AP Cabinet: రూ.79,900 కోట్ల పెట్టుబడులకు ఓకే
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:25 AM
రాష్ట్ర భవిష్యత్‌కు పటిష్ఠ పునాదులు వేయాలనే లక్ష్యంతో రూ.79,900కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు లక్షన్నర ఉద్యోగాలు....
తద్వారా లక్షన్నర ఉద్యోగాలు: మంత్రివర్గం
ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ పాలసీ 4.0కి ఆమోదం
ఐటీ, డేటా హబ్‌గా విశాఖ
అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భవిష్యత్‌కు పటిష్ఠ పునాదులు వేయాలనే లక్ష్యంతో రూ.79,900కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు లక్షన్నర ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరులకు వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకెళ్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. భవిష్యత్‌లో పెట్టుబడిదారులందరికీ ఏపీ కేంద్రంగా మారేలా పాలసీలు తెస్తున్నట్లు చెప్పారు. ఈ దిశగానే ఎలక్ర్టానిక్స్ కాంపోనెంట్స్ ఉత్పాదక పాలసీ4.0కి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పటివరకు ఈ పాలసీ లేకపోవడంతో.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే భారీ, మధ్య, చిన్నతరహా సంస్థలకు ప్రోత్సాహకాలను అందించే వీలు లేకుండా పోయింది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు భారీగా ప్రోత్సాహకాలు ఇస్తుండడంతో అవన్నీ అటు వెళ్లిపోతున్నాయి. దీంతో ఏపీలోనూ రూపొందించిన ఎలకా్ట్రనిక్స్ కాంపోనెంట్స్ తయారీ పాలసీ 2025-30ని రాష్ట్ర కేబినెట్ ఇప్పుడు ఆమోదించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాబోయే కాలంలో విశాఖను సాఫ్ట్‌వేర్, డేటా సెంటర్‌గా తయారీ చేయాలన్న లక్ష్యంతో పలు సంస్థల పెట్టుబడులకు అంగీకారం తెలిపినట్లు మంత్రి చెప్పారు. ఎస్‌ఐపీబీ సిఫారసుల మేరకు సిఫీ సంస్థకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌లో 3.6 ఎకరాల భూమిని ఎకరా రూ.కోటి చొప్పున కేటాయించేందుకు మంత్రివర్గం సమ్మతించినట్లు తెలిపారు. ఇక్కడి ఐటీ టవర్స్‌లో సత్వ కంపెనీకి ఎకరా రూ.కోటిన్నర చొప్పున 30 ఎకరాలు.. ఏఎన్‌ఎ్‌సఆర్ గ్లోబల్ కార్పొరేషన్‌కు హిల్స్ నంబర్3లో రెండున్నర ఎకరాలు ఒక చోట, 7.79 ఎకరాలు మరోచోట కేటాయించడానికి అంగీకరించింది.
బీవీఎం సంస్ధకు ఎకరా రూ.కోటిన్నర చొప్పున ఐటీ పనోరమా హిల్స్‌లో 30 ఎకరాలు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఫెనమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎకరా రూ.4.05 కోట్ల చొప్పున.. మధురవాడలో ప్లాట్ నంబర్ సీ1ఎ, హిల్స్ నంబర్ 2లో 0.45 ఎకరాలు, రుషికొండ ఐటీ పార్కులోని హిల్స్ నంబర్4లో ప్లాట్ నంబర్ 15బీ, 15సీలో నాలుగు ఎకరాలు ఏపీఐఐసీ ద్వారా అప్పగించాలని నిర్ణయించింది. ఫెనమ్ పీపుల్ రూ.207.5 కోట్ల పెట్టుబడి పెట్టి 2,500 మందికి ఉపాధి కల్పించనుంది. బర్లీ పొగాకు రైతులందరినీ ఆదుకునేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని ఇదివరకే నిర్ణయించగా.. రైతుల నుంచి గరిష్ఠంగా 20 క్వింటాళ్ల చొప్పున కొనాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సత్యనారాయణమూర్తి కమిషన్ సమర్పించిన నివేదికను ఆమోదించినట్లు చెప్పారు. ఈ కేసులో బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దేవదాయ మంత్రిని సీఎం ఆదేశించారని తెలిపారు.
మరిన్ని నిర్ణయాలు..
అనకాపల్లిలో గృహనిర్మాణానికి 58.18 ఎకరాలను భూసమీకరణ ద్వారా తీసుకునేందుకు అంగీకారం.
1,944.19 ఎకరాల భూమిని విశాఖ మెట్రోపాలిటన్ కమిషనర్ ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు ఓకే.
ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఆర్థిక సహకారంతో రాష్ట్ర మంచినీటి సరఫరా, మురుగునీటి యాజమాన్య విధానం కింద 20 ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆమోదం.
ఎన్‌టీఆర్ స్మార్ట్ టౌన్స్ కింద టౌన్‌షి్‌పలు, ఎంఐజీ గృహాల నిర్మాణాలకు ఓకే. మారిటైమ్ బోర్డు ద్వారా రూ.5,526కోట్ల బాండ్ల విడుదలకు ఆమోదం.
విజయనగరం జిల్లా అరసాడలో పీవీఎస్ గ్రూప్ ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు.
అంతర్రాష్ట వివాదాల కారణంగా నిలిచిపోయిన 1,200 మెగావాట్ల కురుకుట్టి పంప్ట్ స్టోరేజీ ప్లాంట్, కర్రివలస 1,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల కేటాయింపులు రద్దు.
నంద్యాల జిల్లాలో ఆర్వీఆర్ ప్రాజెక్ట్సు స్థాపించే 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రతిపాదనలకు ఆమోదం.
శ్రీకాకుళం జిల్లా సంతకవిటిలో పీవీఎస్ రామ్మోహన్ ఇండస్ట్రీస్ ద్వారా 1.5 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపన.
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 300 మెగావాట్ల విండ్ పవర్ ఉత్పత్తికి రెన్యూ వ్యోమన్ పవర్‌కు గ్రీన్‌సిగ్నల్. డోన్ ప్రాంతంలో 600 మెగావాట్ల ప్రాజెక్టు స్థాపనకు రెన్యూ విక్రమ్ శక్తికి అనుమతి. కర్నూలు జిల్లా గుండుతెండ వద్ద శ్రీజా ఇన్‌ఫ్రా ప్రతిపాదనలు రద్దు.
జూ కేంద్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకునే రూ.2,724 రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ.
అనంతపురం జిల్లాలో ‘ఆరో’ ఇన్‌ఫ్రా (గతంలో అరబిందో రియాల్టీ)కి కేటాయించిన 500 మెగావాట్ల సింగనమల పీఎస్పీ అనుమతులు రద్దు.
కడప జిల్లా జమ్మలమడుగులో 1,050 మెగావాట్లు, శ్రీసత్యసాయి జిల్లా సున్నపురాయిపల్లెలో 400 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను జేఎ్‌సడబ్ల్యు సంస్థ స్థాపించేందుకు ఆమోదం.
అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్‌కు ఆమోద ముద్ర.
రాష్ట్ర నూర్‌బాషా/దూదేకుల ఆర్థిక సహకార సంస్థ ఏర్పాటుకు ఓకే.
తల్లికి వందనం పథకం అమలుకు ఆమోదం.
నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని శ్రీ నరసింహరాయ సాగర్ ప్రాజెక్టు (గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు) రక్షణ చర్యల కోసం రూ.53 కోట్లతో పనులు చేపట్టేందుకు ఆమోదం.
విశాఖ జిల్లా గోలుగొండ మండలంలోని తాండవ రిజర్వాయరు ఆధునికీకరణ పనుల బాధ్యతల నుంచి మాక్స్ ఇండియా ఇన్‌ఫ్రా తొలగింపు.
గండికోట ఎత్తిపోతల పథకం స్టేజ్-1, స్టేజ్-2 పంప్ హౌస్‌ల నిర్వహణ బాధ్యత మేఘా ఇంజనీరింగ్‌కు అప్పగింత.
ఎల్‌ఆర్‌ఎస్ పథకానికి సవరణ
జూన్ 30కి ముందున్నవాటికి క్రమబద్ధీకరణ
ఆంధ్రప్రదేశ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అండ్ ప్లాట్స్ రూల్స్ 2020(ఎల్‌ఆర్‌ఎ్‌స-2020)కి సవరణలు చేస్తూ మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. 2019 ఆగస్టు 30కు ముందు ఆమోదం పొందని ప్లాట్స్ సబ్‌డివిజన్లు, లేఅవుట్లు, వెంచర్లను క్రమబద్ధీకరించేందుకు 2020జనవరి 8న మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దరఖాస్తుల స్వీకరణకు 2020 డిసెంబరు 31 వరకు గడువిచ్చారు. వాటి పరిష్కార గడువును 2025 జూలై 8 దాకా పొడిగించారు. అనధికార లే అవుట్ల వల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోయిందని, పలువురు అవగాహన లేక దరఖాస్తు చేసుకోలేక పోయారని డీటీసీపీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తాజా సవరణతో లేఅవుట్లు సబ్‌డివిజన్ క్లియర్ కావడంతోపాటు ప్లాట్లు, రోడ్లకు సరిహద్దులు ఏర్పడతాయి. సవరణ రూల్స్ వచ్చిన 90 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తారు. 2025 జూన్ 30 వరకు ఉన్న లే అవుట్లను క్రమబద్ధీకరిస్తారు.