Share News

AP Agros Corruption: ఆగ్రోస్‌లో ఇష్టారాజ్యం

ABN , Publish Date - Nov 26 , 2025 | 05:40 AM

ఏపీ ఆగ్రోస్‌ అవకతవకలకు నిలయంగా మారింది. ఉద్యోగులపై సరైన అజమాయిషీ లేక ఇష్టారాజ్యమైపోయింది. కింది స్థాయి ఉద్యోగులు పైస్థాయి అధికారుల పేరు చెప్పి..

AP Agros Corruption: ఆగ్రోస్‌లో ఇష్టారాజ్యం

  • పరికరాల కంపెనీలతో సిబ్బంది లాలూచీ

  • యంత్రాల టెండర్లలో అవినీతి

  • తక్కువ రకం ట్రాక్టర్లు ఇప్పించి..ఓ కంపెనీ నుంచి రూ.లక్షల్లో ముడుపులు

  • అక్రమాలు నిర్ధారణ అయినా చర్యల్లేవు

  • సాయిల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు డొల్ల కంపెనీ ద్వారా పరికరాల సరఫరా

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఏపీ ఆగ్రోస్‌ అవకతవకలకు నిలయంగా మారింది. ఉద్యోగులపై సరైన అజమాయిషీ లేక ఇష్టారాజ్యమైపోయింది. కింది స్థాయి ఉద్యోగులు పైస్థాయి అధికారుల పేరు చెప్పి.. అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. రైతులకు పరికరాలు పంపిణీ చేసే కంపెనీలతో లాలూచీలు, వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన యంత్రాల సరఫరా చేసే టెండర్లలో అవినీతికి పాల్పడుతున్నారు. వారి అవినీతిపై విచారణ, చర్యలు తీసుకోవడంలో తాత్సారం జరుగుతుండడంతో అక్రమాలు పరంపరంగా సాగుతున్నాయి. ఆరోపణలు వచ్చిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ఓ అధికారి మళ్లీ అదే పంథాలో వెళ్లడం విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా ట్రాక్టర్లు సరఫరా చేసిన డీలర్‌ను ఇబ్బంది పెట్టిన వైనం ఆగ్రోస్‌ భాగస్వాముల్లో చర్చనీయాంశమైంది. 2009లో వరికోత యంత్రాల సరఫరాకు సంబంధించి.. తమిళనాడుకు చెందిన ఓ కంపెనీకి కొంత సొమ్ము చెల్లించి.. భారీగా నిధులు స్వాహా చేసినట్లు అప్పట్లో ఆడిట్‌ విచారణలో తేలడంతో సదరు అధికారిని సస్పెండ్‌ చేసి, క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. 2018లో రైతురథం పథకం కింద 81 మంది రైతులకు ఒక్కో ట్రాక్టరుకు రూ.7.90 లక్షలకు బిల్లు పెట్టి.. తక్కువ రకం ట్రాక్టర్లను ఇప్పించి, కంపెనీ నుంచి రూ.లక్షల్లో ముడుపులు తీసుకున్న విషయం నిర్ధారణ అయినా.. చర్యల్లేవు. గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖకు చెందిన 9 సాయిల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ.2.45 కోట్లతో పరికరాల సరఫరాకు టెండర్‌ లేకుండా డొల్ల కంపెనీ పేరుతో బంధువులతో సరఫరా చేయించడంపైనా విచారణ జరిగింది.


కంపెనీ అడ్రసు తప్పని తేలినా చర్యలు తీసుకోలేదు. ఒక్కో యూనిట్‌ రూ.12 లక్షలకు బహిరంగ మార్కెట్‌లో లభ్యత ఉండగా.. రూ.28 లక్షలపైగా చెల్లించి, ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. మరో 9 ల్యాబ్‌లకు రూ.12 లక్షల చొప్పున వచ్చే పరికరాలకు రూ.22.44 లక్షలు బిల్లు చేశారు. గత ప్రభుత్వంలో ఆగ్రోస్‌ ద్వారా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌కు సరఫరా చేసిన వెయ్యి ట్రాక్టర్లకు సంబంధించి మూడు కంపెనీల ఇన్వాయి్‌సకు, ఇన్సూరెన్స్‌ సొమ్ముకు రూ.లక్షల్లో వ్యత్యాసం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.


అర్హత లేని కంపెనీలతో..

గతేడాది వ్యవసాయ యాంత్రీకరణ సబ్‌-మిషన్‌ (ఎస్‌ఎంఏఎం) పథకం కింద రైతులకు వ్యక్తిగత వ్యవసాయ యంత్రాల పంపిణీకి సంబంధించి కంపెనీలకు సరైన అర్హత పత్రాలు లేకుండానే పరికరాల సరఫరాకు అనుమతించారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో చేతులు మారాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది మార్చిలో పీఎంకేఎ్‌సవై పథకం కింద రాయలసీమ రైతులకు వాటర్‌షెడ్‌ పరికరాల సరఫరాకు పంచాయతీరాజ్‌ శాఖ టెండర్లు పిలవాలని కోరితే.. టెండరు నిబంధనలు మార్చి.. ఎల్‌1 బిడ్‌తో గత ప్రభుత్వంలో లిక్కర్‌ స్కాంలో నిందితులకు అనుకూలంగా వ్యవహరించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో టెండరుదారులు కోర్టుకు వెళ్లారు. దీంతో రైతులకు వాటర్‌షెడ్‌ పరికరాల సరఫరా నిలిచిపోయింది. ఈ వ్యవహారంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగిని బదిలీ చేశారు. ఓ అధికారి సెలవుపై వెళ్లి తిరిగొచ్చారు. అంతకు మించి ఏమీ జరగలేదు. తాజాగా గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ట్రాక్టర్లను సరఫరా చేసినందుకు ఇన్వాయిస్‌ ప్రకారం బిల్లు పెట్టకుండా.. ఆగ్రోస్‌ అధికారి ఇబ్బందిపెడుతున్నారంటూ కడప జిల్లాకు చెందిన డీలర్‌ ఆరోపించారు. జీఎస్టీ, ఇన్యూరెన్స్‌, టీఆర్‌, యాక్సెసరీస్‌, ఇతరాలన్నీ కలిపి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5.75 లక్షలకు ఇవ్వాయిస్‌ ఇస్తే.. బిల్లు మంజూరు చేయకుండా.. ట్రాక్టర్‌ ధర రూ.5.40 లక్షలేనని... మిగతా మొత్తం ఇచ్చేది లేదని అధికారులు కొర్రీ వేశారని.. లంచాల కోసమే బిల్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. కాగా.. ఏపీ ఆగ్రోస్‌లో గత ప్రభుత్వంలో నాన్‌ ఐఏఎస్‌లను ఎండీలుగా నియమించడంతో పర్యవేక్షణ లోపించిందన్న విమర్శలొచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారూ పూర్తిగా దృష్టిసారించలేకపోతున్నట్లు తెలిసింది. ఆగ్రోస్‌ చైర్మన్‌ సుబ్బానాయుడు ఇటీవల మృతి చెందడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. దీంతో ఉద్యోగులపై అజమాయిషీ కొరవడింది. మళ్లీ కొత్త చైర్మన్‌ను, రెగ్యులర్‌ ఎండీని నియమించి, ఉద్యోగుల అవకతవకలపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 26 , 2025 | 05:43 AM