Nara Lokesh: ఏపీ బ్రాండ్‌ను నాశనం చేశారు
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:09 AM
ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్ అని.. దానిని 2019-24 మధ్య ఐదేళ్లపాటు జగన్ నాశనం చేశారని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన...
జగన్‌పై లోకేశ్ ఫైర్
ఎమర్జెన్సీ పాలన ఉంటే బయట తిరగ్గలరా?
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు
మేం అక్కడ ఉండగానే సుస్థిర ప్రభుత్వం లేదంటూ సింగపూర్ ప్రభుత్వానికి మెయిళ్లు
పెట్టుబడి పెడితే నష్టపోతారని బెదిరింపులు
పెద్దిరెడ్డి కంపెనీకి చెందిన మురళీకృష్ణతో ఈ-మెయిల్ పంపించారు
అతడిపై కచ్చితంగా చర్యలుంటాయ్
జగన్ తప్పులు దిద్దడానికే సింగపూర్‌కు
వచ్చే ఐదేళ్లలో ఆ ప్రభుత్వం నుంచి 45 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయ్
ఇది జగన్‌కు బ్యాడ్ న్యూస్.. యువతకు గుడ్‌న్యూస్: మంత్రి లోకేశ్
అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్ అని.. దానిని 2019-24 మధ్య ఐదేళ్లపాటు జగన్ నాశనం చేశారని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన గురువారం ఉండవల్లి నివాసంలో మీడియాతో మాట్లాడారు. జగన్ నిర్వాకాలు, పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి జరుగుతున్న కుట్రలు, మద్యం స్కాం, పోలవరం-బనకచర్ల పథకం.. ఇలా పలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ‘విద్యుత్ కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లను జగన్ నాడు ఏకపక్షంగా రద్దు చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చి తమ దేశ సంస్థలతో కలసి ఏపీని, అమరావతిని అభివృద్ధి చేస్తామంటే.. వాళ్లతో కనీసం చర్చించకుండా ఒప్పందాలు రద్దుచేయడంతో రాష్ట్రం బ్రాండ్ పోయింది. రాష్ట్రానికి అత్యధికంగా పన్నులు చెల్లించే అమరరాజా కంపెనీపై దాడులు చేసి జగన్ తెలంగాణకు తరిమేశారు. లులూ గ్రూప్ టెండర్లలో పాల్గొని విశాఖలో భూములు పొందితే.. వాటి కేటాయింపుల రద్దుతో రాష్ట్ర బ్రాండ్ పోయింది’ అని విరుచుకుపడ్డారు. అందుకే ప్రజలు 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో 164 స్థానాలతో 94 శాతం స్ట్రయిక్ రేటుతో టీడీపీని గెలిపించారని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో సింగపూర్ ప్రభుత్వ కంపెనీల నుంచి రూ.45 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని లోకేశ్ తెలిపారు. ఇది జగన్‌కు బ్యాడ్ న్యూస్.. రాష్ట్ర యువతకు గుడ్‌న్యూ్‌సగా అభివర్ణించారు.
సింగపూర్ ప్రభుత్వ కంపెనీల నుంచి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర చేశారని మండిపడ్డారు. ‘మేం అక్కడ ఉండగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ కంపెనీకి చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తితో.. రాష్ట్రంలో ప్రభుత్వం అస్థిరంగా ఉందంటూ సింగపూర్ ప్రభుత్వానికి, మంత్రులకు ఈ-మెయిల్ చేయించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే నష్టపోతారంటూ అందులో హెచ్చరించారు. తప్పుడు ఈ-మెయిల్స్ పంపిన మురళీ కృష్ణపై కఠిన చర్యలు ఉంటాయి. ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకుని.. చర్యలకు ఉపక్రమించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో స్పీడ్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంటుంది’ అని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకూ రాష్ట్రం కోసం పనిచేస్తుంటే.. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ ఇంకా ఏమన్నారంటే..
కాలు బయటపెట్టగలరా..?
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన ఉందని జగన్ అంటున్నారు. నిజంగా అదే ఉంటే ఆయన జగన్ కాలు బయటపెట్టి తిరగగలిగేవారా? జగన్‌కు మేం పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నాం. జగన్‌కు మేం పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నాం. పోలీసు భధ్రత కల్పిస్తే నిర్బంధిస్తున్నామంటారు. వదిలేస్తే భద్రత కల్పించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. విశాఖలో టీసీఎ్‌సకు ఎకరా 99 పైసలకే కేటాయించేందుకు ప్రధాని మోదీ మా ప్రభుత్వానికి ఆదర్శం. పశ్చిమ బెంగాల్‌లో టాటా నానో కార్ల తయారీ యూనిట్ స్థాపించేందుకు సిద్ధపడిన సమయంలో అల్లర్లు జరిగితే.. గుజరాత్ సీఎంగా మోదీ.. టాటా గ్రూప్‌నకు ఎకరా రూపాయికే కేటాయించారు.
పట్టుదలతో పరిశ్రమలను రప్పిస్తున్నాం..
రాష్ట్రానికి పట్టుదలతో పరిశ్రమలను రప్పిస్తున్నాం. 2024లో గెలిచిన వెంటనే ఆదిత్య మిట్టల్‌తో జూమ్‌కాల్‌లో మాట్లాడితే.. ఆయన వెంటనే రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ స్థాపనకు ముందుకొచ్చారు. సెప్టెంబరులో విశాఖకు టీసీఎస్ వస్తోంది 4,500 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. దేశంలోనే అతిపెద్ద టాటా డేటా సెంటర్ విశాఖలో రాబోతోంది. యువతకు ఉద్యోగాల కోసమే కంపెనీలకు రాయితీపై భూములు ఇస్తున్నాం. మేమేమీ భారతీ సిమెంట్స్‌కో.. హెరిటేజ్ సంస్థకో భూములు ఇవ్వలేదు. 2029కల్లా 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టబడులను ఆకర్షిస్తున్నాం.
సుస్థిర ప్రభుత్వాలు కొనసాగాలి..
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సుస్థిర ప్రభు త్వం కొనసాగాలి. సింగపూర్‌లో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతూ ఉండడం వల్లే అభివృద్ధి సాధ్యమైంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొనసాగుతున్నందునే వికసిత్ భారత్ సాధ్యమవుతోంది. 2019లో టీడీపీ ఓటమి వల్లే రాష్ట్రం సర్వనాశనమైంది. ఒక రాష్ట్రం.. ఒక రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ.. కూటమి నినాదం.
తప్పులు దిద్దడానికే సింగపూర్‌కు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నేత్వత్వంలో నాలుగు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతమైంది. జగన్ హయాంలో జరిగిన తప్పుల రికార్డులను సరిచేసేందుకే మంత్రులు నారాయణ, టీజీ భరత్, నేను, అధికారుల బృందం అక్కడకు వెళ్లాం. గతంలో అమరావతి నగరం, రాష్ట్ర అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను వారితో కనీసం చర్చించకుండానే జగన్ రద్దుచేసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్మగరత్నం, మంత్రి టాన్ సె లింగ్ సహా అక్కడి ప్రభుత్వ పెద్దలందరితో చర్చలు జరిపాం. నాలుగు రోజుల్లో చంద్రబాబు 26 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు. నేను 19 ముఖాముఖి చర్చల్లో పాలుపంచుకున్నాను. టువాస్ పోర్టు, జురాంగ్ పెట్రో కెమికల్స్, ఐటీ ఎలక్రానిక్స్, రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ కంపెనీలతో భేటీ అయ్యాం. పెట్టుబడుల కోసం పలు కంపెనీల ప్రతినిధులు, యాజమాన్యాల నుంచి కమిట్‌మెంట్స్ తీసుకున్నాం. రాష్ట్రాభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం రోడ్ మ్యాప్ ఇచ్చింది.