Aims to Lead in MSME Sector: పారిశ్రామిక ఉత్పత్తుల్లో.. ఎంఎస్ఎంఈల వాటానే ఎక్కువ
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:16 AM
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర....
ఈ రంగంలో ఏపీని అగ్రగామిని చేయడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి
గత ఏడాది 26 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల ఎగుమతి
మరింత పెంచేందుకు ఔత్సాహికులకు సహకారం
మేమొచ్చాక ప్రోత్సాహకాల కింద రూ.439 కోట్లు
విశాఖ ఎగుమతుల సదస్సులో మంత్రి వెల్లడి
16 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు
విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఎంఎ్‌సఎంఈల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం విశాఖలో ఎంఎ్‌సఎంఈ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సదస్సులో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక ఉత్పత్తుల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వాటాయే అధికమన్నారు. ఈ రంగం ఎంత అభివృద్ధి చెందితే ఎగుమతులు అంత ఎక్కువ పెరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎ్‌సఎంఈ పార్కు ఏర్పా టు చేస్తున్నామని చెప్పారు. ప్రైవేటు పార్కుల ఏర్పాటుకు కొందరు ముందుకొస్తున్నారని, వారిని ప్రోత్సహిస్తామన్నారు. గత ఏడాది రాష్ట్రం నుంచి 26 బిలియన్ డాలర్ల ఎంఎ్‌సఎంఈ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేశామని, దీనిని మరింతగా పెంచేందుకు ఔత్సాహికులకు సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రంగానికి అనువుగా క్లస్టర్లు ఏర్పాటుచేయాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనను అమలు చేస్తున్నామని చెప్పారు. ‘ప్రతి క్లస్టర్‌లో భారీ పరిశ్రమలకు అనుబంధంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా 15 అంశాలతో విధానానికి రూపకల్పన చేశాం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు ఎంఎ్‌సఎంఈలకు ప్రోత్సాహకం కింద రూ.439 కోట్లు విడుదల చేశాం. ఈ రంగంలో ఉత్పత్తిచేసే వస్తువుల ఎగుమతులకు ప్రోత్సాహం, వస్తువుల ఉత్పత్తిదారులు, కొనుగోలుదారుల మధ్య అవగాహన కల్పించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. 16 దేశాల నుంచి 44 మంది ప్రతినిధులు వచ్చారు. జాతీయ, అంతర్జాతీయంగా పోటీని తట్టుకునేలా ఉత్పత్తుల తయారీ నుంచి విక్రయాలు, ఎగుమతులు, కొత్త సాంకేతికత వినియోగం వరకు కామన్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నాం. ఇందుకు రూ.200 కోట్లు కేటాయించాం’ అని ప్రకటించారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడిదారుల సదస్సులో సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదురుతాయని భావిస్తున్నామని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. సదస్సులో ఎంఎ్‌సఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఇండియా ఎస్‌ఎంఈ ఫోరం అధ్యక్షుడు వినోద్‌కుమార్, కస్టమ్స్ అదనపు కమిషనర్ ఆర్వీ ప్రథమేశ్ తదితరులు పాల్గొన్నారు.