించాలని నిర్ణయం.
నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో ప్రభుత్వ భూమి 174.10ఎకరాలను గ్రీన్కో లిమిటెడ్‌కు రూ.6.25 లక్షలకు ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోదం.
నిరంతరం పని చేసే రిఫరెన్స్ స్టేషన్(సీవోఆర్‌ఎ్‌స) నెట్‌వర్క్‌ను నేషనల్ ప్లాట్‌ఫాంతో అనుసంధానించేందుకుగాను కుదిరిన అవగాహన ఒప్పందానికి ఆమోదం.
హిందూమత సంస్థలు, దేవదాయ చట్టం 1987(నంబరు30) సెక్షన్ 19(1-బీ)లోని ’కుష్ఠు వ్యాధితో బాధపడుతున్నారు’ అనే పదం తొలగింపు.. కాళంగి నది ‘వరద’ పనులు రద్దు
.
చిత్తూరు-నెల్లూరు జిల్లాల పరిధిలో కాళంగి నది వరద నివారణ కోసం 2009లో నిర్మించతలపెట్టిన ఫ్లడ్ బ్యాంక్ పనులను మంత్రిమండలి రద్దుచేసింది. కాళంగి నది నుం చి తనయాలి ఆనకట్ట వరకు దాదాపు 27.50 కిలోమీటర్లమేర ఫ్లడ్‌బ్యాంకును నిర్మించాలని భావించారు. దీనికోసం రూ.30.24 కోట్లతో పనులు చేసేందుకు చెన్నైకు చెందిన మెసర్స్ జీవీఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్సు సంస్థకు పనులు అప్పగించారు. ఈ సంస్థ రూ. 19.05 కోట్లు ఖర్చుచేసి దాదాపు 62 శాతం మేర పనులు చేసింది. మరో రూ.11.29 కోట్ల విలువైన పనులు పెండింగ్‌లో ఉంచింది. భూసేకరణ అంశంలో కోర్టు కేసులు, అటవీ పర్యావరణ అనుమతులు రావడంలోని ఆటంకాల కారణంగా ఫ్లడ్‌బ్యాంక్ పనులు పూర్తికావడం లేదు. కాగా, శ్రీశైలం జలాశయం నుంచి 120 వరద రోజుల్లో రాయలసీమకు తాగునీటిని అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది