AP Assembly Sessions: నేటి నుంచే అసెంబ్లీ
ABN , Publish Date - Sep 18 , 2025 | 02:50 AM
రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి మొదలవుతున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి.
ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయసభలు 10 రోజులు నిర్వహించే అవకాశం.. బీఏసీ భేటీలో తుది నిర్ణయం
స్పీకర్, మండలి చైర్మన్ ఉన్నత స్థాయి సమీక్ష.. సభ్యులకు ఇబ్బందులు రాకుండా చూడాలి.. సమాధానాలు సకాలంలో వారికి అందాలి
వైసీపీ సభ్యులకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా.. నన్ను గౌరవించకున్నా సభాపతి స్థానాన్ని గౌరవించి అసెంబ్లీకి రండి.. చర్చకు అవకాశమిస్తాం: స్పీకర్
అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి మొదలవుతున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. అనంతరం స్పీకర్ అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఏడు నుంచి పది రోజులు జరిపే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 15 రోజులు జరిగిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలపై సభాపతి అయ్యన్నపాత్రుడు, మండలి చైర్మన్ మోషేన్ రాజు బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశాల సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. సభ్యులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని స్పీకర్ అధికారులను ఆదేశించారు. ప్రశ్నోత్తరాల్లో సభ్యులకు సమాధానాలు సకాలంలో చేరాలని స్పష్టం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలందరూ రావాలని మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నానని, తమ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి దీనిని సదవకాశంగా తీసుకోవాలని సూచించారు. ‘అయ్యన్నపాత్రుడిగా నాకు గౌరవం ఇవ్వాలని కోరడం లేదు. సభాపతి స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలపై ఉంది. సభకు వస్తే ప్రజాసమస్యలు చర్చించేందుకు అందరికీ అవకాశం కల్పిస్తాం. వారు అసెంబ్లీకి రాకుండా బయట తిరగడం మంచిది కాదు.’ అని అన్నారు.
వెంకటపాలెంలో నేడు ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం నివాళి
శాసనసభ సమావేశాలకు వెళ్లే ముందు సీఎం చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పిస్తారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరవుతారు. ఈ కార్యక్రమం తర్వాత అసెంబ్లీకి పయనమవుతారు.