AP Govt: 1.27 లక్షల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:06 AM
రాష్ట్రంలో రూ.1,27,181 కోట్ల విలువైన పెట్టుబడులకు, తద్వారా 78,771 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
78,771 మందికి ఉద్యోగావకాశాలు
ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం
దొనకొండలో బీడీఎల్‌కు 1,400 ఎకరాలు
రూ.212 కోట్లతో రాజ్‌భవన్ నిర్మాణం
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రూ.1,27,181 కోట్ల విలువైన పెట్టుబడులకు, తద్వారా 78,771 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను రాష్ట్ర సమాచార-పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వివరించారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడానికి గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతిచ్చినట్లు తెలిపారు. రూ.87,500 కోట్ల పెట్టుబడితో తర్లుపాడు, అడవివరం, రాంబిల్లిల్లోని 480 ఎకరాల్లో మూడు క్యాంప్‌సలలో ఈ డేటా సెంటర్‌ను అభివృద్ధి చేస్తారని చెప్పారు. బుధవారం సీఎం సారథ్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో తీసుకున్న పెట్టుబడుల నిర్ణయాలన్నిటినీ మంత్రివర్గం ఆమోదించిందన్నారు. అనకాపల్లి జిల్లాలో అధునాతన కార్బన్ కాంప్లెక్స్ తయారీ, పల్నాడుల్లో శ్రీసిమెంట్ ప్లాంటు విస్తరణ, అనంతపురం జిల్లాలో ఏరోస్పేస్, ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీ పరిశ్రమలు, ప్రకాశం జిల్లాలో బీడీఎల్ ప్లాంట్, కర్నూలు జిల్లాలో పారిశ్రామిక ఎస్టేట్ అభివృద్ధి, విశాఖపట్నంలో పారిశ్రామిక, లాజిస్టిక్ హబ్, కర్నూలు జిల్లాలో ఇన్నోవేషన్ సెంటర్, విజయనగరం జిల్లాలో ప్రైవేట్ మెగా పార్కుకు భూముల కేటాయింపులు.. మొత్తంగా 34 అంశాలకు అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సమర్థంగా సేవలు అందించేందుకు 13,351 పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించేందుకు ఆమోదం తెలిపింది.
మరిన్ని నిర్ణయాలు..
రాజధాని అమరావతిలో రాజ్‌భవన్ అంటే.. గవర్నర్ నివాసం, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, అధికారుల స్టాఫ్ క్వార్టర్స్ మొదలైన వాటితో కూడిన నిర్మాణ పనులకు రూ.212.22 కోట్లతో పరిపాలనా ఆమోదం.
అమరావతిలో క్వాలిటీ బేస్ట్ సెలెక్షన్ విధానం ద్వారా నాలుగు ప్రదేశాల్లో (ప్రతి దానికీ 2.5 ఎకరాలు) కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటు.
రాష్ట్రంలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సహా నాలుగు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు.
అమరావతిలో దస్పల్లా అమరావతి హోటల్స్ ఆధ్వర్యంలో 4 స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతి. అరకు వ్యాలీలో 55కోట్ల పెట్టుబడితో వీఎస్కే హోల్స్ రిసార్ట్స్ ఏర్పాటుకు ఆమోదం. శ్రీశైలంలో రూ. 83 కోట్ల పెట్టుబడితో శ్రీవెంకటేశ్వరా లాడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ త్రీ స్టార్ హోటల్ నిర్మాణానికి ఆమోదం. అమరావతిలో రూ. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ -4 స్టార్ హోటళ్లకు రూ. 117 కోట్ల పెట్టుబడితో హోటల్స్ నిర్మాణానికి ఆమోదం.
పల్నాడు జిల్లాలో రూ.2,260 కోట్లతో శ్రీసిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు ఆమోదం.
విశాఖ బీచ్ రోడ్‌లో 13.74 ఎకరాల్లో మెగా షాపింగ్ మాల్ ప్రాజెక్టు చేపడుతున్న లులు లిమిటెడ్‌కు లీజు అద్దె నిబంధనలకు క్యాబినెట్ ఆమోదం. వార్షిక లీజు అద్దె రూ.78.08 కోట్లుగా నిర్ణయం. ఏటా పది శాతం పెంపుదల.
విజయవాడ మల్లవల్లిలో లులూ గ్రూపులో భాగమైన ఫెయిర్ ఎక్స్ ఫోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా ఫుడ్ పార్కు కోర్ ప్రాసెసింగ్ సెంటర్‌కు 7.48ఎకరాలు లీజు ప్రాతిపదికన కేటాయింపు. ఏటా రూ.50 లక్షల చొప్పున 66 ఏళ్లకు కేటాయింపు.

విజయనగరం జిల్లాలో 1166.43 ఎకరాల్లో జేఎ్‌సడబ్ల్యూ ఆధ్వర్యంలో మెగా పారిశ్రామిక పార్కు అభివృద్ధికి ఆమోదం. రూ.531 కోట్ల పెట్టుబడితో 45,000 మందికి ఉద్యోగావకాశాలు.
అనకాపల్లిలో రూ.55 వేల కోట్లతో నిర్మించతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూముల కోసం ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దశల వారీగా చేసినచెల్లింపులకు రూ.12.58 కోట్ల వడ్డీ మినహాయింపు.
రాష్ట్రంలో ఏడు పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం. వీటితో రూ.1,628.8 కోట్ల పెట్టుబడులు.. 4,398 ఉద్యోగాలకు అవకాశం.
విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు రాష్ట్రప్రభుత్వ మద్దతు చర్యగా గతంలోని విద్యుత్ చార్జీల బకాయిలను, రాబోయే కాలంలో కరెంటు చార్జీల బకాయిలను రెండేళ్లలో విశాఖలోని ఏపీఈపీడీసీఎల్‌కు బదలాయించడానికి మంత్రిమండలి ఆమోదం. ఈ మొత్తం రూ.2,400 కోట్లు.
2025-26 సంవత్సరానికి మేజర్, మీడియం, మైనర్ నీటిపారుదల వనరుల నిర్వహణకు సంబంధించిన 7,197 పనులకు రూ.344.39 కోట్లతో పరిపాలనా ఆమోదం.