Share News

ANU Engineering College: ఫీజు కడితేనే సర్టిఫికెట్‌

ABN , Publish Date - Aug 01 , 2025 | 03:41 AM

ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఫీజుల కోసం విద్యార్థులను వేధించడం సాధారణంగా జరిగేదే. అయితే ప్రభుత్వ పరిధిలో ఉండే విశ్వవిద్యాలయాలు కూడా ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయాయి.

ANU Engineering College: ఫీజు కడితేనే సర్టిఫికెట్‌

  • విద్యార్థుల జీవితాలతో వర్సిటీల చెలగాటం.. ప్రభుత్వం వద్దే రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌

  • రూ.4 వేల కోట్లకు పైగా పేరుకున్న బకాయిలు.. అయినా సొంత డబ్బు కట్టి తీసుకోవాలని పట్టు

  • ఇటీవల ఐసెట్‌ కౌన్సెలింగ్‌కు విద్యార్థులు దూరం.. ఇప్పుడు పీజీఈసెట్‌లో సీటు కోల్పోయే పరిస్థితి

  • సర్టిఫికెట్ల పరిశీలనకు ఆగస్టు 2 వరకు గడువు.. వర్సిటీలు ప్రైవేట్‌ సంస్థల్లా మారాయని ఆరోపణలు

‘ప్రభుత్వం ఫీజులు విడుదల చేసిందా.. లేదా.. అనే దానితో మాకు సంబంధం లేదు. మాకు కట్టాల్సిన ఫీజు కట్టి మీ సర్టిఫికెట్లు తీసుకెళ్లండి. ఫీజులు కట్టకుండా సర్టిఫికెట్లు ఇవ్వలేం.’

- ఏఎన్‌యూ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ లింగరాజు విద్యార్థులతో కరాఖండిగా చేసిన వ్యాఖ్యలివి...

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఫీజుల కోసం విద్యార్థులను వేధించడం సాధారణంగా జరిగేదే. అయితే ప్రభుత్వ పరిధిలో ఉండే విశ్వవిద్యాలయాలు కూడా ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయాయి. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. డిగ్రీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఆపేయడంతో ఇటీవల జరిగిన ఐసెట్‌ కౌన్సెలింగ్‌లో వందలాది మంది సీటు పొందే అవకాశం కోల్పోయారు. ఇప్పుడు ఇంజనీరింగ్‌ విద్యార్థులు కూడా ఎంటెక్‌, ఎం.ఫార్మసీ (పీజీఈసెట్‌)లో సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రైవేటు విద్యాసంస్థలు కూడా విద్యార్థులకు సర్టిఫికెట్లు నిలిపివేయకూడదని మంత్రి లోకేశ్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. అయితే విద్యాశాఖ పరిధిలోనే ఉన్న వర్సిటీలే మంత్రి ఆదేశాలను ఖాతరు చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 24 యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 7,700 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వర్సిటీ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తిస్తుంది. కన్వీనర్‌ కోటాలో సీటు పొంది 2024-25 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులకు 2023-24లో మూడు క్వార్టర్లు, 2024-25లో మూడు క్వార్టర్లు చొప్పున ఆరు విడతల ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయి.


రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి దాదాపు రూ.64వేల వరకూ విడుదల కావాలి. అంత డబ్బు సొంతగా కట్టలేని విద్యార్థులు ఇప్పుడు ఎంటెక్‌లో చేరే అవకాశం కోల్పోతున్నారు. పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు ఆగస్టు 2 వరకు గడువు ఉంది. ఆలోగా ఇంజనీరింగ్‌ సర్టిఫికెట్లు చేతికి వస్తేనే కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. లేకుంటే ఎంటెక్‌లో చేరేందుకు వచ్చే సంవత్సరం వరకూ ఎదురు చూడాలి. దీంతో పలువురు విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం యూనివర్సిటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

భారీగా ఫీజు బకాయిలు

వైసీపీ ప్రభుత్వంలో ఉన్నత విద్య ఫీజులను తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేసేవారు. అయితే వాటిని సకాలంలో విడుదల చేయకుండా 2023-24లో మూడు క్వార్టర్ల ఫీజులు దాదాపు రూ.2,100 కోట్లు బకాయి పెట్టింది. విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం 2024-25 నుంచి నేరుగా కాలేజీల ఖాతాలకే ఫీజులు జమ చేసేలా విధానాన్ని మార్చింది. ఆ విద్యా సంవత్సరంలోనూ మూడు క్వార్టర్ల ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా ఆరు క్వార్టర్ల ఫీజులు రూ.4వేల కోట్లకుపైగా ప్రభుత్వం వద్ద బకాయిలు ఉండిపోయాయి.

వర్సిటీ ఖాతాకు జమ చేస్తే...

2024-25 విద్యా సంవత్సరం ఫీజులు నేరుగా కాలేజీలు, వర్సిటీలకే వెళ్తాయి. 2023-24 ఫీజులు తల్లిదండ్రుల ఖాతాలకు జమ కావాలి. అయితే ఆ సంవత్సరానికి సంబంధించి ఫీజులను తల్లిదండ్రులకు కాకుండా నేరుగా కాలేజీలు, వర్సిటీలకు ఇచ్చేలా అంగీకారం తెలుపుతున్నట్లు విద్యార్థుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. దీంతో ఆ రెండు విద్యా సంవత్సరాల ఫీజులు కాలేజీలు, వర్సిటీలకే వెళ్తాయి. ఒకవేళ ఇప్పుడు విద్యార్థులు సొంతంగా ఫీజులు చెల్లిస్తే ఆ తర్వాత ప్రభుత్వం నగదు విడుదల చేసిన తర్వాత తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని విద్యార్థులు కాలేజీలు, యూనివర్సిటీల చుట్టూ తిరగాల్సి ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - Aug 01 , 2025 | 03:44 AM