AP BJP: ఖాదీ సంతకు రండి
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:02 AM
మహాత్మా గాంధీ జయంతి(అక్టోబరు 2) సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంత నిర్వహిస్తున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీరు తప్పకుండా రావాలి అంటూ సీఎం చంద్రబాబుని ఏపీ బీజేపీ ఆహ్వానించింది.
చంద్రబాబును ఆహ్వానించిన మాధవ్
స్వదేశీ ఉద్యమంలో భాగంగా అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బీజేపీ
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘మహాత్మా గాంధీ జయంతి(అక్టోబరు 2) సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘ఖాదీ సంత’ నిర్వహిస్తున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీరు తప్పకుండా రావాలి’ అంటూ సీఎం చంద్రబాబుని ఏపీ బీజేపీ ఆహ్వానించింది. ఆమెరికా పన్నుల ఆంక్షల నేపథ్యంలో బీజేపీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. స్వదేశీ ఉత్పత్తులు వినియోగించేలా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ, చేతి వృత్తుల వారికి అండగా నిలుస్తోంది. అందులో భాగంగా విశ్వకర్మలు, చేనేతలు, ఇతర వృత్తుల వారికి మద్దతుగా గాంధీ జయంతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) మధుకర్ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. విజయవాడలో నిర్వహించే ఖాదీ సంతకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు తోడ్పాటు, అమరావతిలో విశ్వకర్మ విగ్రహ ఏర్పాటు, సంచార జాతుల వారి సమస్యలపై ముఖ్యమంత్రితో బీజేపీ అధ్యక్షుడు చర్చించారు. ఎన్‌టీ-డీఎన్‌టీ కమిషన్ ఏర్పాటు చేసి సంచార జాతుల వారికి న్యాయం చేయాలని కోరారు. కుల వృత్తులను కూటమి ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. ఖాదీ సంతకు తప్పకుండా వస్తానని బీజేపీ నేతలకు మాటిచ్చారు.