AP BJP State President: దేశంలో మత వివక్ష లేదు
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:37 AM
దేశంలో మతం ఆధారంగా ప్రజలపై ఎలాంటి వివక్ష చూపడం లేదని, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
రాయచోటి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): దేశంలో మతం ఆధారంగా ప్రజలపై ఎలాంటి వివక్ష చూపడం లేదని, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ అన్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక కల్యాణ మండపంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యతను ప్రతి కార్యకర్త తీసుకోవాలన్నారు. పీఎం కిసాన్, ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన తదితర పథకాలు, వికసిత్ భారత్ గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఉగ్రవాదాన్ని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నామని, ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పామన్నారు. మోదీ ప్రేరణతో పార్టీని గొప్ప స్థాయికి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. జిల్లాలో హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. బీజేపీ ప్రభుత్వయేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపడం లేదన్నారు. సమావేశంలో మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేశ్ పాల్గొన్నారు.