AP Investment Proposals: 1,04,694 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Nov 08 , 2025 | 06:03 AM
రాష్ట్రంలో వివిధ రంగాల్లో పరిశ్రమల స్థాపనకు వచ్చిన 29 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రూ.1,04,694 కోట్ల పెట్టుబడులతో...
87,166 ఉద్యోగాలు
29 ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మండలి సమావేశం
అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ రంగాల్లో పరిశ్రమల స్థాపనకు వచ్చిన 29 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రూ.1,04,694 కోట్ల పెట్టుబడులతో 87,186 మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ వచ్చిన ప్రతిపాదనలను ఈ నెల 4న సీఎస్ కె.విజయానంద్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ(ఎస్‌ఐపీసీ) ఆమోదించింది. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఎస్‌ఐపీసీ ఆమోదించిన 29 ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి, చర్చించిన ఎస్‌ఐపీబీ వాటిని ఆమోదించింది. ఆహార శుద్ధి విభాగంలో రూ.744 కోట్లతో అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ స్థాపించే పరిశ్రమకు అనుమతి లభించింది. ఐటీ శాఖ రూ.32,952 కోట్లతో 64,352 మందికి ఉపాధి కల్పించే 12 ప్రతిపాదనలను ఎస్‌ఐపీబీ ఆమోదించింది. వాటిలో తిరుపతిలో ఎపిటోమ్ కాంపొనెంట్స్ ప్రైవేట్, కుప్పంలో ఎన్‌పీఎస్పీఎల్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రైయాన్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్, శ్రీసిటీలో ఎసీఐసీ వెంచర్స్ ఎల్‌ఎల్‌పీ, కర్నూలులో ఇండిచిప్ సెమికండక్టర్స్ లిమిటెడ్, విశాఖలో ఫ్లూఎన్ట్‌గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్, కె.రహేజా కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, ఐస్పేస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, మెస్సర్స్ క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థలు ఉన్నాయి.
ఇంధన శాఖ...
రూ.9,700 కోట్లతో రెండు ప్రతిపాదనలను చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చిట్టెంవలసలో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ స్థాపించే పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాన్ని 1,800 మెగావాట్లకు పెంచేందుకు, కర్నూలులో ఎస్‌ఏఈఎల్ సోలార్-పీ12 సంస్థ 250 మెగావాట్ల ఏసీ, 334 మెగావాట్ల డీసీ ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఏపీ టూరిజం అథారిటీ రూ.208 కోట్లతో రెండు ప్రతిపాదనలు చేసింది. కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలంలో మైరా బే వ్యూ రిసార్ట్స్‌కు, విజయవాడలో విశ్వనాథ్ స్పోర్ట్స్, కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎస్‌ఐపీబీ పచ్చ జెండా ఊపింది.
పరిశ్రమల శాఖ...
రూ.57,738కోట్లతో 23,520 మందికి ఉపాధి హామీ తో 6 ప్రతిపాదనలు చేసింది. పల్నాడులో చెట్టినాడు సిమెంట్స్, అనంతపురంలో సుగ్న స్పాంజ్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, విజయనగరంలో సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ, నాయుడుపేటలో వోల్ట్‌సన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ సెజ్, కాకినాడలో ఏఎం గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ ప్రైవేటు లిమిటెడ్, కుప్పంలో హ్వాసంగ్ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో పెట్టే బాలాజీ యాక్షన్ తెసా ప్రాజెక్టుకు ఎస్‌ఐపీబీ ఆమోదముద్ర వేసింది. రూ.3,053 కోట్లతో 3,792మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఏపీఐఐసీ చేసిన 4 ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. వాటిలో నెల్లూరులో బిర్లానూ లిమిటెడ్, కర్నూలులో సగాచీ ఇండస్ట్రిస్, అనకాపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అనకాపల్లిలో డోజ్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. రూ.12కోట్లతో 1,500 మందికి ఉపాధి కల్పించే ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కును కృష్ణా జిల్లాలో శ్రీ వేద ఇన్నోవేషన్ పార్కు ఏర్పాటు చేస్తుందంటూ చేసిన ప్రతిపాదనకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.