Share News

Road Development: రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ

ABN , Publish Date - Jul 25 , 2025 | 03:29 AM

రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, విస్తరణ, అభివృద్ధిపై 15 రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Road Development: రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ

రహదారుల మరమ్మతులకు మరో రూ.500 కోట్లు

ఇంకో వెయ్యి కోట్లతో 2 వేల కి.మీ. కొత్త రోడ్లు

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, విస్తరణ, అభివృద్ధిపై 15 రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రణాళిక ప్రకారం భవిష్యత్‌లో రహదారుల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం రహదారుల పరిస్థితిపై ఆయన సమీక్ష చేశారు. రాష్ట్రంలో రహదారుల మరమ్మతుల కోసం అదనంగా మరో రూ.500 కోట్ల నిధులు ఇవ్వాలన్న ఆర్‌అండ్‌బీ ప్రతిపాదనకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఏడాది వ్యవధిలో రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు రూ.1,800 కోట్ల మేర నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు అదనంగా మరో రూ.500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే, వెయ్యి కోట్ల నిధులతో రాష్ట్రంలో మరో 2వేల కి.మీ. మేర కొత్త రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఆర్‌అండ్‌బీ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన ఆయన టెండర్లకు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోడ్లకు మరమ్మతులు చేయాలి? ఏవి కొత్తగా నిర్మించాలి? నిర్వహణకు వేటిని ఇవ్వాలన్న అంశాలపై 15 రోజుల్లో కార్యాచరణ నివేదికను సమర్పించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర రహదారులను కూడా జాతీయ ప్రమాణాలతో నిర్మించాలన్నారు. వర్షాకాలం ముగిసిన వెంటనే నవంబరు నుంచి కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఏ రోడ్డును ఏ కాంట్రాక్టర్‌ నిర్మించారు? ఎవరు నిర్వహిస్తున్నారన్న వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి 50 కి.మీ. చొప్పున అన్ని రోడ్లపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రహదారుల నిర్వహణను కాంట్రాక్టర్‌కు అప్పగించి వర్షాకాలంలో రోడ్లు పాడవ్వకుండా కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. అధిక రద్దీ ఉన్న 1,332 కి.మీ. పొడవైన 18 రహదారులను పీపీపీ విధానంలో ఫేజ్‌-1లో అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు సీఎంకు నివేదించారు. రెండో దశలో 3,854 కి.మీ. పొడవైన 67 రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 03:31 AM