Share News

AP Assembly: జూనియర్‌ అసిస్టెంట్‌గా చంద్రయ్య కుమారుడు

ABN , Publish Date - Sep 27 , 2025 | 04:01 AM

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత సాయి సాకేత్‌ మైనేనికి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇచ్చే సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

AP Assembly: జూనియర్‌ అసిస్టెంట్‌గా చంద్రయ్య కుమారుడు

మూడు సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత సాయి సాకేత్‌ మైనేనికి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇచ్చే సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘నియామకాల క్రమబద్ధీకరణ, సిబ్బంది సరళి, చెల్లింపుల విధానం’ సవరణ బిల్లు ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో సాకేత్‌ ప్రతిభ కనబర్చారని, మొత్తంగా 43 పతకా లు సాధించారని వివరించారు. ఆయనకు కేంద్రం అర్జున అవార్డును ప్రదానం చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన సాకేత్‌కు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని చెప్పారు.


తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం

వైసీపీ హయాంలో దారుణ హత్యకు గురైన పల్నాడు జిల్లా వాసి తోట చంద్రయ్య కుమారుడికి జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇచ్చే బిల్లును కూ డా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎలాంటి నేర చరిత్ర, ఫ్యాక్షన్‌ నేపథ్యం లేని చంద్రయ్య గత ప్రభుత్వంలో రాజకీయ ప్రేరేపిత హింసలో హత్యకు గురయ్యారని పయ్యావుల తెలిపారు. అప్పట్లో చంద్రబాబు వారి కుటుంబాన్ని పరామర్శించి రూ.25లక్షల ఆర్థిక సాయం చేశారని గుర్తుచేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేశ్‌ దృష్టి పెట్టారని చెప్పారు. రాజకీయ హింసలో చనిపోతే ఆ కుటుంబానికి ఎందుకు ఉద్యోగం ఇవ్వకూడదని పట్టుబట్టారని వివరించారు.


జీఎస్టీపై గ్రామాల్లో 10వేల సమావేశాలు

దసరా అనంతరం జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని మంత్రి పయ్యావుల తెలిపారు. గ్రామాల్లోనే 10 వేలకు పైగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేం ద్రం జీఎస్టీలో చేసిన మార్పులకు అనుగుణంగా ‘ఏపీ జీఎస్టీ’ చట్టానికి శుక్రవారం ఆయన ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం లభించింది. రాష్ట్రంలో ప్రతి గృహిణి, రైతు, రైతు కూలీ అందరికీ సంస్కరణలు అర్థమయ్యేలా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 04:04 AM