Androth: నేవీ చేతికి మరో నౌక
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:19 AM
భారత నౌకాదళం చేతికి మరో నౌక రానుంది. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ఏఎస్‌డబ్ల్యూ - ఎస్‌డబ్ల్యూసీ)గా వ్యవహరించే ఈ నౌక పేరు ఆండ్రోత్.
6న ‘ఆండ్రోత్’ కమిషనింగ్
విశాఖపట్నం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళం చేతికి మరో నౌక రానుంది. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్(ఏఎస్‌డబ్ల్యూ - ఎస్‌డబ్ల్యూసీ)గా వ్యవహరించే ఈ నౌక పేరు ‘ఆండ్రోత్’. దీనిని అక్టోబరు 6న విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళంలో, ఇక్కడి నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్ కమిషనింగ్ చేయనున్నారని నేవీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ తరహా నౌకలు మొత్తం 16 తయారవుతుండగా అందులో ఇది రెండోది. కోల్‌కత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ దీనిని నిర్మించారు. ఇందులో 80 శాతం పరికరాలు దేశీయ తయారీ కావడం విశేషం. లక్షదీవుల్లోని ఒకటైన ఆండ్రోత్ పేరును ఈ నౌకకు పెట్టారు. దీనికి ముందు ఇదే పేరుతో ఐఎన్‌ఎస్ ఆండ్రోత్(పీ 69) 27 ఏళ్లు సేవలందించి, విరామం తీసుకుంది. కొత్త నౌకకు అధునాతన కమ్యూనికేషన్ సిస్టమ్స్ అమర్చారు. నీటి లోపల ఉన్న శత్రువుల సబ్‌మెరైన్లను గుర్తించి, ఎటు వెళుతున్నదీ గమనించి, వాటిని కదలకుండా చేయగల సత్తా దీనికి ఉంది. సముద్రంలో నిఘా, గాలింపు, సహాయక చర్యలకు దీనిని ఉపయోగించుకోవచ్చు.