State Investment Promotion Committee: మరో రూ.21,793 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Nov 25 , 2025 | 05:05 AM
రాష్ట్రంలో మరో రూ.21,793 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోదం తెలిపింది.
93,088 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలకు ఎస్‌ఐపీసీ ఓకే
సీఎస్ విజయానంద్ అధ్యక్షతన సమావేశం
ప్రోత్సాహక మండలి ఆమోదించాక 28న క్యాబినెట్ ముందుకు
అమరావతి, నవంబరు 24 (ఆంద్రజ్యోతి): రాష్ట్రంలో మరో రూ.21,793 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 93,088 మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. సోమవారం వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధ్యక్షతన 17వ ఎస్‌ఐపీసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆమోదం పొందిన ప్రతిపాదనలకు సీఎం ఆధ్వర్యంలోని రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ నెల 28వ తేదీన వాటిని మంత్రిమండలి ముందుంచుతారు.
ఆమోదం పొందిన ప్రతిపాదనలివీ..
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర, గుదిబండ మండలాల్లో రూ.8,500 కోట్లతో 1,700 మెగావాట్ల ఏసీ/2,125 మెగావాట్ల డీసీ సోలార్ ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటుకు చింతా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు చేసిన ప్రతిపాదనకు ఆమోదం. దీనిద్వారా 5,800 మందికి ఉపాధి.
అనంతపురం జిల్లా కనేకల్, బొమ్మనహళ్ మండలాల్లో రూ.2,140 కోట్లతో గనేకో త్రీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదించిన 300 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టుకు ఆమోదం. వెయ్యి మందికి ఉద్యోగాలు.
రూ.850 కోట్లతో ప్రకాశం జిల్లా దొనకొండలో 130 మెగావాట్ల డీసీ, 150 మెగావాట్ల డీసీ సోలార్‌పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు క్రెడిబుల్ ఇంజనీరింగ్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టు లిమిటెడ్‌కు గ్రీన్‌సిగ్నల్.
రూ.2,926 కోట్లతో శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఎంవీఆర్ టెర్రా వెంట్ ప్రతిపాదించిన 640 మెగావాట్ల ఏసీ, 770 మెగావాట్ల డీసీ ప్రాజెక్టుకు ఆమోదం. 1,300 మందికి ఉపాధి.
సిప్సా టెక్ ఇండియా (రూ.1,140 కోట్ల పెట్టుబడి, 1,251 మందికి ఉద్యోగాలు), శ్రీ తమ్మిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ (రూ.62 కోట్లు-500 మందికి ఉపాధి), ఏసీఎన్ హెల్త్‌కేర్ ఆర్‌సీఎం సర్వీసెస్ (రూ.30 కోట్లు-600 మందికి ఉద్యోగాలు) నాన్‌రెల్ టెక్నాలజీస్ (రూ.51 కోట్లు-567 మందికి ఉద్యోగాలు), పీవీఆర్ హాస్పిటల్స్ (రూ.225 కోట్లు-1,230 మందికి ఉద్యోగాలు), మెగ్లాన్ లీజర్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ (రూ.348 కోట్లు-1,700 మందికి ఉపాధి)లకు 2025-29 పారిశ్రామిక విధానం మేరకు భూములను కేటాయించడంతో పాటు ప్రోత్సాహకాలివ్వాలని ఎస్‌ఐపీసీ తీర్మానం.
రామాయపట్నం పోర్టుకు సమీపంలో చేవూరు వద్ద మల్టీ మోడల్ కార్గో హాండ్లింగ్‌ను రూ.1,615 కోట్లతో చేపట్టేందుకు రామాయపట్నం కార్గో రైల్‌కు అనుమతి. దీనిద్వారా 1,300మందికి ఉద్యోగాలు. ఈ సంస్థకు 429 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి సిఫారసు.
ఎర్లీబర్డ్ ప్రతిపాదనల కింద మల్లాది డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్ తిరుపతిలో రూ.343 కోట్లతో 355 మందికి ఉద్యోగాలను కల్పిస్తామని ప్రతిపాదించింది. ఈ సంస్థకు 30 శాతం క్యాపిటల్ సబ్సిడీ.
బాపట్ల జిల్లాలో రూ.163 కోట్లతో 415 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎమెర్జ్ గ్లాస్ ఇండస్ట్రీస్ ప్రతిపాదనకు ఆమోదం. దీనికి కూడా 30 శాతం పెట్టుబడి రాయితీ. ఇదే జిల్లాలో జెడ్‌ఈఐటీ ఎనర్జీ రూ.305 కోట్లతో 300 మందికి ఉద్యోగాలను కల్పించే ప్రాజెక్టుకూ 30 శాతం పెట్టుబడి రాయితీ. ఏలూరు జిల్లాలో రూ.141 కోట్లతో 600 మందికి ఉద్యోగాలిచ్చే రామన్‌సింగ్స్ గ్లోబల్ ఫుడ్ పార్కుకు 30 శాతం పెట్టుబడి సబ్సిడీ.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ రూ.1,225 కోట్లతో 2,000 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం.