Share News

Director Damodar Naidu: పాల ఉత్పత్తిలో ఏపీకి ఏడో స్థానం

ABN , Publish Date - Nov 26 , 2025 | 05:03 AM

రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి సగటు పాల వినియోగం రోజుకు 719గ్రాములు. జాతీయ సగటు పాల వినియోగం 459 గ్రాములు.

Director Damodar Naidu: పాల ఉత్పత్తిలో ఏపీకి ఏడో స్థానం

  • మొదటి మూడు స్థానాల కోసం కృషి

  • పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు

  • నేడు జాతీయ పాల దినోత్సవం

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి సగటు పాల వినియోగం రోజుకు 719గ్రాములు. జాతీయ సగటు పాల వినియోగం 459 గ్రాములు. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తిని 2033 నాటికి 150లక్షల టన్నులు సాధించి, 15శాతం వృద్ధి రేటుతో దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో ఉండాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నాం’ అని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ దామోదర్‌ నాయుడు మంగళవారం తెలిపారు. బుధవారం జాతీయ పాల దినోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గత తొమ్మిదేళ్లలో జాతీయ పాల ఉత్పత్తిలో 58శాతం వృద్ధి నమోదైంది. జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఐదు శాతం పాల ద్వారానే తోడ్పాటు అందుతోంది. వ్యవసాయ రంగంలో అతి పెద్ద ఆదాయ వనరు పాలే. రాష్ట్రంలో 25లక్షల మంది రైతులు పశుపోషణపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. పాల ఉత్పత్తిలో ప్రస్తుతం 139.46 లక్షల టన్నులతో ఏపీ దేశంలో 7వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఏపీ పాలు, పాల ఉత్పత్తుల విలువ 713.9 బిలియన్లు ఉండగా, దీనిని 2033 నాటికి రెండింతలు పెంచేందుకు ప్రభుత్వం పశుపోషకులకు అనేక రాయితీలు అందిస్తోంది. 2025 అఖిల భారత పశుగణన ప్రకారం రాష్ట్రంలో 46లక్షల ఆవులు, 62.19లక్షల గేదెలు ఉన్నాయి. 2024-25లో రాష్ట్ర పాల ఉత్పత్తి 139.46 లక్షల టన్నులు ఉండగా, రాష్ట్రంలో ఒక్కొక్క వ్యక్తి సగటు పాల వినియోగం రోజుకు 719గ్రాములు ఉండగా, జాతీయ సగటు పాల వినియోగం 459 గ్రాములు ఉందని అంచనా.


ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తిని 2033 నాటికి 150లక్షల టన్నులు సాధించి, 15శాతం వృద్ధి రేటుతో దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో ఉండాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నాం’ అని తెలిపారు. మేలు రకం పశు గణాభివృద్ధి కోసం రాయితీపై దాణా, పశుగ్రాస భద్రత, జన్యుపరంగా అత్యుత్తమ పశుజాతుల అభివృద్ధి, ఉచిత పశు ఆరోగ్య శిబిరాల నిర్వహణ, గర్భకోశ వ్యాధులు చికిత్స, లింగ నిర్ధారిత వీర్య నాళికల పంపిణీ, పశు బీమా, సంచార పశు ఆరోగ్య సేవలు, మినీ గోకులాల నిర్మాణం, పశు పోషకులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, రైతుసేవా కేంద్రాల సహకారంతో ఇంటి వద్దే పశువైద్యం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

నంద్యాల జిల్లా ఏఐ టెక్నీషియన్‌కు జాతీయ అవార్డు

జాతీయ పాల దినోత్సవం సందర్భంగా డెయిరీ రంగంలో ఉత్తమ సేవలు అందించిన నంద్యాల జిల్లాకు చెందిన అనురాధ అనే పశువైద్య సాంకేతిక సిబ్బంది(ఏఐ టెక్నీషియన్‌) ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు చెప్పారు. కృత్రిమ గర్భోత్పత్తి విధానంలో ఎక్కువ పెయ్య దూడలు పుట్టించడంలో ఆమె కృషి చేశారన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 05:06 AM