Nara Lokesh: గ్లోబల్ హబ్‌గా ఏపీ
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:13 AM
ఏపీని క్రియేటివ్ ఎకానమీ, టూరిజం డిజిటల్ ఇన్నోవేషన్స్‌లో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
క్రియేటివ్ ఎకానమీ, టూరిజం ఇన్నోవేషన్
రంగాల్లో ప్రపంచ గమ్యస్థానంగా రాష్ట్రం
టెక్ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేశ్
అమరావతిలో వర్చువల్ స్టూడియోలు
క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టును త్వరగా
ప్రారంభించాలని సంస్థ అధినేతకు వినతి
ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కలిసి రావాలని
ఓపెన్ ఏఐ సీటీవో శ్రీనివాస నారాయణన్‌కు సూచన
అమెరికా పెట్టుబడిదారులతో లోకేశ్ వరుస భేటీలు
అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఏపీని క్రియేటివ్ ఎకానమీ, టూరిజం డిజిటల్ ఇన్నోవేషన్స్‌లో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా అమరావతిలో ఏఐ ఆధారిత వర్చువల్ స్టూడియోలు, ఏఆర్/వీఆర్ థీమ్ పార్కులు ఏర్పాటు చేసి అత్యాధునిక ట్రాన్స్ మీడియా నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టు -అమరావతిని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజన్ రాజ్ కురుప్, సీనియర్ పార్టనర్ ఇయాంగ్ కాపింగ్‌ను లోకేశ్ కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న లోకేశ్ సోమ, మంగళవారాల్లో శాన్‌ఫ్రాన్సిస్కోలో పలువురు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అయ్యారు. లోకేశ్ పిలుపుపై సజన్ రాజ్ కురుప్ స్పందిస్తూ.. ఎంవోయూ మేరకు 24 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అది పూర్తయితే రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భారతదేశంలో తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్ టైన్‌మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్‌ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి 2024, మే 4న క్రియేటివ్ ల్యాండ్ ఆసియా సంస్థ ఒప్పందం కుదర్చుకుంది. కాగా, అమరావతి క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులో శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో కలిసి పనిచేయాలని కాన్వా సంస్థను లోకేశ్ ఆహ్వానించారు. ఆ సంస్థ చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగాధిపతి జాసన్ విల్ మాట్‌తో మంత్రి భేటీ అయ్యారు. గిగిలియో స్పందిస్తూ.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు. తమ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
‘పాఠశాల’కు ఉచిత చాట్ జీపీటీ
ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్‌తో లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఒక కుటుంబం-ఒక ఏఐ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి’ అనే లక్ష్యాన్ని సాధించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీనికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం ఏపీతో కలిసి పనిచేయాలని కోరారు. తొలిదశలో ఏపీలోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులకు ఉచిత చాట్‌జీపీటీ అందించాలని భావిస్తున్నామన్నారు. ఏపీలో ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు. దీనిపై శ్రీనివాస నారాయణన్ స్పందిస్తూ.. ‘ఎంటర్‌ప్రైజ్ ఏఐ ఇంటిగ్రేషన్’ కోసం ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టెక్ దిగ్గజాలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. శాన్‌ఫ్రాన్సిస్కో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ 180కిపైగా దేశాల్లో వినియోగదారులు, సంస్థలకు సేవలు అందిస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి బృందంతో చర్చిస్తామని తెలిపారు.
ఏఎండీ అసెంబ్లింగ్ యూనిట్
ఏఎండీ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంశీ బొప్పనతో జరిగిన భేటీలో.. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఏపీ.. ‘ఎఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్’గా తయారవుతోందని మంత్రి లోకేశ్ చెప్పారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్ రంగ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ పాలసీని ప్రకటించామని లోకేశ్ తెలిపారు. ఏపీలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో శ్రీసిటీ, కొప్పర్తి ఏఎండీ ఉత్పత్తుల అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేసి సప్లయ్ చెయిన్‌లో భాగస్వామ్యం కావాలని కోరారు. వంశీ స్పందిస్తూ.. అమెరికా వెలుపల ఏఎండీ అతిపెద్ద ఆర్‌అండ్‌డీ హబ్‌ను భారత్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు., బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ క్యాంప్‌సలలో సిలికాన్ డిజైన్, సాఫ్ట్‌వేర్, ఏఐ ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అధునాతన చిప్ ఉత్పత్తి కోసం టీఎస్ఎంసీ, గ్లోబల్ ఫౌండ్రీస్, ప్యాకేజింగ్ భాగస్వామ్యాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఎలక్ట్రోలైజర్ పరిశ్రమను పెట్టండి
అంతర్జాతీయ సంస్థ ఓమియం చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ చొక్కలింగంతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సంస్థ ఎలక్ట్రోలైజర్, ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ కాంట్రాక్ట్ సేవలు, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన ఎలక్ట్రోలైజర్‌ను తయారు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలోని ఇండస్ట్రియల్ జోన్లలో ఎలక్ట్రోలైజర్ తయా రీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని లోకేశ్ ఆహ్వానించారు. చొక్కలింగం స్పందిస్తూ.. తమ సంస్థ బెంగళూరులో ప్రపంచంలోనే అతిపెద్ద గిగావాట్ ఎలక్ట్రోలైజర్ ఫ్యాక్టరీని నిర్వహిస్తోందని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చి వింగ్
రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివా్‌సతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేయాలని డేవిడ్‌ను ఆహ్వానించారు. ఏపీ ప్రభుత్వ డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో రిగెట్టి క్లౌడ్ క్వాంటమ్ వ్యవస్థలను అనుసంధానించడం ద్వారా ఏపీని భారత్‌లో తొలి క్వాంటమ్ రెడీ స్టేట్‌గా నిలిపేందుకు సహకరించాలని కోరారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని డేవిడ్ పేర్కొన్నారు.
డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీ..
ఎంటర్‌టైన్‌మెంట్ సాఫ్ట్‌వేర్, 3డీ డిజైన్, ఇంజనీరింగ్ రంగాల్లో పేరెన్నికగన్న ‘ఆటో డెస్క్’ సంస్థ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్, సీనియర్ డైరెక్టర్ అల్లిసన్ రోస్‌తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. అమరావతిలో ‘ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ’ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని, అక్కడ ఆటో డెస్క్ సంస్థ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేశ్ ఆహ్వానించారు. ప్రపంచంలోనే తొలిసారిగా బీఐఎం సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న రాజధాని నగరం అమరావతి అని తెలిపారు. ఆటోడెస్క్ ఇన్‌ఫ్రావర్క్స్, బీఐఎం 360ని ఉపయోగించి అమరావతిలో డిజిటల్ ట్విన్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అమరావతిలో ఆటోడెస్క్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీని ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఆటోడెస్క్ ప్రతినిధులు స్పందిస్తూ.. ఏపీ ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
మరింత మందితో..
క్లౌడ్ సెక్యూరిటీ సేవల్లో పేరెన్నికగన్న జడ్ స్కాలర్ సీఈవో జే. చౌదరితో జరిగిన భేటీలో.. విశాఖలో సైబర్ సెక్యూరిటీ కోసం జడ్ స్కాలర్ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌డీ సెంటర్, డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. ఏపీ ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని చౌదరి తెలిపారు.
ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మ కూనపనేనితో జరిగిన భేటీలో.. ఏపీలో స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్, ఎలకా్ట్రనిక్స్ తయారీ క్లస్టర్ల కోసం ఐటీ మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు మద్దతు ఇవ్వాలని కోరారు.
అంతర్జాతీయ వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్టనర్ అరుణ్‌కుమార్‌తో జరిగిన భేటీలో.. ఏపీలో డీప్‌టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని లోకేశ్ ఆహ్వానించారు.
సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేశ్ రాగినేనితో జరిగిన భేటీలో.. విశాఖలో సేల్స్ ఫోర్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ), ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు.
శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్
శ్రీకర్ రెడ్డితో మంత్రి లోకేశ్ భేటీ
శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీకర్ రెడ్డితో లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నామని, దేశంలో తొలిసారిగా ఎంవోయూల తర్వా త నిర్ణీత సమయంలో పరిశ్రమలను గ్రౌండింగ్ చేసే సంస్థలకు ‘ఎస్ర్కో అకౌంట్’ ద్వారా నేరుగా ప్రోత్సాహకాలు అందించే విధానం తీసుకొచ్చామని తెలిపారు. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందంచాలని శ్రీకర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.