Brain Stroke: ఏపీ ఆగ్రోస్ చైర్మన్ సుబ్బానాయుడి మృతి
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:32 AM
ఆగ్రో ఇండస్ట్రీస్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు(60) సోమవారం తెల్లవారుజామున అమరావతిలోని మణిపాల్ ఆసుపత్రిలో మృతిచెందారు.
అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
పలువురు నేతల నివాళి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
కావలి,అక్టోబరు21(ఆంధ్రజ్యోతి): ఆగ్రో ఇండస్ట్రీస్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు(60) సోమవారం తెల్లవారుజామున అమరావతిలోని మణిపాల్ ఆసుపత్రిలో మృతిచెందారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో ప్రభుత్వ లాంఛనాలతో సోమవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రతినిధులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ఈ నెల 11న అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల సమీక్షలో మాలేపాటి పాల్గొని, వ్యవసాయాభివృద్ధికి సలహాలు అందచేసారు. అదే రోజు అమరావతిలోని ఇంటికి వెళ్లిన తర్వాత ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే మణిపాల్ ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి, సుబ్బానాయుడికి తగిన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ నేపథ్యంలో 11 రోజులు మృత్యువుతో పోరాడిన సుబ్బానాయుడు సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్‌లకు అధికార లాంఛనాలు లేకపోయినప్పటికి సుబ్బానాయుడి కోసం ప్రభుత్వం జీవో ఇచ్చి అధికార లాంఛనాలతో స్వగ్రామం అయిన దగదర్తిలో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు టీడీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.