Share News

AP Cabinet: లక్ష కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్‌ ఓకే

ABN , Publish Date - Nov 11 , 2025 | 04:43 AM

రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో క్యాబినెట్‌ సమావేశం జరిగింది.

AP Cabinet: లక్ష కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్‌ ఓకే

  • విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు అసైన్డ్‌ భూములు

  • చట్టంలో కీలక సవరణలతో ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం

  • విశాఖలో పలు ఐటీ సంస్థలకు భూ కేటాయింపులకు అంగీకారం

  • కుప్పం, ఓర్వకల్లు, నాయుడుపేటల్లో పలు పరిశ్రమలకు కూడా..

  • క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి

అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో క్యాబినెట్‌ సమావేశం జరిగింది. 70 అంశాలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం రాష్ట్ర సమాచార-పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వివరాలు వెల్లడించారు. అభివృద్ధి , యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా దాదాపు లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలసీల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక నూతన విధానాలను రూపొందించిన ఫలితంగా ప్రపంచంలోని అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని తెలిపారు.

మంత్రివర్గ నిర్ణయాలివీ..

  • ఏపీ క్యాంటమ్‌ కంప్యూటింగ్‌ విధానం 2025-30కి ఆమోదం. క్యాంటింగ్‌ కంప్యూటింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు స్టార్ట్‌పలు, విద్యా సంస్థలు, తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలకు అంగీకారం. బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం.

  • నైబర్‌హుడ్‌ వర్క్‌స్పేస్‌ విధానానికి ఆమోదం. ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం.

  • విశాఖలో రియాల్టీ, రహేజా, ఏఎన్‌ఎ్‌సఆర్‌ గ్లోబల్‌ కార్పొరేషన్‌, క్యూఎంట్‌ గ్రిడ్‌ లిమిటెడ్‌ తదితర ఐటీ సంస్థలకు భూముల కేటాయింపు.

  • రూ.550 కోట్లతో శ్రీసిటీలో పీసీబీఏ, బీఎల్‌డీసీ మోటార్లు, కాపర్‌ట్యూబ్స్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఎస్‌సీఐసీ వెంచర్స్‌కు అనుమతి.

  • క్రయాన్‌ టెక్నాలజీ శ్రీసిటీలో ఏర్పాటుచేస్తున్న ఐటీ ఎన్‌క్లోజర్లు, పీసీబీ బేర్‌ బోర్డుల తయారీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు.

  • కుప్పంలో రూ.2081 కోట్ల పెట్టుబడితో యానోడ్‌ మెటీరియల్‌ తయారీ సౌకర్యం ఏర్పాటు చేయడానికి ఎన్‌పీఎ్‌సపీఎల్‌ అడ్వాన్స్‌ మెటీరియల్స్‌ సంస్థకు అనుమతి. 60 శాతం మూలధన రాయితీ, విద్యుత్‌ రాయితీ రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడానికి ఆమోదం.

  • కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఇండీచిప్స్‌ సెమీకండక్టర్స్‌ లిమిటెడ్‌కు 150 ఎకరాలు.

  • ఓర్వకల్లు డ్రోన్‌ సిటీలో 50 ఎకరాల్లో డెడికేటెడ్‌ డ్రోన్‌ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం.


  • ఓర్వకల్లులో రూ.1,090 కోట్లతో సింథటిక్‌ ఆర్గానిక్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం సిగాచి ఇండస్ట్రియల్‌ లిమిటెడ్‌కు 100 ఎకరాలు.

  • నెల్లూరులో ఫైబర్‌ సిమెంట్‌ ప్లాంట్‌ కోసం బిర్లా లిమిటెడ్‌కు 48.47 ఎకరాలు.

  • అనకాపల్లి జిల్లాలో రూ.489 కోట్లతో రక్షణ పరికరాల తయారీ కోసం భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌కు 160 ఎకరాలు.

  • ఇదే జిల్లో రూ.1,234 కోట్లతో భారీ భూమి తవ్వే పరికరాలు, విడిభాగాలు తయారీ పరిశ్రమ ఏర్పాటుకు డోస్కో ఇండియాకు 150 ఎకరాలు.

  • కృష్ణా జిల్లాలో 40 ఎకరాల ఎంఎ్‌సఎంపీ పారిశ్రామిక పార్క్‌కు శ్రీవేదా ఇన్నోవేషన్‌ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అనుమతి.

  • అనంతపురంలో రూ.1,247 కోట్లతో సమీకృత టీఎంటీ బార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సుగుణ స్పాంజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 308 ఎకరాలు.

  • రూ.8,570 కోట్లతో విజయనగరంలో సమీకృత ఉక్కు ప్లాంటు ఏర్పాటుకు సూపర్స్‌స్మెల్టర్స్‌ లిమిటెడ్‌కు 1,085 ఎకరాలు.

  • కుప్పంలో రూ.898 కోట్లతో తోలుకాని ఫుట్‌వేర్‌ తయారీ కోసం వ్వాసేంగ్‌ ఫుట్‌ వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 103.19 ఎకరాలు.

  • నాయుడుపేట సెజ్‌లో రూ.1,743 కోట్లతో 4జీడబ్ల్యూ సోలార్‌ సెల్‌, మాడ్యూల్‌ తయారీ పరిశ్రమకు వోల్ట్‌సన్‌ ల్యాబ్స్‌కు 40 ఎకరాలు.

  • రూ.44 వేల కోట్లతో గ్రీన్‌ అల్యూమినియం స్మెల్టర్‌ ఏర్పాటుకు ఏఎం గ్రీన్‌ మెటల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌డ్‌కు అదనంగా 250 ఎకరాలు.

  • కంప్రెస్డ్‌ బయో-గ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌కు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పులపత్తూరులో 50 ఎకరాలు, గుండ్లూరులో 100 ఎకరాలు లీజుపై అప్పగింత.

  • కృష్ణా జిల్లా మచిలీపట్నం టౌన్‌ మాచవరం ప్రాంతంలో టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మాణానికి 1.60 ఎకరాల ప్రభుత్వ భూమి.

  • తిరుపతి అవిలాలలో టీడీపీ కార్యాలయానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి.


  • సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు శ్రీసత్యసాయి జిల్లా దిమ్మనాయునిపేట, నందిపాడు, ఇరువరం గ్రామాల్లో 38.10 ఎకరాలు.

  • ఈ నెల 14-15 తేదీల్లో విశాఖ భాగస్వామ్య సదస్సులో పర్యావరణ అనుకూల పట్టణ పరిపాలన, డిజిటల్‌ పరిపాలన మానవనరుల అభివద్ధి, సుస్థిర ఆర్థికాభివృద్ధి వంటి రంగాల్లో సింగపూర్‌ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆమోదం.

  • ఉండవల్లి వద్ద మరో పంపింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.595 కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం.

  • రాజధాని అమరావతిలో కృష్ణాయపాలెం వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి జోన్‌-8 ప్రాంతంలో, పెనుమాక లే అవుట్‌లో ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో అనుసంధానంగా ఉండే ‘రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, మురుగునీరు, విద్యుత్‌ ఐసీటీ కోసం యుటిలిటీ డక్టులు, రీయూజ్‌ అవెన్యూ ప్లాంటేషన్‌’ కోసం రూ.1,863.00 కోట్లతో టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఇచ్చేందుకు ఆమోదం.

  • అమరావతిలోని ఎల్‌పీఎస్‌ జోన్‌-4, 9, 12ల అభివృద్థి కోసం నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ (న్యాబ్‌ఫిడ్‌) నుంచి రూ.7,500 కోట్ల రుణం పొందేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి.

  • ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ కింద బాపట్ల జిల్లా బల్లికురవ మండలం, ఎస్‌ఎల్‌ .గుడిపాడు, ముక్తేశ్వరం గ్రామాల్లోని కుందూరు (తూర్పు) గ్రామం, సంతమాగులూరు మండలంలో దాదాపు 1,000 ఎకరాల్లో పునరుత్పాదక ఇంధనం మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటుకు ఆమోదం.

  • రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ యుటిలిటీల నిర్వహణ అవసరాలకు, బొగ్గు కొనుగోలు, విద్యుత్‌ కొనుగోలు వంటి అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా అప్పుగా ఇవ్వడానికి ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు నుంచి టర్మ్‌ లోన్‌ పొందేందుకు రూ.1,000 కోట్లకు ప్రభుత్వ గ్యారెంటీ.

  • మెగా హ్యాండ్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ధర్మవరంలోని మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో అద్దెకు 9.84 సెంట్ల ప్రభుత్వ భూమి.

  • 2025-26 ఖరీ్‌ఫలో ధాన్యం సేకరణకు ప్రభుత్వ గ్యారెంటీ గరిష్ఠ పరిమితి రూ.39 వేల కోట్ల నుంచి రూ.44,000 కోట్లకు పెంపు.


త్వరలో గవర్నర్‌ ఆమోదానికి అసైన్డ్‌ ఆర్డినెన్స్‌!

అసైన్డ్‌ భూముల వినియోగం విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సోలార్‌, విండ్‌, ఇతర విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు అవసరం ఉన్న చోట అసైన్డ్‌ భూములు కేటాయించేలా ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల చట్టం-1977 (పీఓటీ యాక్ట్‌)లో చేపట్టిన కీలక సవరణలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం లేకపోవడంతో దీనిపై ఆర్డినెన్స్‌ తీసుకురావాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. విద్యుదుత్పత్తి కేంద్రాలకు, ఇతర పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వ భూములు కేటాయిస్తున్న సంగ తి తెలిసిందే. అవసరం ఉన్న చోట ప్రైవేటు భూములు సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములు కూడా తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇందుకు అసైన్డ్‌ చట్టం అనుమతించడం లేదని.. వాటిని కూడా సేకరించేందుకు చట్ట నిబంధనలను మార్చి ఆర్డినెన్స్‌ జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో త్వరలో ఆర్డినెన్స్‌ను గవర్నెర్‌ ఆమోదానికి పంపించనున్నారు.

Updated Date - Nov 11 , 2025 | 07:11 AM